Home » కూటమి గెలుపు పక్కా…

కూటమి గెలుపు పక్కా…

  • మెజారిటీ ఎంత వస్తుందనేదే లెక్క
  • యువశక్తిని రాష్ట్ర ప్రగతికి ఇంధనంగా మార్చాలి
  • రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల ఛీత్కారం కనిపిస్తోంది.
  • 15 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి రూ.10 లక్షలు పరిహారం ఇస్తామన్న దుర్మార్గ ప్రభుత్వం ఇది
  • పంట కాలువలు పూడిక తీయరుగానీ పేకాట కేంద్రాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ చేశారు
  • జగన్ భయపెట్టి నమస్కారం పెట్టించుకోవడం అలవాటు చేసుకున్నాడు
  • ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినవాడికి ప్రజల ఆస్తులు లాక్కోవడం ఓ లెక్క కాదు
  • రేపల్లె వారాహి విజయభేరీ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్

‘వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. జగన్ ఓటమి ఖాయం అని తేలిపోయింది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మీద ఛీత్కారం కనిపిస్తోంది.  ఎప్పుడెప్పుడు మే 13 వస్తుందా? ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నార’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఓటమి, కూటమి విజయం రాష్ట్రంలో ఖాయం అయిపోయాయి. కూటమికే పీఠం.. పొత్తుదే ప్రభుత్వం అని ప్రజలెప్పుడో డిసైడ్ చేశారు. కూటమికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎంత మెజారిటీ ఇస్తారనేదే తేలాల్సి ఉందన్నారు. శనివారం సాయంత్రం రేపల్లెలో జరిగిన వారాహి విజయభేరీ సభలో ఆయన ప్రసంగించారు. రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “జన సైనికుల అండతోనే ఎన్నో ఒడిదొడుకుల మధ్య పదేళ్లపాటు పార్టీని బలంగా నడపగలిగాం. జన సైనికులు, వీర మహిళల పోరాటమే నాకున్న బలం. అదే నన్ను ప్రధాని మోదీ ముందు నిలబడి పొత్తు కోసం మాట్లాడేలా చేసింది. 151 ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలతో అరాచకాలు చేస్తూ, గూండాగిరీ చేస్తున్న ప్రభుత్వాన్ని, పేకాట క్లబ్బులు నడిపే ఈ ప్రభుత్వాన్ని తట్టుకుని నిలబడగలిగామంటే, కష్టకాలంలో టీడీపీకి మద్దతుగా నిలిచామంటే నా జన సైనికులు, వీర మహిళలు బలమైన పోరాటాలే దానికి కారణం. జనసేన ఎంత బలపడింది అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులకే ధైర్యం నూరిపోసే స్థాయిలో నిలబడింది. అంతటి శక్తినిచ్చిన జనసైనికులకు ఎన్ని ధన్యవాదాలు తెలిపినా చాలదు.

అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఇది
వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందంటే… మే 13 ఎప్పుడు వస్తుందా… ఎప్పుడు వైసీపీని ఇంటికి పంపిద్దామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్.. అందని ద్రాక్షగా మారిపోయాయి. 7,300కు పైగా ఎయిడెడ్ స్కూళ్లు మూసేశారు. 60 వేల మంది స్కూలు పిల్లలు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు. చదువుకుందామంటే ఫీజు రీ ఎంబర్స్మెంటు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్ద పీట వేస్తాం. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్మెంటు సౌకర్యం పునరుద్ధరిస్తాం. ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తాం. వైసీపీ ప్రభుత్వం మూసేసిన ఎయిడెడ్ స్కూళ్లను తిరిగి తెరిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.

యువతకు ఉద్యోగాల ఊసే లేదు
18 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఈ ప్రభుత్వ ఒక్క పోస్టు ఇవ్వలేదు. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం తీయలేదు. చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక మలమల మాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్లే జగన్ ఎంత ద్రోహం చేయగలడో అర్ధం అయ్యింది. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఉపాధి అవకాశాలు రావాలి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే స్థిరమైన రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఉండాలి. రాష్ట్రం కోసం ఎమర్జెన్సీ తరహాలో అన్ని పార్టీలు ఏకమవ్వాలి. ఆ అవసరాన్ని గుర్తించే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను. ఆ మాట మేరకు ఇప్పుడు టీడీపీ, బీజేపీలు కలసి వచ్చాయి. ప్రజలను కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉండబట్టే ఇది సాధ్యపడింది.

రాష్ట్రంలో వరి దిగుబడి తగ్గుతోంది
రేపల్లె నియోజకవర్గం పరిధిలో 1.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ కాలువలు, డ్రైనేజీల్లో పూడిక తీసే దిక్కు లేదు. తెలంగాణలో వరి దిగుబడి పెరుగుతుంది. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో దిగుబడి పడిపోయింది. ఇక్కడ నాయకులకు పేకాట క్లబ్బులు నడుపుకునేందుకు సమయం ఉందిగాని కాలువల్లో పూడిక తీసేందుకు తీరిక లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే పత్రికా ప్రకటనలు ఇచ్చి సరిపెట్టుకోలేదు.. వారి కుటుంబాలకు అండగా నిలబడాలని నిశ్చయించాను. నా వంతుగా ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం చేశాను. అంతా బాగుండి పంట చేతికి వస్తేనే రైతుకి ఎకరాకి రూ. 25 వేలు, కౌలు రైతుకి రూ. 45 వేలు నష్టం వస్తోంది. ధరల స్థిరీకరణ తీసుకువచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటి అవుతుంది. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. కేంద్రం ప్రారంభించిన ప్రధాన మంత్రి జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు అందుబాటులో ఉన్నా సద్వినియోగం చేసుకోలేదు. ఆ డబ్బులు ఎలా కొట్టేద్దామన్న ధ్యాస మినహా తాగునీటి అవసరాలు తీర్చలేని ప్రభుత్వం ఇది. ఈ జగన్ పచ్చటి చెట్లు నరికే స్వభావం ఉన్న వ్యక్తి. భూమి తాలూకు విలువ అతనికి తెలియదు. భూమిని తవ్వే అలవాటు తప్ప పైర్లు పెంచే అలవాటు లేని వ్యక్తి. అందుకే రైతు కష్టం అతనికి తెలియదు.

సుదీర్ఘ సముద్ర తీరం ప్రాంతం ఉన్న రేపల్లెని పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు. కాని ఇక్కడ చూస్తే పేకాటకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా పేకాట క్లబ్బులు, మట్టి మాఫియాలు. దోపిడీలు, దాడులు తప్ప అభివృద్ధి లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే గొంతు నొక్కేద్దామని చూస్తారు. భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం అవుతాను.

15 ఏళ్ల బాలుడి ఆవేదన కనిపించలేదా..?
15 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగుల బెడితే రూ.పది లక్షలు పరిహారం ఇస్తామన్న దుర్మార్గ ప్రభుత్వం ఇది. మా అక్కను ఏడిపించవద్దు అని చెప్పిన పాపానికి అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి మీద కక్ష కట్టి అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ముఖ్యమంత్రి చిన్న గులకరాయి తగిలితేనే హడావిడి చేశారు. మరి ఆ బిడ్డది బాధ కాదా..? ఆ బిడ్డ తల్లిదండ్రులది బాధ కాదా. మోపిదేవి వెంకట రమణ రూ.పది లక్షలు పరిహారం ఇచ్చి అమర్నాథ్ గౌడ్ తల్లిదండ్రుల బాధ తీర్చగలడా? 15 ఏళ్ల బిడ్డ ప్రాణాల ఖరీదు 10 లక్షలా? రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్త కళ్ల ఎదుట దారుణంగా మహిళ అత్యాచారం జరిగితే హోంమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మాటలు క్రిమినల్స్ కి భయం లేకుండా చేశాయి. ఈ ఘటనలో శిక్ష పడి ఉంటే మరో ఆడబిడ్డని ఏడిపించేందుకు క్రిమినల్స్ ప్రయత్నిస్తారా?  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉంది. బలమైన మంత్రులు, అధికారులు ఉంటేనే దీన్ని కంట్రోల్ చేయగలరు. కూటమి ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ తీసుకువస్తాం. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే కానిస్టేబుల్ కూడా వారికి బలంగా నిలబడే అధికారం ఇస్తాం.

