– సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గని శెట్టి డిమాండ్
పరవాడ : మండలంలో ముత్యాలం పాలెం, తిక్కవాని పాలెం గ్రామాలలో ఏర్పాటుచేసిన తుపాను బాధితుల సహాయక శిబిరాలను మంగళవారం సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా సహాయక శిబిరంలో ఉన్న మత్స్యకార కార్మికులను సహాయక చర్యలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ సహాయక శిబిరాల్లో 11:30 గంటల వరకు కూడా కనీసం ఉప్మా కూడా పెట్టలేదని అన్నారు.
తిక్కవానిపాలెంశిబిరంలో కనీసం వంట కూడా చేయలేదని అన్నారు. కేవలం గ్యాస్ స్టవ్, వంట పాత్రలు మాత్రమే ఈ శిబిరంలో ఉంచారని అన్నారు. మత్స్యకారులను శిబిరాలకు తరలించిన వారికి కనీసం భోజనం, టిఫిన్ పిల్లలకు, పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేయాలని ముందస్తు ప్రణాళిక లేకపోవడం విచారకరమన్నారు. పేరుకు మాత్రమే సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకోడం సరైనది కాదన్నారు. మత్స్యకారుల మత్స్యకారులకు 25 కిలోల బియ్యం, పప్పు, నూనె, పంచదార వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మత్స్యకారుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని గనిశెట్టి హెచ్చరించారు.