విక్రమ్‌ పూల‘ మహాస్వాప్నికుడు’ కు మహా డిమాండ్‌

(మార్తి సుబ్రహ్మణ్యం)

‘జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల’ అన్నది ఆర్యోక్తి. రచనాశైలిలో సుప్రసిద్ధ పాత్రికేయుడు పూల విక్రం గారి గురించి చెబితే అలాగే ఉంటుంది. చాలామంది జర్నలిస్టులలో ఉండే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’.. అంటే బతకనేర్చిన కళ ఆయనలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. విక్రం తరం నాటి జర్నలిస్టులు-ఆ తర్వాత వచ్చిన చాలామంది పాత్రికేయులు కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో రాణించిన వైనం నాకు తెలుసు. కానీ నాకు తెలిసిన విక్రం గారు రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉండేవారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. అదీ ఆయన వ్యక్తిత్వం. ఆత్మగౌరవం-ఆత్మవిశ్వాసమే దానికి కారణం.

ఇప్పుడు ప్రతిభ ప్రాతిపదిక కాకుండా కేవలం కులం ప్రాతిపదికన అందలమెక్కుతున్న జర్నలిస్టులతో పోలిస్తే, విక్రం గారు అలాంటి బతకనేర్చిన విద్యలో వెనకబడినట్లే లెక్క.

విక్రం గారికంటే ముందు- తర్వాత.. జర్నలిజం లోకి వచ్చిన చాలామంది జర్నలిస్టులు-జనరలిస్టులు- లాబీయిస్టులు పాలకులను ఏదో ఒక కార్డుతో పట్టేసి, జీవిత వైకుంఠపాళిలో నిచ్చెనలెక్కిన వారిని నేను స్వయంగా చూశా. ఆ ప్రకారం పెద్దగా ప్రతిభ లేకపోయినా, పీఏ-పీఆర్వో-ఓఎస్డీ లాంటి పదవులు దక్కించుకున్న వారు కోకొల్లలు. అలాంటి ‘రాయని భాస్కరుల’కు పెద్ద పదవులు దక్కిన సందర్భాన్నీ చూశా.

పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాని ఇలాంటి రాయని భాస్కరులు, ప్రెస్ అకాడెమీ చైర్మన్లు అయిన దురదృష్ట పరిస్థితీ చూశా. రోజువారీ సమాచార శాఖ ఇచ్చే కథనాలను కట్ అండ్ పేస్ట్ చేసి, వాటిని పుస్తకాలు వేసి.. సీఎంలతో ఆవిష్కరింపచేసి, ప్రెస్‌అకాడెమీ చైర్మన్లు అయిన వారి ముఖాలు కూడా నాకు తెలుసు. కేవలం యాజమాన్యాలను మెప్పించి, వారికి ఇష్టులుగా మారి.. ఆ పేరుతో చీఫ్ రిపోర్టర్లు, బ్యూరో చీఫ్‌లు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్లూ అయి, తర్వాత ప్రెస్ అకాడెమీ చైర్మన్లుగా రూపాంతరం చెందిన ‘జనర లిసు’్టలనూ చూశా. పూల విక్రం గారి శైలి అందుకు పూర్తి విరుద్ధం.

మరోవైపు ప్రతిభతో పనిలేకుండా.. కేవలం కులాన్ని అడ్డుపెట్టుకుని, ఆ కార్డుతో పదవులు పొందిన వారి యవ్వారానికి, నాలాంటి చాలామంది జర్నలిస్టులు సజీవ సాక్షులం. కానీ విక్రం గారు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ వేతనజీవి కోణంలోనే బతికేస్తున్నారు. పుస్తక అనువాదాలు, ఏదో ఒక చానెల్‌లో ఇంకా ఉద్యోగం చేయాలన్న సగటు ఉద్యోగి మాత్రమే ఆయనలో కనిపిస్తారు. అదే వారికీ, ఆయనకూ తేడా!

పుస్తకాలు చాలామంది రాస్తుంటారు. వారిలో కొందరికి ఘోస్టులుంటారు. మరికొందరు రోజువారీ పత్రికల్లో వచ్చే వార్తలను గుదిగుచ్చి, సేమ్‌టు సేమ్ కాపీ పేస్టు చేసి, పార్టీ నేతలిచ్చే చ ందాలతో పుస్తకాలు వేస్తుకుని బతికేస్తుంటారు. దానిపేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏదో ఒక పదవి తీసుకునే రాయనిభాస్కరులను, నా జర్నలిజం జీవితంలో చాలామందిని చూశా. వారికీ, విక్రం లాంటి జర్నలిస్టులకూ తేడా ఏమిటంటే.. ఆర్ట్ ఆఫ్ లివింగ్. విక్రం లాంటి వారికి బతకనేర్చే కళ తెలియకపోవడం.

పూల విక్రం గారు నాకు రెండు దశాబ్దాలకుపైగా పరిచయం. 1989లో నేను ‘కృష్ణాపత్రిక’లో పనిచేసే సమయంలోనే, విక్రం గారు జర్నలిస్టుగా లబ్ధప్రతిష్ఠులు. తర్వాత నేను ‘మనదేశం’ పక్షపత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, ఆయన ‘పల్లకి’ వారపత్రికకు సారథి. ఆయనలో సగటు ఉద్యోగి కోణం తప్ప, తన స్థానం-పరిచయాలు అడ్డుపెట్టుకుని, అడ్డదారిలో పైకి వెళ్లిపోవాలన్న ఆలోచన అసలు కనిపించదు. తనకు నచ్చనిచోట ఉండని వ్యక్తిత్వం. లాబీయింగ్ చేసే ఆర్ట్ ఆయనలో అసలు కనిపించదు. సునిశిత పరిశీలన, విశ్లేషణలో ఆయనది ప్రత్యేక శైలి. సమాజాన్ని అర్ధం చేసుకోవడంలో విక్రం గారి కోణం విభిన్నం.

ఆ తర్వాత టీడీపీ లైబ్రరీలో ఆయనతో నాకు పరిచయం మరింత పెరిగింది. చంద్రబాబు సీఎంగా ఉన్నా, విపక్ష నేతగా ఉన్నా విక్రం గారే ఆయన ప్రసంగాలు తయారుచేసేవారు. దానికోసం లైబ్రరీలో అనేక పుస్తకాలు, తెలుగు-ఇంగ్లీషు పత్రికల్లో వచ్చే వ్యాసాలూ అధ్యయం చేసేవారు. గణాంకాలు నోట్ చేసుకునేవారు. జర్నలిస్టులతో పిచ్చాపాటీ మాట్లాడేవారు. కింద మెస్‌లో జర్నలిస్టుల నుంచి సమాచారం తీసుకునేవారు.

అప్పట్లో చంద్రబాబుకు జాతీయ ఖ్యాతి ఉండేది. జాతీయి స్థాయిలో ఆయన చక్రం తిప్పుతున్న రోజులవి. అలాంటి నేత ప్రసంగానికి, స్పీచ్ పాయింట్లు తయారుచేసి ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఆయన స్థాయికి తగ్గ ప్రసంగం తయారుచేయడమంటే కత్తిమీద సాము. ఆ విషయంలో విక్రం గారు వందకు వంద మార్కులూ కొట్టేశారు.

ఆరోజుల్లో హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి వంటి ప్రముఖులు పర్మినెంటుగా కనిపించేవారు. రావుల-దాడి-కడియం ముగ్గురూ పుస్తకాల పురుగులే. సమాచార అన్వేషకులే. ముగ్గురూ సాత్వికులే. వ్యంగ్యాస్త్రాలలో రావులకు ఎవరూ సరిరారు. మంచి వ్యూహకర్త, విధేయత, విషయ పరిజ్ఞానం దండిగా ఉన్న రావుల సలహాలను చంద్రబాబు గౌరవించేవారు. అందుకే కొద్దికాలం క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని కంటే ముందు, రావులనే ఉండమని స్వయంగా చంద్రబాబు సూచించారు. అది వేరే విషయం.

