– అందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈనెల 4న జరిగిన సంఘటనపై నిజానిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పట్టుబట్టారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ…
ఫిర్యాదు చేసేది పోలీసులే, కేసులు రిజిష్టర్ చేసేది పోలీసులే, దర్యాప్తు చేసేది పోలీసులే, ముద్దాయిలను అరెస్టు చేసేది పోలీసులే.. చివరకు ఛార్జ్ షీట్ వేసేది కూడా పోలీసులే. అన్నీ పోలీసులే చేస్తే, దర్యాప్తు వందకు వంద శాతం వారికే అనుకూలంగా వుంటుంది.. ప్రత్యర్థులకు అన్యాయం జరుగుతుంది.
అందుకే హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో కేసు దర్యాప్తు చేయించి నిజా నిజాలు వెలికితీయాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట మేరకు నడిచే డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి దర్యాప్తు చేస్తే నిజా నిజాలు బయటపడవు.. వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే చేస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇలాఖాలో తప్పుడు ప్రాజెక్టుల పేరిట 8 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం బయటపడుతుందని చంద్రబాబు పర్యటనలో పోలీసులను ఉసిగొలిపారు.
మండల కేంద్రమైన అంగళ్లు లో వాహనాలను తగులబెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తలలు పగులగొడ్తే కేసు లేదు. మొలకలచెరువులో దౌర్జన్యంగా చంద్రబాబు కాన్వాయ్ పైకి దూసుకొచ్చిన వైసీపీ వారిని నిలువరింపజేసిన సీఐ సాదిక్ అలీని అభినందించాల్సింది పోయి.. అతనిని ఆగమేఘాలపై బదిలీ చేయటం ఈ ప్రభుత్వ దగాకోరుతనానికి నిదర్శనం. జరిగిన సంఘటనలో లేని వెంకటగిరి కోట వాసి రంగనాథ్ ను ఏ30 ముద్దాయిగా పెట్టారు.
అతను ఆ సమయానికి పుంగనూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వి. కోట పోలీసు స్టేషన్ లో ఉన్నాడు. ఆ వ్యక్తిపై కేసెలా పెడతారు? తెలుగుదేశం పార్టీపై దాడి చేస్తే మామూలు కేసులు.. ఇతరులపై దాడి చేస్తే సెక్షన్ 307(హత్యాయత్నం) కేసులుగా నమోదు చేయటం ఈ కేసు విచారణ న్యాయంగా జరగదనటానికి నిదర్శనం.
పుంగనూరు వైసీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు ముందు రోజు నుండే చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలో తిరగనీయమని సవాళ్లు చేస్తున్న వీడియోలు బహిరంగమయ్యాయి. రాష్ట్రమంతా సోషల్ మీడియాలో చూశారు. మరి ఈ సవాళ్లు చేసిన పుంగనూరు వైసీపీ నేతల్ని ఎందుకు ముందస్తు అరెస్టులు చేయలేదు? పోలీసు అధికారులు పెద్దిరెడ్డి క్రిమినల్ చర్యల్లో భాగస్తులయ్యారని స్ఫష్టమౌతోంది.
చల్లా రామచంద్రారెడ్డి పీఏను హింసించి తప్పుడు స్టేట్ మెంట్ రాయించుకొని పెద్దిరెడ్డికి అనుకూలంగా అధికారుల చేత తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారు. పెద్దిరెడ్డి క్రిమినల్ వ్యూహ రచన చేసి దాన్ని చల్లా రామచంద్రారెడ్డి కి అంటగట్టే కుట్ర చేస్తున్నారు. పాలసముద్రం పోలీసు అధికారి బి. ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు ఇన్ ఛార్జ్ చల్లబాబుతో పాటు 37 మంది పై అక్రమ కేసులు పెట్టారు.
ఇందులో నిందితుల జాబితాలో ఏ 30 గా పలమనేరు నియోజకవర్గంలోని వి. కోట మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు రంగనాథ్ పేరు పెట్టారు. రంగనాథ్ స్వగ్రామం అనంతపురంలో 4.8.2023 సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైసీపీ, టీడీపీ పక్షాల మధ్య ఘర్షణ జరగడంతో ఎస్. ఐ మనోహర్ అక్కడ లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు వి. కోట పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పుంగనూరులో అదేరోజు సాయంత్రం 4.45 గంటలకు పోలీసులపై దాడి చేసిన కేసులో రంగనాథ్ ను ఏ 30 వ నిందితుడిగా అక్రమంగా కేసు నమోదు చేశారు.
దాదాపు ఒకే సమయంలో రంగనాథ్ వి కోటలోను, అక్కడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుంగనూరులో ఎలా వుండగలరో ఎస్. పీ గారు సమాధానం చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే పెద్దిరెడ్డి ఇచ్చిన పేర్లను పోలీసులు కేసులో ఇరికించారు. ఇవేకాక మద్యం రేట్లను ప్రశ్నించిన దళిత యువకుడు ఓంప్రతాప్ పంగనూరులో శవమై తేలాడు. రామచంద్రయాదవ్ ఇంటిని ధ్వంసం చేయించాడు.
జడ్జి రామకృష్ణపై అక్రమ కేసులు పెట్టించి అతన్ని జైలుపాలు చేశారు. అతని తమ్ముడు ఇంటిపై దాడి చేయించాడు. మొలకలచెరువు జడ్.పి.టిసి భర్త కొండ్రెడ్డిపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. పెద్దఉప్పరపల్లెలో టీడీపీ సానుభూతిపరులైన రైతులకు చెందిన మామిడి చెట్లను 1500 ఎకరాల్లో పెరికించివేశారు. బల్క్ మిల్క్ సెంటర్లను మూయించి వేసి తన సొంత డెయిరీ శివశక్తి డైరీ ద్వారా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు.
వలిగట్ల వాగు నుంచి రోజుకు 150 ట్రక్కులు ఇసుక బెంగుళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన సిగ్మా కంపెనీకి మద్యం ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టు కొట్టేసి దోపిడీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఒక మద్యం డిస్టలరీ స్వాధీనం చేసుకుని దోపిడీ చేస్తున్నారు.
ఇలా రూ.40 వేల కోట్లు దోపిడీ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ మరియు అలిపిరి క్లైమోర్ బాంబు బ్లాస్టు కేసులో నిందితుడైన కొల్లం గంగిరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లి కలిశాడు? పెద్దిరెడ్డి కుటుంబానికి క్రిమినల్ రికార్డు వుంది గాని టీడీపీ నేతలకు లేదు. క్రిమినల్ రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు చేస్తున్నది పెద్దిరెడ్డి కుటుంబమే.
వీటన్నింటిని కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబునాయుడు పర్యటనలను అడ్డుకుంటూ.. అరాచకాలు సృష్టిస్తున్నారని ఏదేమైనా పుంగనూరులో ఈనెల 4న జరిగిన సంఘటనపై నిజానిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.