– ప్రజల కోసం పని చేద్దాం
– మంచిగా పని చేసే వారిని మంచిగానే చూస్తాను… ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించను
– ప్రస్తుతం ఉన్నది ప్రజల ప్రభుత్వమని గుర్తుంచుకోండి
తిరుపతి రూరల్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష సమావేశం
చంద్రగిరి: అధికారులు నాయకులు అందరం ప్రజాసేవకులమని, ప్రజల కోసం అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం,తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో గురువారం సమావేశమై అందరినీ పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. అధికారులు ఎమ్మెల్యే పులివర్తి నానికి అపూర్వ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా యంయల్ఏ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రవర్తించిన తీరును అధికారులు అందరూ మార్చుకోవాలని అన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు తగిన గౌరవం ఇవ్వాలని వారిని ఇబ్బంది పెట్టకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి పూనుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అశ్రద్ధ చూపిన, మండల ప్రజలను ఇబ్బంది పెట్టిన సహించబోమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎవరి వలన అయినా సమస్య వస్తే తన దృష్టికి తీసుకొని రావచ్చన్నారు.
ఉపాధి హామీ పనులలో పెద్ద సంఖ్యలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అన్ని విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి అధికారులు అందరూ సహకరించాలన్నారు. నిత్యం ప్రజలలో ఉంటూ వారికి ప్రభుత్వం పైన నమ్మకం కలిగించాలన్నారు. మండల అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.