హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.
బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు.
ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు.