Suryaa.co.in

Andhra Pradesh

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

చంద్రబాబు, లోకేష్ బాబులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఉండవా?
పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులపై ఎన్ని కేసులు పెట్టాలి?
యస్.సి, బి.సిలు అంటే ఈ జగన్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావం
రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నారనే నెపంతో వైసిపి ప్రభుత్వం సెక్షన్ 153(A) ను దుర్వినియోగం చేస్తోంది.

-తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

విజయవాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కృష్ణాజిల్లా పోలీసులు కేసు నమోదుచేసి విశాఖపట్నం విమానాశ్రయంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్ని నాని , వల్లభనేని వంశీ , కొడాలి నాని , అంబటి రాంబాబు, ఆర్.కే. రోజా చేసిన, చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కేసులు ఉండవా అని పోలీసు అధికారులను వర్ల ప్రశ్నించారు. పోలీసు అధికారులు రాజకీయ నాయకులందరిని ఒకేలా చూడాలని, ఒకరిని నెత్తికెత్తుకొని మరొకరిని కింద పడేస్తామంటే మంచి పద్ధతి కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అందరికీ చట్టం ఒకేలా ఉండాలని, చట్టం కొందరికి చుట్టం కాకూడదని అలా చూసుకోవలసిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని వర్ల గుర్తు చేశారు. విచిత్రంగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి, ఈ ప్రభుత్వం రెండు వర్గాల మధ్య వైషమ్యాలు, శత్రుత్వాలు పెంచుతున్నరనే నెపంతో, ఐపీసీ సెక్షన్ 153 (A)ను పదే పదే, ప్రతిపక్షాలపై ఉపయోగించి, ఆ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం శాశ్వతం కాదని, రేపు అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీయేనని, తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన అధికారులు తగిన మూల్యం చెల్లిస్తారని వర్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యస్.సి, బీసీ కులాలకు సంబంధించిన నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావనో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని దళిత, వెనుకబడిన, పేదవర్గాలు వ్యతిరేకిస్తున్నారని త్వరలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని తెలుసుకోవాలని అన్నారు.

 

LEAVE A RESPONSE