నిజాంపట్నం పోర్టును పట్టించుకున్నది లేదు
నిజాంపట్నం పోర్టు పూర్తి చేసి ఉంటే ఉపాధి అవకాశాలు వచ్చేవి. పోర్టు అభివృద్ధి చేయకపోగా సూర్యలంక వద్ద ఉన్న మడ అడవులు ఆక్రమించి చెరువులు తవ్వేస్తున్నారు. 1500 హెక్టార్లు తవ్వేశారు. సముద్రానికి రక్షణ గోడ లాండి మడ అడవులు సృష్టించలేము.  ఇలాంటి అడ్డగోలు దోపిడీలు చూస్తూ ఊరుకోము. జగన్ గుర్తు పెట్టుకోవాలి. కూల్చే వాడు ఉంటే కట్టే వాడు ఉంటాడు. దోపిడీ చేసే వాడు ఉంటే నిలువరించే వాడు ఉంటాడు. దాడులు చేసే వాడు ఉంటే తిరగబడే వాడు ఉంటాడు.  జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే సాగు నీరు, తాగునీరు ఇవ్వలేదు. మ్మ ఒడి ఒక్క బిడ్డకు మించి ఇవ్వడం లేదు. కూటమి  మేనిఫెస్టో చూడండి. బాధ్యత తీసుకుంటాం. జవాబుదారీతనంగా ముందుకు వెళ్తాం. దివ్యాంగుల నెలవారీ పింఛను రూ. 6 వేలు ఇస్తాం. వృద్ధాప్య పింఛన్ రూ. 4 వేలకి పెంచుతాం. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మెగా డీఎస్సీ, రైతుకి రూ. 20 వేలు సాగు సాయం ఇస్తాం. సాగునీటి కాలువల్లో పూడికలు తీయించి ఆయకట్టుని కాపాడుతాం.

వైసీపీకి ఓటేయాలనుకునేవారు కూడా ఆలోచించండి
వైసీపీకి ఓటు వేస్తే కొరివితో తలగొక్కున్నట్టే. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టులో మన ఆస్తులపై మనకు హక్కులు ఉండవు. జగన్ నిజాయతీపరుడని నమ్మి అధికారం ఇస్తే ప్రతి ఆస్తి తనఖా పెట్టేశాడు. ఒక్క విశాఖలోనే రూ.25 వేల కోట్ల ఆస్తులు తనఖా పెట్టాడు. చట్టం ఎందుకు చేశావంటే… కేంద్రం ముసాయిదా పంపింది అంటాడు. కేంద్రం ముసాయిదా పంపితే ప్రజల్ని అడిగి అమలు చేయాలి. ఈ చట్టంలో జగన్ కి లాభం కనబడింది. ఏ హక్కు లేకుండానే ఇళ్లోకి వచ్చి ఆస్తులు లాక్కునే దారి కనిపించింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అవుతుంది.

ఈ ముఖ్యమంత్రి భయపెట్టి గౌరవం పొందాలని చూస్తాడు. ఈ ముఖ్యమంత్రికి అంతా తనకు నమస్కారాలు పెట్టాలన్న పిచ్చి. చిరంజీవి లాంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. సగటు మనిషిని ఎందుకు ఇబ్బందిపెట్టడు. ఇలాంటి వ్యవస్థని పారద్రోలేందుకే మేమంతా త్యాగాలు చేసి మరీ కూటమి కట్టాం. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి వేయండి. ఎమ్మెల్యేగా అనగాని సత్యప్రసాద్, ఎంపీగా  తెన్నేటి కృష్ణప్రసాద్ పోటీలో ఉన్నారు. వారికి ఓట్లు వేయమని అడుగుతున్నాం. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం పెద్దన్నలా అందరి బాధ్యత తీసుకుంటుంది’’ అని అన్నారు.

Leave a Reply