Suryaa.co.in

Devotional

పరివర్తనే ఆధ్యాత్మిక మార్గం

మార్పు మనిషి ప్రతి దశలోనూ సహజం. ఎదుగుదల సృష్టిలో చరాచర ప్రకృతికి ఎంతో అవసరమైన జీవన క్రియ. ప్రగతికి దోహదం చేసేది పరివర్తనే. ఎలా ఉన్నా, ఏది లేకున్నా, మన కర్తవ్యంతో నిమిత్తం లేకుండా మార్పు సంభవిస్తుంటుంది. ఆకలి, భయం, నిద్ర, మైథునాలు ప్రతి ప్రాణికీ ఉండే శారీరక చర్యలు. వాటిని మించి మనిషికి భగవంతుడు బుద్ధిని ఇచ్చి లోక ప్రయోజనాన్ని ఆశించాడని శంకరాచార్య తమ భజగోవిందంలో చెబుతారు. తనకిచ్చిన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతిని రక్షించి, జీవించే హక్కును అన్ని ప్రాణులకు కల్పించి, భగవంతుడి సృష్టిని కాపాడే బాధ్యత మనిషికి దేవుడు కట్టబెట్టిన
కర్తవ్యం.

సమాజాన్ని సృష్టించింది భగవంతుడే అయినా- దాని స్థితిని, పోషణను మానవ ధర్మంగా శాసించాడు. వాటిని మనిషికి వేదాలుగా, శాస్త్రాలుగా, ఉపనిషత్తులుగా మలచి రుషులు ద్వారా ప్రబోధించాడు. మనిషికి దేవుడి శాసనమిది!
నోరు లేని, కదలలేని ప్రకృతిని మనిషి తన స్వార్థానికి బలిచేయడం అనాదిగా చూస్తున్న అరాచక ప్రవృత్తి. ఆకలి కోసం ఇతర ప్రాణులు ఆహారాన్ని సంపాదిస్తాయి. రేపటి కోసం మనిషి నేటి సంపదను దోచుకుంటూ ఇతరులకు అందకుండా
సంపాదిస్తున్నాడు. మనిషిలోని స్వార్థం, ద్వేషం, అరాచకత్వం నుంచి బయటపడి లోకరక్షణే ధ్యేయం కావాలని భగవంతుడు ఆదర్శాన్ని బోధించడానికి అవతారాలు దాల్చాడు. దుర్గుణాలు పెరిగితే రాక్షసుడు, సద్గుణాలు విస్తరిస్తే దేవతలు. మనిషిని సంకుచితం నుంచి దైవత్వానికి నడిపించే మార్గాన్నే ఆధ్యాత్మిక మార్గంగా మహర్షులు అందించారు.

బాధలు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు ప్రతి మనిషి తాను మారాలని ఆలోచిస్తాడు. ఈ ఉపద్రవం నుంచి బయటపడితే చాలు, తన జీవన విధానాన్ని మార్చుకోవాలని ఆవేదన చెందుతాడు. కేవలం అది ఆపద్ధర్మమే. కష్టాలు తీరగానే మనిషి సహజ గుణమైన స్వార్ధం ఎగదన్నుతుంది. కొద్దికాలమే మార్పు వస్తే అది ఆత్మవంచనే కాని ఆధ్యాత్మికం కాదు. పరివర్తన అనేది శాశ్వతమైన సత్య స్వరూపం. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, స్తోత్ర పారాయణలు మాత్రమే ఆధ్యాత్మికత కాదు. అవి పవిత్ర కర్మలు. లోక ప్రయోజనాన్ని కూర్చే సేవాతత్వమే సత్యమైన బాట.

శ్రీరాముడు వనవాసం చేయడం ఆధ్యాత్మిక ప్రగతి ప్రయాణంగా రామాయణం చెబుతుంది. రామ వనవాసం వల్ల కుటుంబంలోని స్వార్ధపరులకు కనువిప్పు, ప్రజలకు నీతిమంతమైన ఆదర్శ జీవనం, మహర్షులకు రక్షణ, రాక్షసత్వానికి శిక్ష… ఇలా ఎన్నో ప్రయోజనాలు సిద్ధించాయి. అటువంటి ఉన్నతమైన పరివర్తనే ఆధ్యాత్మికత లక్ష్యం.
హింసా మార్గం నుంచి ఆహింసకు నడిపించేదే అసలైన ఆధ్యాత్మిక మార్పుగా బుద్ధుడు బోధించాడు.
అన్ని ధర్మాల్లో అహింస పరమధర్మమని బౌద్ధం ప్రకటించింది.
మతం ఏదైనా అవి నిర్మించిన మానవతా సౌధాలు మాత్రం- మనిషిలోని మానసికమైన మార్పులు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస పరివర్తనకు మూల సూత్రాలుగా భగవద్గీత, భక్తిసూత్రాలు ప్రకటించాయి.
ఏ క్రతువులు చేయకున్నా- మనిషి తనలోని దుర్గుణాలను మార్చుకుని విశ్వ శ్రేయస్సుకు సద్గుణవంతమైన ఒక్క ఆలోచన చేస్తే అదే అతణ్ని మాధవుణ్ని చేస్తుంది.

భగవాన్ ఉవాచ:
మనం చేయవలసిందల్లా మౌనంగా ఉండటమే.
శాంతి మన అసలు స్వభావం.
మనం దానిని పాడు చేస్తాము.
కావల్సిందల్లా మనం దానిని పాడుచేయడం మానివేయటం.
మనము శాంతిని కొత్తగా సృష్టించడం లేదు.
ఉదాహరణకు ఒక హాలులో ప్రదేశముంది.
మనము వివిధ వస్తువులతో ఆ స్థలాన్ని నింపుతాము.
మనకు ఆ ప్రదేశం కావాలంటే, మనం చేయాల్సిందల్లా ఆ వస్తువులన్నింటినీ తీసివేయడమే. అప్పుడు మనకు ఖాళీ లభిస్తుంది.
అదేవిధంగా మన మనస్సులోని చెత్తను, ఆలోచనలన్నింటినీ తొలగిస్తే, మనస్సనే ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంది. శాంతి ఒక్కటే వాస్తవం……………..

– వి . లక్ష్మి శేఖర్

LEAVE A RESPONSE