Suryaa.co.in

Andhra Pradesh

నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నాం

– రాష్ట్రవ్యాప్తంగా 6 వేల 365 కేసులు నమోదు చేశాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో తూనికలు, కొలతల శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ధరలను అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత ఏడాది మార్చి నెల్లో కరోనా మొదటి వేవ్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నిత్యావసర సరుకుల కొరత లేకుండా తూనికలు, కొలతల శాఖ అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎప్పటికపుడు నిత్యావసరాల అక్రమ నిల్వలపై ఆకస్మిక తనిఖీలను కూడా చేపట్టామన్నారు. కరోనా విపత్తును ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరామని చెప్పారు. రోజువారీ తనిఖీలతో ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు పాల్పడే దుకాణాలపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ లోనూ తూనికలు, కొలతల శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలు, నిత్యావసరాల అక్రమ నిల్వలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నామని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలకు వెనకాడడం లేదన్నారు.
తూనికలు, కొలతల పరికరాలను ఉ పయోగించే వ్యక్తులు, సంస్థలు విధిగా తమ పరికరాలను నిర్ణీత సమయంలో తూనికలు, కొలతల శాఖ వద్ద సమర్పించి నిర్ణీత ప్రమాణాలకనుగుణంగా సరి చేయించుకుని ముద్రలు వేయించుకునేలా చూస్తున్నామన్నారు. సరైన ముద్రలు లేకుండా తూనికలు, కొలతల పరికరాలను వినియోగించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్యాకేజ్ కమోడిటీస్ రూలను సక్రమంగా అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు పాల్పడే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు జరుపుతూ కేసులను నమోదు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇదిలా ఉండగా 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పలు దుకాణాలపై తనిఖీలు జరిపి 6 వేల 365 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 550 కేసులు, విజయనగరం జిల్లాలో 598 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 932 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 560 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 409 కేసులు, కృష్ణాజిల్లాలో 674 కేసులు, గుంటూరు జిల్లాలో 631 కేసులు, ప్రకాశం జిల్లాలో 377 కేసులు, నెల్లూరు జిల్లాలో 203 కేసులు, చిత్తూరు జిల్లాలో 348 కేసులు, వైఎస్సార్ కడప జిల్లాలో 409 కేసులు, అనంతపూర్ జిల్లాలో 261 కేసులు, కర్నూలు జిల్లాలో 365 కేసులు నమోదు చేసినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE