Home » వైసీపీది “డబుల్ డి” ప్రభుత్వం

వైసీపీది “డబుల్ డి” ప్రభుత్వం

  • దాడులు, దోపిడీ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు
  • పేకాట క్లబ్బులు, దందాలపై ఉన్న శ్రద్ధ… ప్రజలకు తాగునీరు అందించడంలో లేదు
  • మనుషులకు స్వేచ్ఛ, భద్రత లేకుండా వైసీపీ చేసింది
  • ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది
  • బీసీలపై అక్రమంగా 9 వేల కేసులు పెట్టారు
  • వైఎస్ఆర్ కంటే చాలా మంది మహానుభావులు ఈ నేల మీద పుట్టారు
  • కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఆ మహానుభావుల పేర్లు పెడతాం
  • గుడివాడ వారాహి విజయ భేరి బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

‘రాజకీయ నాయకుల బూతులు, దాడులపై ట్యాక్స్ విధిస్తే దేశంలో నిధుల కొరత ఉండదని నాని ఫాల్కేవాలా చెప్పినట్లు… మన రాష్ట్రంలో వైసీపీ నాయకుల బూతులు, దాడులపై ట్యాక్స్ విధిస్తే ఉచిత విద్యను అమలు చేయవచ్చ’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం “డబుల్ డి” ప్రభుత్వమని, దాడులు, దోపిడీ, బూతులు తిట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. పేకాట క్లబ్బులు, దందాలు, ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికి సమయం ఉన్న వైసీపీ నాయకులకు… రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి, ప్రజలకు రక్షిత తాగునీరు అందించడానికి మాత్రం సమయం లేదని విమర్శించారు. ఎంత మెజార్టీతో గెలుస్తామనే సందేహం తప్ప… వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, వైసీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టడం ఖాయమన్నారు. శనివారం మధ్యాహ్నం గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో  పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థి  వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాములను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నాను. కిందపడ్డాను.. దెబ్బలు తిన్నాను… నలిగిపోయాను.. పోరాటాలు చేశాను.. అయినా నిలబడే ఉన్నాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎందుకు నిలబడి ఉన్నాను అంటే ఈ దేశం, ఈ నేల మీద ఉన్న మమకారమే. ప్రజల కష్టాలకు మన వంతు సాయం అందించాలన్న తపనతో రాజకీయాల్లో ఉన్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడినే అన్యాయంగా జైల్లో పెడితే… రేపొద్దున్న ఈ కష్టం ఎవరికైనా రావొచ్చు. అందుకే వైసీపీ అరాచకాలను అడ్డుకట్ట వేయడానికి రాజమండ్రి వెళ్లి చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపాను.

రోడ్లు గోతులు… నోట్లో బూతులు…
విజయవాడ-గుడివాడ, విజయవాడ – కంకిపాడు రోడ్డులు చూస్తే గుంతలమయం. రోడ్ల మధ్యలో గోతులు ఉన్నాయో..? గోతుల మధ్య రోడ్లు ఉన్నాయో.? అనే సందేహం కలుగుతోంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిని ఏదైనా అడుగుదాం అంటే బూతులు తిడతాడు. రోడ్లు ఏమో గోతులు… ఆయన నోట్లో ఏమో బూతులు. నాని అంటే నాకు వ్యక్తిగత కోపం ఏమీ లేదు. ఈ మధ్యన వంగవీటి రాధా పెళ్లిలో కలిసినప్పుడు పలకరించాను. గుడివాడ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ మూలకు వెళ్లిన ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఆక్వా సాగుతో భూగర్భ జలాలు విష పూరితం అయిపోయాయి. పేకాట క్లబ్బులు, దందాలు చేయడానికి ఉన్న సమయం… ప్రజలకు రక్షిత మంచి నీరు అందించడానికి ఆయనకు లేదు. అదే నా బాధ. ఏ వ్యక్తి అయినా ప్రజలకు ఇబ్బంది కలిగించినా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినా అది నా సొంత రక్తమైనా ఎదురు తిరుగుతాను. నేను ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ అది.

ఏ వ్యక్తికైనా స్వేచ్ఛ, భద్రత ముఖ్యం
వైసీపీ నాయకుల అవినీతి, అరాచకాలు, దాష్టీకాలను నిలదీస్తే బెదిరిస్తున్నారు. భయపెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వెళ్లాకా ఎవరూ దేనికి భయపడరు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎదురు తిరుగుతారు. స్వేచ్ఛా, భద్రతే ఈ దేశానికి పట్టుకొమ్మలు. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు కొంతమంది తెలుగుదేశం మద్దతుదారులు… జగన్ అధికారంలోకి వచ్చాడండి. మేము అక్కడికి రాలేము. మమ్మల్ని ఇబ్బందిపెడతాడని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో మనకు స్వేచ్ఛ, భద్రత లేకపోతే ఎలా..? భూమికి వేళ్ళూనుకున్న మనుషులు మనం. కృష్ణా నది ఈ నేలను ఎలా అంటిపెట్టుకొని ఉంటుందో మనమూ అంతే. ఎవరికో భయపడి ఎక్కడికి పారిపోతాం. ఎవరిని చూసి భయపడాలి..? జగన్ ను చూశా..? వైసీపీ నాయకులను చూశా..?. దమ్ము, ధైర్యం లేకపోతే బతుకెందుకు..? అన్నీ తెగించే  రాజకీయాల్లోకి వచ్చాను. గుండెల్లో ధైర్యం నింపడానికే వచ్చాను. ఇప్పటం సభకు స్థలం ఇచ్చారని రైతుల ఇళ్లను ఈ ప్రభుత్వం కూల్చేసింది. ఎవరైనా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే సాగుతాయి.

