– స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు
– మంత్రి నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు
– విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చారు
– రామచంద్రపురం కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు
రామచంద్రపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రామచంద్రపురం నియోజవర్గంలో కూటమి నాయకులు సోమవారం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.
రామచంద్రపురంలోని ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం సూచనల మేరకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ, కొమరిన వీర్రాజు, పట్టణ అధ్యక్షులు కడియాల రాఘవన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తొలుత కేకు కోసి మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ .. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల్లో విశేష ఆదరణ లభించింది అన్నారు. మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగిన ఈ యువగళం పాదయాత్ర ఇటు పార్టీలోనూ అటు ప్రజల్లోనూ జవసత్వాలు నింపిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనదైన శైలితో ప్రజా రంజక పాలన అందిస్తున్నారని ప్రసంశించారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలే ధ్యేయంగా అందరికీ అందుబాటులో ఉంటున్నారన్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ చేసిన కృషి గొప్పదన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని అన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కుడా స్వర్గీయ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించి పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారన్నారు. తన తండ్రి, స్వర్ణాంధ్ర రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పించటంతో పాటు, కోటి మందికి పైగా సభ్యత్వాలు నమోదు ప్రక్రియలో విశేషంగా కృషి జరిపారన్నారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గంలోని కూటమి నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.