Home » ఆ గట్టునుంటారా? ఈ గట్టుకొస్తారా?

ఆ గట్టునుంటారా? ఈ గట్టుకొస్తారా?

– వాలంటీర్లపై టీడీపీ ఆఫర్ల జల్లు
– నెలకు 10 వేల జీతం ఇస్తామన్న చంద్రబాబు
– ఇప్పుడు జగన్ ఇస్తున్నది 5 వేల రూపాయలు మాత్రమే
– బాబు ప్రకటనతో అయోమయంలో వాలంటీర్లు
– రాజీనామాలు చేసి పార్టీకి పనిచేయాలన్న జగన్
– ఇప్పటికే కొందరి రాజీనామాలు
– తాజా బాబు ప్రకటనతో పునరాలోచన
– వైసీపీకి పనిచేయకూడదని నిర్ణయం
– మౌనంగా ఉంటే ‘అదే పదివేలు’
– వాలంటీరు వ్యవస్థపై బాబు బ్రహ్మాస్త్రం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడంలో మొనగాడైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, కీలకమైన ఎన్నికల సమయంలో సరిగ్గా అదే పనిచేశారు. ఏ వాలంటీర్ల వ్యవస్థనయితే జగన్, తనకు వ్యతిరేకంగా సంధించారో.. అదే వ్యవస్థపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన బాబు, వారిని పునరాలోచనలో పడేశారు. ఫలితంగా వైసీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడాల్సిన దుస్థితి. బాబు ప్రకటించిన వరంతో ఇప్పుడు అదే వాలంటీరు వ్యవస్థ, మౌనంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి. పోలింగ్ వరకూ మౌనంగా ఉంటే ‘అదే పదివేలు’ అనుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. ఇదీ.. వాలంటీర్లకు ‘నెలకు పదివేల జీతం’ పేరుతో చంద్రబాబు సృష్టించిన ఇరకాట పరిస్థితి.

ఉగాది రోజున టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వాలంటీర్లపై వరాల జల్లు కురిపించారు. వాలంటీ ర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం అనే భావన స్థిరపడిన నేపథ్యంలో.. ఏకంగా వారికి ఇప్పడున్న జీతాన్ని రెండింతలు పెంచుతామన్న హామీతో, వాలంటీర్లను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

‘టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల జీతం ఇస్తాం. ప్రజలకు మంచిచేసే వాలంటీర్లను మా పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుంది. వైసీపీ కోసం పనిచేసే వారిని మాత్రమే వ్యతిరేకిస్తుంది. వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. వారిని తప్పుడు పద్ధతిలో వినియోంగించుకుంటున్న వైసీపీ విధానాలకు మాత్రమే వ్యతిరేకం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పైగా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, వారి జీవితాలలో వెలుగులు నింపుతామని బాబు ఇటీవల కూడా ప్రకటించారు.

వాలంటీర్లకు 10 వేల జీతం ఇస్తామన్న ప్రకటనతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వారికి ఇస్తున్న నెలజీతం కేవలం 5 వేల రూపాయలు మాత్రమే. దానిని పెంచాలని చాలాకాలం నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ అసంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది. దానికితోడు టీడీపీ అధికారంలోకి వస్తే, తమను తొలగిస్తారన్న భయం కూడా వారిలో నాటుకుపోయింది. ఈ రెండు అభద్రతా కారణాలతో వాలంటీర్లు, గత కొద్దినెలల నుంచి సరిగ్గా విధులు నిర్వహించలేపోతున్నారు.

50 ఇళ్లకు చొప్పున పనిచేస్తున్న తమకు, నెలకు 10 వేల జీతం ఇస్తామనడం గొప్ప విషయమేనని వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యోగాలే ఉండవనుకుంటున్న తమను కొనసాగించడంతోపాటు, నెలకు 5 వేల రూపాయల అదనపు జీతం పెంచడంతో వాలంటీర్ల ఆనందానికి అవధుల్లేకుంటా పోయాయి.

