Suryaa.co.in

Andhra Pradesh

అన్నా చెల్లెళ్ల యుద్ధంతో తల్లికి సంకటం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి వద్దకు ఆమె వెళ్లారు. కుమారుడు వైఎస్ జగన్‌, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో? ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది.

ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల ఢీకొంటున్న సంగతి తెలిసిందే. జగన్ పై షర్మిల విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. షర్మిల తీరుపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కూతురు ఇద్దరి మధ్య ఆమె నలిగిపోతున్నారు. అన్నాచెల్లెళ్ల ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరికి మద్దతిస్తే.. ఇంకొకరికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మధ్య మార్గంగా అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

జగన్, షర్మిల ఇద్దరిపై విజయమ్మకు ఒక తల్లిగా అంతులేని ప్రేమ ఉంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సమయంలో ఇడుపులపాయలో ప్రార్థనలు చేసి, జగన్ ను ఆశీర్వదించి పంపారు. అదే విధంగా షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన సమయంలో ఇడుపులపాలో ప్రార్థనలు చేసి, కూతురుని దీవించి పంపారు.

LEAVE A RESPONSE