Suryaa.co.in

Andhra Pradesh

తీర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • అన్ని రంగాల్లోనూ ఆదాయ వనరుల సృష్టి
  • కూటమి ప్రభుత్వంలో తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తాం
  • పేదలకు ఆరోగ్య భరోసానిచ్చే ఆరోగ్య బీమా పటిష్టంగా అమలు
  • పోలీసు విధుల్లో రాజకీయ జోక్యం ఉండదు
  • కూటమి గెలుపు ఖాయమైంది.. భారీ మెజార్టీని ఇవ్వండి
  • అవనిగడ్డ వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ 

‘గుజరాత్ తర్వాత దేశంలోనే అత్యంత భారీ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల రాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో ‘నీలి విప్లవం’ తీసుకురావడం ద్వారా సంపద సృష్టిని సాధించవచ్చు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా నీలి విప్లవానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్ లో దీనికి తగిన నిధులను కేటాయించింది. దీన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ తీరంలో సందప సృష్టి జరగడమే కాదు… సముద్రాన్ని నమ్ముకొని ఉన్న లక్షల మంది మత్స్యకారుల జీవితాలను మారుస్తాం. యువతకు తీర ప్రాంతం ఆధారంగా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంద’ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్నారు. మత్స్య సంపద కోసం వేటకు వెళ్లేవారికి జెట్టీలు, హార్బర్లు నిర్మాణమే కాకుండా, సముద్రంలో దొరికే అరుదైన సంపదను, కొత్త ఫిషింగ్ విధానాలు పెంపొందిస్తామన్నారు. విభిన్నమైన మత్స్యజాతులు, మొక్కల ద్వారా కొత్త ఆదాయం, ఉపాధి చూపిస్తామన్నారు. మత్స్యకారుల జీవితాలను పురోగమన దిశగా తీసుకెళ్లడంతో పాటు బీచ్ లను అభివృద్ధి చేసి పర్యాటకంగానూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. శనివారం సాయంత్రం అవనిగడ్డలో వారాహి విజయభేరీ సభలో ఆయన మాట్లాడారు. అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి  మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘కేంద్రం సహాయంతో తీర ప్రాంతాన్ని సందపను సృష్టంచే గొప్ప ఆదాయ వనరుగా తయారు చేస్తాం. బీచ్ పర్యాటకం ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తీర ప్రాంతంలో ఉన్న పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి బాట పడతాయి. ఈ అతి పెద్ద తీర ప్రాంతాన్ని మనసు పెట్టి అభివృద్ధి చేస్తే మత్స్యకారుల జీవితాలే కాదు… రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మార్చే గొప్ప అక్షయపాత్రగా మారుతుంది. దీనికి సమగ్ర ప్రణాళిక, కేంద్ర సహాకారంతో ముందుకు వెళ్తాం. మత్స్యకారులకు మొదటి నుంచి అండగా జనసేన నిలిచింది. వారి బతుకులను చిధ్రం చేసే జీవో 217 ను వ్యతిరేకించాం. వారికి ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా పోరాటం చేశాం. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా మత్స్యకారుల వేట విరామ సమయంలో రూ.20 వేల భృతిని అందిస్తాం. మత్స్యకారులకు మెరుగైన కోల్డ్ స్టోరేజీల సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం పెంచుతాం. మత్స్యకారుల శ్రమను దోచే మధ్యవర్తుల నుంచి వారిని కాపాడుతాం. ఇలా ప్రతి రంగంలోనూ సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆదాయ వనరులు పెంచే ఆలోచనలు, ప్రణాళికలను అమలు చేస్తాం.

బడుగులకు అండగా నిలిచాం.. భవనాల్లో కూర్చొని చోద్యం చూడలేదు
కూటమి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకు, బడుగులకు అన్యాయం జరుగుతుందని వైసీపీ విషప్రచారం మొదలుపెట్టింది. వైసీపీ పాలనలో అణగారిన వర్గాలపై దాడులు జరిగితే జనసేన మొదట స్పందించింది. వారికి అండగా నిలిచింది. 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ ను  తోటలో పెట్రోల్ పోసి తగులబెడితే ప్రశ్నించింది మేము.. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే నిలదీసింది మేము. డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి, చనిపోయేలా చేసింది వైసీపీ. దళిత యువకులకు అన్యాయం జరిగితే, మళ్లీ వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించింది వైసీపీ నాయకులు. బడుగు జీవులైన భవన నిర్మాణ కార్మికులను ఆకలి చావులతో క్రూరంగా ఈ ప్రభుత్వం చంపేసింది. వారి సంక్షేమ నిధి నుంచి అడ్డగోలుగా రూ.450 కోట్లు దోచుకున్నారు. వీళ్లు ఎన్నికల సమయం వచ్చేనాటికి బడుగులకు అన్యాయం అంటూ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా వీరి ప్రచారాన్ని నమ్మని దుస్థితి వచ్చింది.

