Suryaa.co.in

Devotional

నేడు వసంత పంచమి

వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని “శ్రీ పంచమి” అని, “మదన పంచమి” అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని , దానములు చేయవలెనని , దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. “మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను” అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.

వసంత పంచమి విశిష్టత
సరస్వతీ దేవిని మాఘ పంచమినాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు , కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని , ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి , అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ , ఆలోచన , ప్రతిభ , ధారణ , ప్రజ్ఞ , స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.

‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని , పంచమినాడు సప్తమి తిథులలో కాని , సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ , పుస్తకం , జపమాల , అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోను , శ్వేత వస్త్రాలతోను , శ్రీగంథముతోను , అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని , నేతితోకూడిన వంటలను , నారికేళము , అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.

‘‘వాగేశ్వరీ , మహాసరస్వతి , సిద్ధసరస్వతి , నీలసరస్వతి , ధారణ సరస్వతి , పరాసరస్వతి , బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ…. ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం , పురాణాలు , గ్రంథాలు , కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు , ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

విద్యాభ్యాసానికి ప్రారంభం – అక్షరాభ్యాసం ! అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. “అక్షరం ” అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్ధం. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ….అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా…”
అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్ధించడం ఆచారం! చదువుల తల్లి…అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతిజన్మదినo – మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే – శ్రీ పంచమి . దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీ దేవి అహింసా దేవత! చల్లని తల్లి! బ్రహ్మవైవర్త పురాణం లో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ రాధాదేవి…అనే ఐదుగురు ప్రకృతి శక్తులనీ..వీరిలో మూడో శక్తులని, వీరిలో సరస్వతి పరమాత్మనుంచి వచ్చిన ఉద్భవించిన వాణికి, విద్య, ఙ్ఞాన ,బుద్ధులనీ చెప్తోంది. అటువంటి ఙ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, ఙ్ఞానప్రాప్తి కలుగుతుంది అని పురాణ వచనం. శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతం లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన ఙ్ఞానం లభిస్తుంది ..నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న…అలాంటి మొదలైన పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్య ని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు,, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు.

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

బ్రాహ్మణ చైతన్య వేదిక

LEAVE A RESPONSE