వంగి వంగి నమస్కారాలు పెట్టాలా..?
మాటకు చాలా విలువ ఉంటుంది. ఒక్కసారి మాట ఇస్తే ప్రాణాలు పోవాలి తప్ప మాట వెనక్కి తీసుకోకూడదు. 2021 ఇప్పటం సభలో  వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను. చాలా మంది పెద్దలు చాలా బాగా మాట్లాడావు… అయితే ఇదెలా సాధ్యం అని అడిగారు. మనసుంటే మార్గ ముంటుంది. కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి భుజం కాశాం. బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి కూటమి కట్టాం. రాష్ట్రంలో అరాచకం పెచ్చుమీరిపోయింది. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే కిరాయి మూకలు, బ్లేడ్ బ్యాచ్ లతో బెదిరిస్తున్నారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెడుతున్నారు. బీసీలపై అక్రమంగా 9 వేల కేసులు బనాయించారు. ఇవన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి చెప్పి కూటమిలోకి తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఎవరూ బతకడానికి లేదు. అందరూ వాళ్లను చూసి భయపడాలి.

జగన్ కుటుంబంలో వాళ్ల తాతగారి నుంచి పక్కవాడిది లాక్కోవడం వారికి అలవాటు. వెంకటనర్సయ్య అనే వ్యక్తికి చెందిన గనులను లాక్కొని ఆ కుటుంబం ఎదిగింది. చిరంజీవి , మహేష్ , ప్రభాస్ ఈయనకు నమస్కారాలు పెట్టాలంటా..?  వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. ఈయనకు ఎందుకు నమస్కారాలు పెడతారు?

మీ నాన్న కంటే ముందు చాలా మంది మహానుభావులు వచ్చారు
జగన్ అధికారం కోసం ఎన్టీఆర్ అంటే గౌరవం ఉన్నట్లు నటించాడు. అధికారంలోకి వచ్చాక తప్పని పరిస్థితులలో ఆయన పేరును జిల్లాకు పెట్టాడు. అవసరం తీరిపోయాక హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి వాళ్ల నాన్న వైఎస్ఆర్ పేరు పెట్టకున్నాడు. వైఎస్ఆర్ ని అగౌరపరచాలని కాదు… యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది.?  తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడికి ఆ మాత్రం గౌరవం ఇవ్వలేవా..? మీ నాన్నని తగ్గించడం లేదు. మీ నాన్న కంటే ముందు చాలా మంది మహానుభావులు ఈ నేల మీద పుట్టారు. ఈ నేల వచ్చిందే పొట్టి శ్రీరాముల  బలిదానంతో. ఎవరైతే ఈ ప్రాంతం కోసం త్యాగాలు చేశారో కూటమి ప్రభుత్వం వచ్చాకా వారి పేర్లు సంక్షేమ పథకాలకు పెడతాం. అంతే తప్ప ప్రతి పథకానికి జగన్ లా వారి నాన్న పేరు, కుటుంబంలో వ్యక్తుల పేర్లు పెట్టం. ఇలా మాట్లాడితే జగన్ ఏమనుకుంటాడో అనే భయాలు నాకు లేవు. నా సినిమాలు ఆపుకుంటే ఆపుకోనీ.. నా తొలి ప్రాధాన్యం సినిమాలు కాదు  ప్రజాస్వామ్యాన్ని  కాపాడుకోవడం. సినిమాలు ఈ రోజు ఉంటాయి పోతాయి. డబ్బులు వస్తాయి పోతాయి. మనం వదులుకోకూడనిది స్వేచ్ఛ. అది పోయిన రోజునా ఎన్నివేల కోట్లు ఉన్న నిష్ప్రయోజనం. 30కి పైగా కేసులు, 5 ఏళ్లుగా బెయిల్ మీద బయటకు తిరుగుతున్న వ్యక్తి వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని నియంత్రించడం సిగ్గుచేటు.

12 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది
నాడు- నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెప్పుకునే జగన్ … 7,300 ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలను మూసేశాడు. ఈ ఐదేళ్ల కాలంలో 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు దాదాపు 62 నుంచి 68 వేల మంది చనిపోయారు. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన రైతుల కన్నీరే. కాలువల్లో కనీసం పూడికలు తీయలేదు. ఒకవైపు తెలంగాణలో వరి సాగు పెరుగుతుంటే… అన్నపూర్ణలాంటి మన రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. తండ్రి లేని బిడ్డను ఒక్క ఛాన్స్ … ఒక్క ఛాన్స్ అంటే కరిగిపోయి అవకాశం ఇచ్చారు. ఆ నాన్న లేని బిడ్డ మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశాడు. మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశాడు. సీపీఎస్ రద్దుపై మాట తప్పాడు. ఉద్యోగులను వేధిస్తున్నాడు. టీచర్లను వైన్ షాపుల ముందు నిలబెట్టాడు. కనీసం గుంతలు పడిన రోడ్లను పూడ్చలేదు. చివరకు ఎస్సీ శ్మశానవాటికలో మట్టిని కూడా తవ్వుకునే స్థాయికి దిగజారిపోయాడు.  అక్రమ మట్టి తవ్వకాలు ఆపేందుకు ప్రయత్నించిన ఉద్యోగులపై దాడులు చేయించాడు. ఇలాంటి వ్యక్తికి ఇంకోసారి అవకాశం ఇస్తే మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్లే.

మాట్లాడితే నోరు పారేసుకునే స్థానిక ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే వెనిగండ్ల రాము గుడివాడలో గెలవాలి. అలాగే కూటమి తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు వారిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ప్రముఖ క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply