– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజాపాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా?
హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… మీరు వాగ్దానం చేసిన రెండు లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, అయిదు లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది.