Suryaa.co.in

Andhra Pradesh

వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద అర్హులకు రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం

-నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా అందించడం ప్రభుత్వ బాధ్యత.. సీఎం జగన్
-ఈ నెల 18న ప్రారంభోత్సవం.. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో అర్హులైన వారికి వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమం సాగాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రభుత్వం ప్రజలకు హక్కుగా అందించాలనే లక్ష్యంతో అత్యంత మానవీయ దృక్పథంతో అడుగులు వేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిమితిని రూ. 25 లక్షలకు పెంచిన అనంతరం సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందని వివరించారు. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని, ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని పేర్కొన్నారు. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజునుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసిందని, వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

న్యాణ్యమైన వైద్యానికి భరోసాగా వైయస్సార్ ఆరోగ్య శ్రీ
ప్రజలకు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ లో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకునేందుకు(ఫాలో అప్‌ కన్సల్టేషన్‌) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రోగులుగా గుర్తించిన వారికి ఆస్పత్రులకు వెళ్లేందుకు రూ.500లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ కూడా ఈ వీడియోను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఈ నెల 18న సీఎం జగన్ చేతుల మీదుగా వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ ప్రారంభం
ఈ నెల 18న వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితం కార్యక్రమం ప్రారంభించనున్నారు. 19న ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనన్నారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టున్నట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ చేపట్టి జనవరి నెలాఖరు నాటికి కార్డుల పంపిణీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

దీంతోపాటు వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓ, ఆశావర్కర్లు, వాలంటీర్, మహిళా పోలీసులు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ సహా, ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో అవగాహన పెంచే ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్లోడ్‌ చేయించి ఎలా వినియోగించాలో వివరిస్తారని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి ఫేజ్‌–2 ఆరోగ్య సురక్ష
జనవరి 1వ తేది ఫేజ్‌–2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించాలని, జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం, అర్బన్‌ ప్రాంతాల్లో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించాలని సూచించారు. దీంతో పాటు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్‌ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫ్యామిలీ డ్యాక్టర్‌ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేసి మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్య చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి రావాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, దీంతో పాటు యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ కూడా తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

LEAVE A RESPONSE