టీడీపీ లైబ్రరీ సందర్భం వచ్చిందికాబట్టి దానిగురించి కాసేపుమాట్లాడుకుందాం. చంద్రబాబునాయుడుకు పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత చిత్తూరులో ఆయన మిత్రుడు డాక్టర్ జబాష్ గారికి లైబ్రరీ రూపు-నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. దేశంలోని ఇతర పార్టీ ఆఫీసులు ఎలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేసేందుకు డాక్టర్ జబాష్ గారు, తమిళనాడు లోని డిఎంకె-అన్నా డిఎంకె, కోల్‌కత్తాలోని సీపీఎం కార్యాలయాలకు వెళ్లి అక్కడి లైబ్రరీల రూపు పరిశీలించారు. టీడీపీ ఆఫీసులో కూడా ఆమేరకు కొన్ని మార్పులు చేసి, అద్భుతమైన లైబ్రరీకి ప్రాణం పోశారు.

విషయ సమాచారం ఉండే తెలుగు-ఇంగ్లీషు పుస్తకాలు, మ్యాగజైన్లు తెప్పించారు. ఆ తర్వాత దానిని డిజిలైటేషన్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇచ్చే నోట్స్, పుస్తకాలు, వివరణ పత్రాలను కూడా నోట్ చేసేందుకు, డిజిజలైజేషన్ చేసే సంస్కృతి తొలుత తెలుగు రాష్ట్రాల్లో మొదలయింది టీడీపీ ఆఫీసు లైబ్రరీ నుంచే! అలా ఇప్పటికీ దేశంలోని అన్ని పార్టీల్లో అద్భుతమైన లైబ్రరీ ఉన్న రెండు మూడు పార్టీలలో టీడీపీ ఒకటి.

అలాంటి విశేష అనుభవం ఉన్న విక్రం గారు రాసిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకం.. ప్రచురించిన అనతికాలంలో మూడవ ముద్రణకు వెళ్లడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. సహజంగా మార్కెట్‌లో సరుకు లేకపోతే, ఏ వస్తువూ అమ్ముడుపోదు. ఎవరైనా డబ్బులిచ్చి కొనుక్కోవలసిందే కాబట్టి, అందులో సరుకు లేకపోతే ఎవరూ కొనరు. అలాంటిది మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులో ప్లస్-మైనస్సులను విశ్లేషిస్తూ.. విక్రం గారు రాసిన ఈ పుస్తకం వెలువడిన అతి తక్కువ రోజుల్లోనే, మూడవ ముద్రణకు వెళ్లడమంటే ఆషామాషీ కాదు.

అందులో విక్రం గారి శ్రమ, శోధన, అనుభవం, సమాచార సేకరణ ఎంతో ఉంటేగానీ అది సాధ్యం కాదు. ఏదేమైనా విక్రం గారి కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది. పాఠకులు ఆయనలోని పరిశోధకుడిని గుర్తించినట్లే భావించాలి. ఎదిగే కొద్దీ ఒదగాలంటారు. పూల విక్రం గారిని చూస్తే అది నిజమనిపిస్తుంది.

ప్రతిభ ఉండటం వేరు. దానిని గుర్తించి ప్రోత్సహించడం వేరు. విక్రం గారిలోని జర్నలిస్టు ప్రతిభకు ఎప్పుడో గుర్తించిన చంద్రబాబునాయుడు రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, ఆయనతో ‘శకపురుడు’ పేరిట, ఎన్టీఆర్ గొప్పతనంపై ఒక సావనీరుకు ప్రేరేపించారు. దానిని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆవిష్కరించారు.

ఎదుటి వ్యక్తిలోని ప్రతిభను గుర్తించడమే పెద్ద ఆర్టు. అది అందరికీ రాదు. కారణం ఈగో. కానీ టిడి జనార్దన్ లాంటి వ్యూహకర్తలు మాత్రమే దానిని గ్రహిస్తారు. నిరంతరం చంద్రబాబు ఉన్నతిని కోరుకునే ఆయన రాజకీయ కార్యదర్శి టిడి జనార్దన్.. జర్నలిస్టు విక్రం గారిని ప్రోత్సహించకపోతే, మహా స్వాప్నికుడు పుస్తకం గానీ, అంతకుముందు శకపురుషుడు సావనీరు గానీ రాకపోయేదేమో? నిజానికి జనార్దన్ లాంటి ఫుల్‌టైమర్లు, ఆర్‌ఎస్‌ఎస్-వామపక్ష పార్టీల్లో మాత్రమే కనిపిస్తారు..

