సంక్షేమం మాయ‌.. అభివృద్ధి ఎక్క‌డా…!

బ‌డ్జెట్ పేరుతో మ‌రొక క‌నిక‌ట్టు
రాష్ట్ర బ‌డ్జెట్‌పై ఏపిసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు గిడుగు రుద్ర‌రాజు వ్యాఖ్య‌లు

విజ‌య‌వాడ‌:-ఘ‌న‌మైన అంకెల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో అంకెలు త‌ప్ప అభివృద్ధి క‌నిపించ‌డంలేద‌ని ఏపిసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు గిడుగు రుద్ర‌రాజు అన్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ఏపిసీసీ కార్యాల‌యం నుండి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా గిడుగు రుద్ర‌రాజు మాట్లాడుతూ, గ‌త నాలుగేళ్లుగా అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు త‌ప్ప కొత్త‌గా ఎటువంటి ప‌థ‌కం ప్ర‌క‌టించ‌లేద‌ని గుర్తుచేశారు.

సంక్షేమంలో కూడా ఈ ప్ర‌భుత్వం అంకెల గారెడీనే న‌మ్ముకుంద‌ని, గ‌త ప్ర‌భుత్వాలు అమ‌లు చేసిన ప‌థ‌కాల‌కు చిత్ర‌విచిత్ర‌మైన పేర్లు పెట్టి ఆ ప‌థ‌కాల‌న్నీ వైసీపీ ప్ర‌భుత్వ‌మే అమ‌లుచేస్తున్న‌ట్లు డాంబికాలు ప‌లుకుతోంద‌ని అన్నారు. వాస్త‌వానికి ఏ రాష్ట్రంలోనైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా స‌మాన స్థాయిలో ఉండాల‌న్న‌ది ప్ర‌పంచం మొత్తం అంగీక‌రించిన ఆర్థిక విధాన‌మ‌ని పేర్కొన్నారు. కానీ.. ప్ర‌స్తుత రాష్ట్ర ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా అప్పులు చేసి అమ‌లుచేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల దీర్ఘ‌కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్నం అవుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర భ‌విష్య‌త్తుకు పారిశ్రామిక‌వేత్త‌ల పెట్టుబ‌డుల‌కు ఎంతో అవ‌స‌ర‌మైన పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణం, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న, విద్యుత్‌శ‌క్తి రంగంలో స్వ‌యంస‌మృద్ధి వంటివి ఎంతో కీల‌క‌మ‌ని, కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయా రంగాల‌కు కేటాయించిన మొత్తాలు ఖ‌ర్చు పెట్టేందుకు అవ‌స‌ర‌మైన నిధులు మాత్రం ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌న్నారు. కేవ‌లం అప్పులు, కేంద్ర నిధులు ద్వారా వ‌స్తున్న నిధుల‌తోనే బ‌డ్జెట్ రూపొందించార‌ని పేర్కొన్నారు.రాష్ట్రానికి వ‌స్తున్న ఆదాయం ఎటు పోతుందో ప్ర‌జ‌ల‌కు తెలిసేలా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న విచ్చ‌ల‌విడి అప్పులు వ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంద‌ని గిడుగు రుద్ర‌రాజు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు త‌మ పార్టీ వ్య‌తిరేకం కాద‌ని, కానీ.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అప్పులు చేసి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుచేయ‌డాన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని అన్నారు. రాష్ట్రానికి వ‌స్తున్న ఆదాయాన్ని ఎక్కువ చూపుతూ అంకెల గార‌డీ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆదాయ మార్గాల‌న్నీ బాగుంటే పాత అప్ప‌లకు వ‌డ్డీలు క‌ట్ట‌డం కోసం కూడా అప్పులు చేసే దౌర్భాగ్య‌స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వుందని, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నిర్ణీత స‌మ‌యంలో వేత‌నాలు ఎందుకు చెల్లించ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నించారు. నెల రోజులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీన ఇచ్చే జీతాలు కూడా ఇవ్వ‌లేని దుస్తితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని న‌మ్మి పారిశ్రామికవేత్తలు రూ.10ల‌క్ష‌ల కోట్ల పెట్ట‌బ‌డుల‌ను ఏ విధంగా పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు.26 జిల్లాలు ఏర్పాటు చేశామ‌ని గొప్ప‌లు పోతున్న ప్ర‌భుత్వం ఆయా జిల్లాల్లో అధికారుల‌కు క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌క‌పోవ‌డం దుర‌దుష్ట‌క‌ర‌మ‌ని అన్నారు.