పోలీసులకు సంపూర్ణ విధి నిర్వహణ స్వేచ్ఛ
వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా తయారయ్యాయి. వైసీపీ నాయకులకు జీ హుజూర్ అనకుంటే పోలీసులకు వేధింపులు తప్పని పరిస్థితి ఉంది. శాంతిభద్రతలు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతోనే రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఓ మహిళను భర్త కళ్ల ముందే అత్యాచారం చేస్తే ఇలాంటివి సాధారణం అనే హోంమంత్రి రాష్ట్రాన్ని ఏమి కాపాడుతారు..? పోలీసులను వారి విధులు పక్కాగా నిర్వహించేలా ఎలా చూస్తారు..? పోలీసు శాఖలో ఒక కానిస్టేబుల్ కు రాజకీయ జోక్యం లేకుండా పని చేయమని స్వతంత్రత ఇస్తే చాలు.. అతడు అద్భుతంగా పనిచేయగలడు. శాంతిభద్రతలను కాపాడగలడు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అది నాశనమై పోలీసు వ్యవస్థ చేతులు కట్టుకొని కూర్చోవల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో పోలీసు విధుల్లో రాజకీయ జోక్యం ఉండదు. వారి విధులను చక్కగా నిర్వర్తించేలా చేస్తే… అద్భుతమైన శాంతిభద్రతలు సాధ్యమే. దీన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ముఖ్యంగా మహిళల భద్రతకు తగు ప్రాధాన్యం ఇస్తాం. పాలకులు ఎవరూ పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోరు.

ఆరోగ్య బీమాతో పేదలకు భరోసా

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిధులను జగన్ విడుదల చేయడు. ఇప్పటికే రూ.1200 కోట్ల బకాయిలు పెండింగ్ ఉండిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలుపుదల చేశాయి. ఆరోగ్యశ్రీ అనేది పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తయారైంది. వారికి ఏ మాత్రం ఉపయోగపడని విధంగా ప్రభుత్వం తయారు చేసింది. పేరుకు 3000 రోగాలకు ఆరోగ్య శ్రీ వర్తింపు అన్న ప్రచారం తప్ప, క్షేత్రస్థాయిలో ఆరోగ్య శ్రీకి ఏ రోగానికి వర్తిస్తుందో, సేవలు ఎక్కడ అందుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. పేదలు ఆరోగ్య శ్రీ ఉన్న కార్పొరేట్  ఆస్పత్రికి వెళ్తే అక్కడ సిబ్బంది అదోలా చూస్తారు. ఆరోగ్య శ్రీకి ఏది వర్తిస్తుందో, ఏ రోగం వర్తించదో చెప్పరు. పేదలకు అనుకోకుండా కష్టం వస్తే ఏ ఆస్పత్రికి పరుగు తీయాలి..? వారు ఆరోగ్య శ్రీ కేసులను చూస్తున్నారా లేదా అయోమయంగా తయారైంది.

మొత్తంగా రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్య భద్రత లేకుండా వైసీపీ చేసింది. దీనికి పరిష్కారంగా దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా పేద కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమాను కూటమి ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనికి సంబంధించి ఏటా ప్రీమియంలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని ద్వారా పేదలు దర్జాగా ఏ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి అయినా సేవలు పొందవచ్చు. ఏ రోగానికి అయినా ట్రీట్మెంట్ తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇప్పటి వరకు బ్రిటన్ వంటి దేశాలే వారి పౌరులకు ఇలాంటి భరోసా ఇచ్చేవి. మొదటిసారి దేశంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఇది సంపూర్ణంగా పేదల బతుకు భరోసాగా నిలిచే ప్రక్రియ. ఇక సమాజంలో దివ్యాంగుల వెతలు, వారి జీవన స్థితిగతులు మనసుతో విన్నవాడిగా వారికిచ్చే పింఛనును కూటమి ప్రభుత్వంలో రూ.6 వేలకు పెంచుతున్నాం. వారి జీవన ఉన్నతికి ఇది భరోసా ఇస్తుంది. అలాగే వారికి అవసరం అయిన అన్ని సహాయాలు అందించేందుకు బలమైన కార్పొరేషన్ తీసుకొస్తాం.