కపురుషుడు సావనీరు తర్వాత చాలాకాలానికి.. విజయవాడ వేదికగా విక్రం గారు రాసిన మహాస్వాప్నికుడు పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ, స్వయంగా వచ్చి ఆవిష్కరించారు. ఆ సభకు అన్ని పార్టీల ప్రముఖులు, రైతు నాయకులూ హాజరయ్యారు. ఆ పుస్తకం ఆవిష్కరించి కొద్దిరోజులే అయింది. అంతలోనే మూడవ ముద్రణకు వెళ్లడమంటే విక్రం గారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లే..

ఇక మహాస్వాప్నికుడు పుస్తకాన్ని తిరగేస్తే. .
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై గతంలో పలు పుస్తకాలు వచ్చాయి. ఇటీవల కూడా నాలుగైదు పుస్తకాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే, సీనియర్‌ జర్నలిస్ట్‌, పొలిటికల్‌ ఎనలిస్ట్‌ విక్రమ్‌ పూల రాసిన ‘ మహాస్వాప్నికుడు ’ పుస్తకం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో విపరీతమైన ఆదరణ పొందడం విశేషం. ఫిబ్రవరి 11న విజయవాడలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ తదితరుల సమక్షంలో ఆవిష్కరించిన ‘మహాస్వాప్నికుడు’కు మహా డిమాండ్‌ ఏర్పడడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

2 వారాలు గడవకముందే ఈ పుస్తకం 3వ ముద్రణకు వెళ్లింది. కారణం.. ‘ మహాస్వాప్నికుడు ’లో ఇంతకుముందెవ్వరూ చంద్రబాబునాయుడు వ్యక్తిత్వాన్ని, ఆయన పరిపాలనలో చోటుచేసుకున్న కీలక అంశాలను ఆవిష్కరించని విధంగా రచయిత తెలియజెప్పిన విధానం అందర్నీ ఆకట్టుకొంటోంది. స్వయంగా చంద్రబాబునాయుడే మహాస్వాప్నికుడులోని కంటెంట్‌ అద్భుతంగా ఉందని, ఆ పుస్తకాన్ని పార్టీ శ్రేణులందరూ చదవాలని చెప్పడంతో వివిధ నియోజకవర్గాల నుంచి ‘మహాస్వాప్నికుడు’ పుస్తకం కావాలని ఆర్డర్‌లు వస్తున్నట్లు పుస్తక పబ్లిషర్‌ వెంకట్‌ కోడూరి తెలిపారు.

విక్రమ్‌ పూల సుదీర్ఘకాలంపాటు తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబునాయుడితో అనుబంధం కలిగి ఉండటం, తెలుగుదేశం పార్టీ ఇన్‌హౌస్‌ మాగ్‌జైన్‌కు ఎడిటర్‌గా పనిచేయడంతో.. చంద్రబాబు గురించి ఎవరికీ పెద్దగా తెలియని పలు అంశాలను ఈ పుస్తకంలో తెలియపరిచారు. అంతేకాకుండా.. ప్రధానంగా ఎన్టీఆర్‌పై తిరుగుబాటు, వైశ్రాయ్‌ ఉదంతం తదితర అంశాలకు సంబంధించి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్షాలు చేసే విమర్శల వెనుక అసలు వాస్తవాలను తెలియపర్చడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఇప్పటివరకూ ఎవరూ తెలియపర్చని అంశాలను అందించడం మహాస్వాప్నికుడు ప్రత్యేకత. క్రిందటేడాది ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని విక్రమ్‌ పూల రచించిన ఎన్టీఆర్‌ శాసనసభ ప్రసంగాలు, ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు రెండు గ్రంధాలను విజయవాడలో ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, చంద్రబాబునాయుడు, బాలకృష్ణ తదితరులు ఆవిష్కరించారు.

హైదరాబాద్‌లో శకపురుషుడు సావనీర్‌ను జాతీయ, రాష్ట్ర రాజకీయ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ మూడు పుస్తకాలను టి.డి. జనార్ధన్‌ సారధ్యంలోని ఎన్టీఆర్‌ సెంటినరీ లిటరేచర్‌ కమిటీ ప్రచురించింది.

 

Leave a Reply