Suryaa.co.in

Andhra Pradesh

దళితులకు రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తాం

– చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరం
– జలజీవన్‌ మిషన్‌తో ప్రతి ఇంటికి నీరందిస్తాం
– అమరావతి మండల గ్రామాల్లో పర్యటన
– టీడీపీ అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్‌

ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నా, పల్నాడు జిల్లాకు గోదావరి జలాలు రావాలన్నా నారా చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరమని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం జరిగితేనే ఉపాధి అవకాశాలు దక్కుతాయని, ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు.

సోమవారం వారు అమరావతి మండలం పెదమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, నరికుల్లపాడు గ్రామాల్లో పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు రోడ్లు, సైడ్‌ డ్రైన్స్‌, ట్యాంకర్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేయిస్తామని అన్నారు. పెదకూరపాడు గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయటంలో ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

దళితులకు రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తాం
రాష్ట్రంలో దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 27 పథకాలను టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తుందన్నారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపేలా పాలన ఉంటుం దన్నారు. బీసీలకు రక్షణ చట్టాలను తీసుకొస్తామని, కార్పొరేషన్‌లకు నిధులు సమాకూరు స్తామని హామీ ఇచ్చారు. రైతులకు మేలు జరగాలంటే గోదావరి జలాలను సాగర్‌ కుడి కాలువకు తెచ్చుకోవాలని… ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావా లని అన్నారు. ఇప్పటికే నిధులు మంజూరు అయిన జలజీవన్‌ మిషన్‌ను అభివృద్ధి చేసి ప్రతి ఇంటికీ నీటిని తెస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE