Suryaa.co.in

Andhra Pradesh

151 సీట్లకు పైగా సాధించి ప్రజలతో నూరుశాతం మార్కులు వేయించుకుంటాం

– గడపగడపకు మన ప్రభుత్వం సక్సెస్ అవుతుంది
– పవన్ కళ్యాణ్ ను దత్తత తీసుకుని పదేళ్ళు అయింది
– మంగళగిరిలో గెలవలేక లోకేష్ డింకీలు కొట్టాడు
– పవన్ కళ్యాణ్ ను నిలబెట్టిన రెండు చోట్లా డింకీలు
– చంద్రబాబు జీవితం మోసం, కుట్ర, వెన్నుపోట్లు
– ఒక్కడిగా వస్తే చంద్రబాబును ప్రజలు బాదారు
– ఇద్దరూ కలిసి వస్తే బాదుడే బాదుడుకు సిద్ధంగా ఉన్నారు
– చంద్రబాబు నాటకాలకు సహకరిస్తే జైలుకెళ్ళక తప్పదు
– చిల్లర కార్యక్రమాలను కొనసాగిస్తే నారాయణకు పట్టిన గతే
– గుంటూరు, పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ కొడాలి నాని

గుంటూరు, మే 10: 2024 ఎన్నికల్లో 151 సీట్లకు పైగా సాధించి రాష్ట్ర ప్రజలతో నూరుశాతం మార్కులు వేయించుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం మాజీ హెూం మంత్రి మేకతోటి సుచరిత నివాసంలో వైసీపీ గుంటూరు జిల్లా నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీ నుండి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. గ్రామాల్లో ఉన్న బూత్ కమిటీలు, పార్టీ, అనుబంధ విభాగాల కమిటీలను సమాయత్తం చేస్తామన్నారు. ప్రభుత్వం, పార్టీని ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు.

సీఎం జగన్మోహనరెడ్డి గత మూడేళ్ళలో 96 శాతం హామీలను అమలు చేశారని, వీటిని ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వం నుండి చేకూరిన లబ్ధిని ఆయా కుటుంబాలకు తెలియజేస్తామన్నారు. ప్రజలు ఇంకా ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటామన్నారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యలను కూడా అధ్యయనం చేస్తామన్నారు. ప్రతి నెలా నియోజకవర్గంలో 10 సచివాలయాలను సందర్శించడం ద్వారా వచ్చిన తక్షణ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పరిష్కారం కానివి ఉంటే వాటిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 2024 ఎన్నికల నాటికి జగన్ ను సీఎం చేసే కార్యక్రమం చేపట్టామని, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలను అందిస్తామన్నారు. గతంలో గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించిన అనుభవంతో పనిచేస్తామన్నారు. ప్రభుత్వపరంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రభుత్వం, పార్టీ కలిసి నిర్వహించే ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వ పనితీరులో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఏర్పడుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో 151 సీట్లకు పైగా సాధించి ప్రజలతో నూరుశాతం మార్కులు వేయించుకుంటామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చినట్టుగా మిఠాయి కొట్టులో పొట్లాలు కట్టుకునే కరపత్రం మేం ఇవ్వమని చెప్పారు. చేకూరిన లబ్ధిని ఆయా కుటుంబాలకు తెలియజేస్తామన్నారు. కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు, వారికి కేటాయించిన వాలంటీర్ వివరాలు కూడా ఉంటాయన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ముద్రించినట్టుగా పేపర్లు తెచ్చి తెల్లారేసరికి పంచే కార్యక్రమంలా చేయడం లేదన్నారు. గత నెల 27, 28 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణకు అవసరమైన మెటీరియల్ ను సమకూర్చుకునేందుకు పది రోజుల సమయం తీసుకున్నామన్నారు. చంద్రబాబు, కొంత మంది పనికిమాలిన సన్నాసులు చెబుతున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోలేదని చెప్పారు. ఈ నెల 11 వ తేదీ నుండి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించామని, దీని ప్రకారం కార్యక్రమం జరుగుతోందన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ను చూసి భయపడాల్సిన పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాని హామీని చూపించే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో చేసిన ఏకైక ప్రభుత్వం సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వమని అన్నారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో జగన్మోహనరెడ్డి పోల్చారని గుర్తుచేశారు. మాటలు చెప్పి చేతలను గాలికొదిలే వ్యక్తి జగన్మోహనరెడ్డి కాదని అన్నారు.

చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పే మాటలను ఎవరూ పట్టించుకోవద్దన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఎప్పుడు విడిపోయి లేరన్నారు. ఎన్నికలు నెల రోజులు ఉండగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని, ఇటువంటి నాయకుడిని ప్రపంచంలో ఎవరూ చూడలేదన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గెలవడానికి రెండు, మూడు శాతం ఓటింగ్ మారాల్సి ఉంటుందన్న ఆలోచన చేశారన్నారు. పేమెంట్ ఇస్తే పనిచేసే ఆర్టిస్ట్ చంద్రబాబుకు కావాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడన్నారు. చంద్రబాబు కోసమే పనిచేసి ముఖ్యమంత్రిని చేశాడని, ఆ తర్వాత టీడీపీ వ్యతిరేక ఓటు చీలిపోవడానికి కృషి చేశాడన్నారు. దీనిలో భాగంగా విడిపోయినట్టుగా కొత్త ముసుగు వేసుకుని వచ్చాడన్నారు. ఇప్పుడు జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడన్నారు. పవన్కళ్యాణ్ ను చంద్రబాబు దత్తత తీసుకుని పదేళ్ళు అయిందని చెప్పారు. సొంత పుత్రుడు మాత్రం ఉత్తుత్తి పుత్రుడు అయ్యాడన్నారు.

మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేపై గెలవలేక డింకీలు కొడుతున్నాడన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చి రెండు చోట్ల పెడితే ఆయన రెండు చోట్లా డింకీలు కొట్టాడన్నారు. ఇప్పుడు చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నాడన్నారు. టైటిల్ ఏం పెట్టాలని రైటర్ ను అడిగినట్టు ఉన్నారని, ఇద్దరు హీరోలు కావడంతో బాదుడే బాదుడు అని పెట్టమని చెప్పినట్టు ఉన్నారన్నారు. ఒకడైతే బాదుడు, ఇద్దరైతే బాదుడే బాదుడు అని వాళ్ళ టైటిల్ వాళ్ళే పెట్టుకున్నారన్నారు. బాదించుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ కలిసి బయలుదేరారని, మాకేమీ అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు జీవితమే మోసం, కుట్ర, వెన్నుపోటు అని అన్నారు. అందితే కాళ్ళు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడన్నారు. చంద్రబాబుతో ఉంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండుసార్లు మునిగాడన్నారు. 2014 లో పార్టీ పెట్టి ఏమీ సాధించలేదన్నారు.

2019 లోనూ ఏమీ సాధించలేదని గుర్తు చేశారు. మూడవసారి చంద్రబాబుతో కలిసి వెళ్తున్నాడన్నారు. గెలవడం, ఓడడం కోసం రాజకీయ పార్టీ పెట్టలేదని, పవన్ కళ్యాణ్ ఉద్ధేశ్యం వేరని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ప్రకారం ఆయనకు కావాల్సింది దక్కుతోందన్నారు. చంద్రబాబుకు కూడా ఒకసారి దక్కితే రెండుసార్లు దక్కడం లేదన్నారు. ఏదో విధంగా కష్టపడి పవన్కళ్యాణ్ ను పోషిస్తున్నాడన్నారు. జగన్మోహనరెడ్డి సింగిల్ గా వస్తున్నారని, ఆయనపై ఆయనకు నమ్మకం ఉందన్నారు. నడిపిన ప్రభుత్వంపై, ప్రజలపై కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యంత్రాంగంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎంత మంది కలిసి పోటీ చేసినా ఎదుర్కొనేందుకు ఒక్కడినే వస్తానని సీఎం జగన్మోహనరెడ్డి చెప్పారన్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇదే చెబుతున్నారని, ఇప్పుడు కూడా స్పష్టం చేశారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డిపై వ్యతిరేకత ఉందని చెబుతున్నారని, పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేసి ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా అని అన్నారు.

చంద్రబాబు కూడా 175 సీట్లను గెల్చుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రోడ్ మ్యాప్ ఇస్తే తిరుగుతానంటూ పవన్ కళ్యాణ్ వేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం రాష్ట్రానికి అవసరంగా మాట్లాడుతున్నారన్నారు. అధికారం చంద్రబాబు, లోకేష్ లకు వస్తుందని, క్యాష్ మాత్రం పవన్ కళ్యాణ్ కు వస్తుందన్నారు. 1977 ఫార్ములా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పాడన్నారు. కలిసి పోటీ చేయడం, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడమే ఫార్ములా అని అన్నారు. 2019 ఎన్నికల్లో ఒకడిగా వస్తే చంద్రబాబును బాదారని, ఈసారి పవన్ కళ్యాణ్ తో బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు వస్తున్నారని, ఇద్దరినీ బాదడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణలో సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విఫలమైందని దుష్ప్రచారం చేశారన్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నాపత్రాలు ఇచ్చిన గంట తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రశ్నాపత్రాలను సర్క్యులేట్ చేస్తున్నారన్నారు. విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోనే ఉన్నపుడు ప్రశ్నాపత్రాలు బయటకు రావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వానికి రంకులు అంటగట్టే ఉద్దేశ్యంతోనే పరీక్షా కేంద్రాల్లో పనిచేసే కొంత మంది వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారన్నారు.

చంద్రబాబు దగ్గర అనుభవం ఉన్న నారాయణ తన విద్యాసంస్థల ద్వారా ప్రశ్నాపత్రాలను లీకేజ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో నారాయణ పనిచేశాడని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపడం వల్ల అన్ని విషయాలు బయటకు వచ్చాయన్నారు. దీని ఆధారంగా నారాయణను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మహిళలపై రేప్ లు, హత్యలు జరిగాయని అల్లరి చేస్తున్నారని, ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కాదా అని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు, లోకేష్ లు వస్తారని, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి సందేశం ఇస్తారన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు జరిగాయంటూ రాద్దాంతం చేస్తుంటారన్నారు. బురదంతా తీసుకువచ్చి జగన్మోహనరెడ్డి నెత్తిన వేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు నాటకాలకు సహకరించిన ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదన్నారు. నీతి, నిజాయితీ, న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, తప్పు చేయాలంటే భయపడే పరిస్థితిని తెస్తున్నామన్నారు. చిల్లర కార్యక్రమాలను కొనసాగిస్తే నారాయణకు పట్టిన గతే పడుతుందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని హత్యలు, మానభంగాలు, పేపర్ లీకేజ్ లు వంటి పనికిమాలిన కార్యక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కొడాలి నాని హెచ్చరించారు.

LEAVE A RESPONSE