గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం

– ఆడుదాం.. ఆంధ్రా టోర్నీ ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తాం
– 47 రోజులు, ఐదు ద‌శ‌ల్లో క్రీడాపోటీల నిర్వ‌హ‌ణ‌.. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి పోటీలు మొద‌లు.. 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లు
– గుంటూరు నల్లపాడులోని లయోలా మైదానంలో’ ఆడుదాం- ఆంధ్ర’ క్రీడా వేడుకల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్ర’ ను గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌ లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.

“మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈరోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలబడిపోతుంది” అని సీఎం జగన్ అన్నారు.

ఆడుదాం.. ఆంధ్రా కార్యక్రమం వెనుక మన ప్రభుత్వానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని సీఎం జగన్‌ చెప్పారు. గ్రామస్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకటైతే.. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయనేది రెండో ఉద్దేశమని సీఎం జగన్‌ చెప్పారు. ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలను అచీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు.

“ఆడుదాం ఆంధ్రా మనందరి ఆట.. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి ఊరులోనూ జరిగే ఈ కార్యక్రమం ద్వారా వ్యాయామం, క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంతమేలు జరుగుతుంది, ఎంత అవసరం అనే విషయాలను తెలియ‌జేసేందుకు ఈ టోర్నీ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమంలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమో తెలియజేసేందుకు ఒక ప్రొగ్రాంలా ఇది ఉపయోగపడుతుంది” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ మధ్యకాలంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతామని, టైప్‌–2 డయాబెటీస్‌ నిరోధించడంలో క్రీడలు క్రియాశీలకంగా పనిచేస్తాయని, వ్యాయామం ఎంతముఖ్యమో తెలియజేస్తున్నామని వివరించారు.

విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు ద్వారా గ్రామస్థాయిలో ప్రివెంటీవ్‌కేర్‌ మీద దేశం మొత్తం గర్వపడేలా మన రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా వ్యాయామం ఎంత అవసరమో అనేది కూడా గ్రామస్థాయిలోకి ఒక సందేశం తీసుకెళ్లే గొప్ప కార్యక్రమం ఇదని వివరించారు.

బీపీ ఎక్కువైందంటే గుండెకు సంబంధించిన అనేక రోగాలు వస్తాయని, షుగర్‌ ఎక్కువైనా కిడ్నీకి, న్యూరాలజీకి సంబంధించి రకరకాల రోగాలు వస్తాయని, ఇటువంటివి అన్నీ కంట్రోల్‌లో ఉండాలంటే, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే కచ్చితంగా గ్రామస్థాయి నుంచి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది కాబట్టే గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేశామని వివరించారు.

రెండో ఉద్దేశంగా..
క్రీడలు సచివాలయం స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతకడం, వారిని సానబట్టి ఆ ఆణిముత్యాన్ని వజ్రంగా మలిచి దేశానికి పరిచయం చేయడం ఇంకో ముఖ్య ఉద్దేశమని వివరించారు.

గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం
“ఈ కార్యక్రమంలో సచివాలయం నుంచి మండల స్థాయి వరకు వచ్చిన తరువాత, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి టీమ్‌లు వస్తాయో.. ఆ టీమ్‌లో నుంచి ఆణిముత్యాలను వెతికేందుకు ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఉన్న టీమ్స్‌ అన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సహాయంగా ఉంటాయి. ప్రతిభ కలిగిన వారిని ఆణిముత్యాలుగా మలిచే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు టీమ్‌లు ముందుకు వచ్చాయి”అని సీఎం తెలిపారు.

క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ముందుకు వచ్చాయని, నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్లంతా మనం ఆడేఆటను చూసేందుకు వస్తారని, ఆణిముత్యాలను వెతికి, వారికి మెరుగులు దిద్ది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈటీమ్స్‌ తోడుగా ఉంటారని తెలిపారు.

బ్యాడ్మింటన్‌కు సంబంధించి శ్రీకాంత్, పీవీ సింధు భాగస్వాములు అవుతున్నారని, శ్రీకాంత్, సింధులకు మన రాష్ట్రంలో ఒకరికి, మరొకరికి తిరుపతిలో ల్యాండ్‌ ఇచ్చామని చెప్పారు. బ్యాడ్మింటన్‌ అకాడమీలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వీరికి సహకరిస్తుందని, శ్రీకాంత్, సింధు మెంటార్లుగా వ్యవహరిస్తారని, ప్రతిభ కలిగిన మన పిల్లలకు వీరు తోడుగా నిలుస్తారని తెలిపారు.

వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారని, వీరంతా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని, టాలెంట్‌ హంట్‌లో భాగస్వాములు అవుతారని తెలిపారు.

మనం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర టోర్నీ ప్రతి సంవత్సరం జరుగుతుందని, గ్రామస్థాయి నుంచి మొదలై.. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని, ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర జరుగుతున్నప్పుడు గ్రామాల్లో ఆరోగ్యపరమైన అవగాహన, టాలెంట్‌ హంట్‌ కొనసాగుతుందని, మరిన్ని ఆణిముత్యాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తాయని తెలిపారు.

సచివాలయ స్థాయి నుంచి కిట్లు పంపిణీ చేస్తున్నామని, సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వారికి నియోజకవర్గ స్థాయిలో ఆడేందుకు ప్రొఫెషనల్‌ కిట్లు పంపిణీ జరుగుతుందని వివరించారు. మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని. ప్రతి ఏటా కిట్లు ఇస్తూ.. మన పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేయడానికి ముందుకువచ్చారని, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి 22 లక్షల 85 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆడుదాం ఆంధ్రాకు ఈరోజు నుంచి శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు.

“ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9000 ప్లే గ్రౌండ్లు గుర్తించి సిద్ధం చేశాం. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అన్నింటినీ గుర్తించి, డెవలప్‌ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సాహం జరుగుతుంది. అందరికీ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ విషెస్‌.. మీ అన్నగా తెలియజేస్తున్నాను. దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలని కోరుకుంటున్నాను”అని సీఎం తెలిపారు.

Leave a Reply