ఆంగ్లం వద్దనలేదు.. తెలుగు మాధుర్యం చంపేయకండి అని చెప్పాం
మాతృభాషలో వ్యక్తికరించే భావన అపురూపంగా ఉంటుంది. అలాగే ఓ జాతి అంతరించిపోవడానికి మొదటిగా వారి భాష అంతరించిపోవడం అనేది సూచిక. అందుకే తెలుగును రక్షించుకోవాలని చెబుతున్నాను. చిన్నారులకు ఆంగ్ల మాధ్యమ బోధన తప్పు అని, దాని వల్ల చెడు జరుగుతుందని ఎప్పుడూ చెప్పలేదు. మాతృభాషను రక్షిస్తూ, ఆంగ్లంలో నైపుణ్యం నేర్పితే బాగుంటుందనేది మా ఉద్దేశం. గుర్రం జాషువా గబ్బిలం రచనలు చదవాలన్నా, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అర్ధం చేసుకోవాలన్నా తెలుగు వంటి గొప్ప భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉంది.

ఆంగ్లం అనేది భాష మాత్రమే. తెలుగు భాష మనందరి ఉనికి. దాన్ని రక్షించుకుంటూ.. రానున్న అవసరాలకు తగినట్లుగా ఆంగ్ల సాధన చేయాలనేది జనసేన మొదటి నుంచి చెబుతోంది. పిల్లలకు ఆంగ్ల బోధన మేం వ్యతిరేకించలేదు… వారికి మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు తెలుగును కూడా రక్షించాలని కోరుతున్నాం. దీన్ని మనసులో వినకుండా, కేవలం రాజకీయాల కోసం వాడుకునే జగన్ కు తెలుగు గొప్పదనం ఏం తెలుస్తుంది.

ఆటోవాలాల నుంచి రూ.1000 కోట్ల జరిమానా వైసీపీ టార్గెట్
కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టామని, దీనివల్ల ఆటోవాలాలు నష్టపోతారని చెబుతున్నారు. దీనికి సరైన పరిష్కారం చూపిస్తాం. ఇప్పటికే వారికి ఏడాదికి తగిన ఆర్థిక సాయం అందించే ఆలోచనను మేనిఫెస్టోలో పెట్టాం. కచ్చితంగా వారి ఇబ్బందికి సైతం తగిన పరిష్కారం చూపిస్తాం. వైసీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర అంటూ రూ.10 వేలు డబ్బులు వేసి, రూ.1000 కోట్లు జరిమానాల రూపంలో లాగేశారు. కూటమి ప్రభుత్వంలో ఇది ఉండదు. అలాగే రోడ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం ద్వారా వారికి నిర్వహణ భారం తగ్గుతుంది. అమరావతి రాజధానిగా ఉండే సమయంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కిరాయిలు బాగా ఉండేవి. వైసీపీ ప్రభుత్వంలో వారి పొట్ట కొట్టారు. మళ్లీ వారికి మంచి రోజులు వస్తాయి. పోలీసుల నుంచి, రవాణా శాఖ అధికారుల నుంచి వేధింపులు లేకుండా చూస్తాం.

అవనిగడ్డ సమస్యలపై ప్రత్యేక దృష్టి
అవనిగడ్డను ఎడ్యుకేషన్ హబ్ చేయాలి. మెగా డీఎస్సీ వేయడం ద్వారా ఎంతో మంది ఆశావహులు ఈ ప్రాంతానికి శిక్షణ నిమిత్తం వస్తారు. అలాగే డీఆర్డీవో మిసైల్ టెస్టింగ్ యూనిట్ ఇక్కడ నెలకొల్పనుంది. ఇక్కడ రక్షణ పరీక్షలకు ప్రిపేర్ చేసే కేంద్రాలు వచ్చేలా చూస్తాం. దివిసీమ ఉప్పెన తర్వాత ఈ ప్రాంతంలో 51 గ్రామాలకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో తీర్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే వంతెనలు, రోడ్లు బాగా లేవు. వాటికి తగిన నిధులు కేటాయిస్తాం. వానలు వస్తే డ్రైయిన్లు ఉప్పొంగి పంట పొలాల మీద పడుతున్నాయి. దీనికి తగిన పరిష్కారం చూపుతాం. రైల్వే లైను సదుపాయాన్ని తీసుకొస్తాం. కృష్ణా డెల్టా చివరి భూమి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

బ్రిడ్జిలు వేసి ఓటు అడగానికి వస్తామని చెప్పిన నాయకుల మాయమాటలు నమ్మకండి. కూటమి ప్రభుత్వంలో ప్రతి మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ, భద్రత కల్పించేలా పనిచేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా స్పందన చూస్తే కూటమి గెలుపు ఖాయమైందని అర్ధం అవుతుంది. ప్రజలంతా భారీ మెజార్టీని ఇచ్చి కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించాలి. మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థిగా బాలసౌరికి గాజు గ్లాసు గుర్తుపై, అవనిగడ్డ అసెంబ్లీ నుంచి  బరిలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ కి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి’’ అని కోరారు.

LEAVE A RESPONSE