డిజిపిగా తమరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పోలీసుల పనితీరు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంది. మీ నేతృత్వంలో పోలీసులు కాపాడబడిన అధికార వైసీపీ నాయకులే నేడు పోలిసుశాఖను దయ్యాల మాదిరి వెంటాడుతున్నారు. పోలీసులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడం, పరుష పదజాలంతో దుర్భాషలాడడం వంటి ఘటనల పరంపరలో నిన్న విశాఖలో శారదా పీఠం ప్రధాన ద్వారం వద్ద జరిగిన ఘటన తాజాది.
9 ఫిబ్రవరి 2022న, పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి శారదా పీఠానికి వెళ్లారు. డ్యూటీలో ఉన్న సీఐ ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా మంత్రి అనుచరులను లోపలికి అనుమతించలేదు. దీంతో మంత్రి సీదిరి అప్పలరాజు రెచ్చిపోయి సీఐని పరుష పదజాలంతో దూషించి తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. నెట్టారు.
గతంలో వైసీపీ నాయకులు విధుల్లో ఉన్న పోలీసు అధికారులను బెదిరించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, పోలీసు అధికారులతో వాదించినందుకు నాపై కేసులు పెట్టి ఆర్టికల్ 14ను నేరుగా ఉల్లంఘించారు. నేను ఎలాంటి దుర్భాషలు. బెదిరింపులు, భౌతికంగా అడ్డగించడం చేయక పోయినా నాపై కేసు పెట్టారు. నాపై కేసు పెట్టడం డీజీపీ గారి నాయకత్వంలో పని చేస్తున్న పోలీసుల వక్ర స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ప్రతిపక్ష నాయకులపై, సాధారణ ప్రజలపై పోలీసులు కేసులు పెట్టడం, వైసీపీ నాయకులను విడిచిపెట్టడం లాంటివి చూస్తుంటే డీజీపీ నాయకత్వంలో “చట్టం ముందు అందరూ సమానులే” అన్న సూత్రం అమలవుతున్నట్లు లేదు. ఈ సందర్భంగా నేను మీకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ను గుర్తు చేయాలనుకుంటున్నాను.
చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల సమాన రక్షణను రాష్ట్రం ఏ వ్యక్తికి నిరాకరించకూడదు. భారత రాజ్యాంగాన్ని.. ప్రత్యేకించి ఆర్టికల్ 14ను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ అధికారిని విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం, అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం, తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించడం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడిన మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేయండి.
సీఐని నెట్టిన మంత్రి వీడియోను సాక్ష్యంగా ఈ లేఖతో జతచేస్తున్నాను. చట్టం ప్రకారం మంత్రిపై తగిన చర్య తీసుకోవడానికి ఇదే సరైన సమయం. లేదంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించవలసి వస్తుంది.