‘నిజానికి ఇది మేం ఊహించనిది. చంద్రబాబు వస్తే మమ్మల్ని తీసేస్తామనుకున్నాం. అందుకే చాలామంది ఎలాగూ తీసేస్తారు కదా అని వైసీపీకి పనిచేస్తున్నారు. అందుకే వాళ్లంతా రాజీనామాలు చేసి ప్రచారంలో తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు మాకు నెలకు 10 వేల రూపాయల జీతం ఇస్తామని చంద్రబాబు చె ప్పారు కాబట్టి ఇక ఎవరూ రాజీనామా చేయరు. ఇప్పుడంటే వైసీపీ వాళ్లు ప్రచారానికి వెళ్లినందుకు డబ్బులిస్తారు. రేపు ఎన్నికలయ్యాక మాకు ఎవరిస్తారు’’ అని గుంటూరుకు చెందిన ఓ మహిళా వాలంటీరు ప్రశ్నించింది.

నిజానికి వాలంటీర్లలో 80 శాతం ఏ పార్టీకి చెందని వారే ఉన్నారని ఆమె స్పష్టం చేసింది. కేవలం 20 శాతం మంది వైసీపీ నేతల బంధువులు, కార్యకర్తలు మాత్రమే వాలంటీర్లలో ఉంటారని ఆమె విశ్లేషించింది. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, జీతాలు పెంచమని తాము ఎన్నిసార్లు చెప్పినా, వైసీపీ పట్టించుకోలేదని ఆ మైనారిటీ వాలంటీరు అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా ప్రజల పల్సు పట్టేసిన వాలంటీర్లను రాజీనామా చేయించి, తమతో ఎన్నికల ప్రచారానికి వాడకుంటున్న వైసీపీకి.. తాజా చంద్రబాబు ‘పదివేల’ హామీ, ఇరకాటంలో పడేసింది. వాలంటీర్లను రాజీనామా చేయాలంటూ ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఫలితంగా చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసి, వైసీపీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఇకపై ఈ రాజీనామాల జోరుకు బ్రేక్ పడనుంది.

తాజా పరిణామాలతో రాజీనామా చేయాలన్న వాలంటీర్లు, మనసుమార్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. తాత్కాలిక ఆనందం కోసం వైసీపీ ప్రచారంలో పాల్గొనే కంటే, శాశ్వతంగా వచ్చే పదివేల జీతాన్ని పోగొట్టుకోవటం ఎందుకన్న ఆలోచన వారిలో మొదలయింది. చంద్రబాబు హామీని విశ్వసించిన వాలంటీర్లు, ఇకపై రాజీనామా చేయకూడ దని భావిస్తున్నారట. ఎలాగూ జగన్ ప్రభుత్వం మళ్లీ రాదు కాబట్టి, ఇప్పటి ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేయడం అవివేకమని భావిస్తున్నట్లు వారి మాటల్లో స్పష్టమవుతోంది.

దానితో ఇకపై వైసీపీ ప్రచారంలో పాల్గొనడం గానీ, వారికి పోలింగ్ రోజున సాయం చేయడం గానీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రధానంగా పోలింగ్ రోజున, అసలు స్థానికంగా ఉండకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కంటే ముందే వేరే ప్రాంతాలకు వెళితే తమపై ఎవరూ ఒత్తిళ్లు చేసే అవకాశం ఉండద న్నది వారి నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది.

నిజానికి ఏపీ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు చేరవయింది. వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా చేశారు. ఏ అవసరం వచ్చినా ఇంటివద్దకే వచ్చి వాలిపోయేవారు. అందుకే ప్రజలు ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే విలువ ఇస్తున్నారు. దాదాపు 90 శాతం మంది నిజాయితీగానే పనిచేశారు. అవినీతి ఆరోపణలు కేవలం పది శాతం మాత్రమే ఉండవచ్చు. వైసీపీ అధినేత జగన్‌కు ఇప్పుడు వాలంటీర్లే ప్రధాన ఆయుధం. అలాంటి ఆయుధంపై ఇప్పుడు చంద్రబాబునాయుడు ‘10 వేల బ్రహ్మాస్త్రం’ సంధించి, వారిని ఆత్మరక్షణలో పడేసింది.

Leave a Reply