ప్రజలకు మేలు చేసే అంశాలేమిటి?

-ఎస్సీ, ఎస్టీ, బీసీలుసహా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఏం చేద్దాం?
-లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి
-బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీకి బండి సంజయ్ ఆదేశం
-నివేదిక రాగానే కోర్ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయం
-సంజయ్ ఆదేశం మేరకు వివిధ రంగాల నిష్ణాతులతో సమావేశానికి సిద్ధమైన టాస్క్ పోర్స్ కమిటీ
-రేపు బీసీ డిక్లరేషన్ లో వివిధ రంగాల నిష్ణాతులతో సమావేశం కానున్న టాస్క్ ఫోర్స్ కమిటీ

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే అంశాలపై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా… ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా అంశాలను గుర్తించి పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని నిర్ణయించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ బాధ్యతను టీఎస్పీఎస్పీ మాజీ సభ్యులు సీహెచ్ విఠల్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ కమిటీకి అప్పగించారు. తక్షణమే వివిధ రంగాల నిష్ణాతులతో సమావేశమై ఆ నివేదికను అందజేయాలని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే పార్టీ కోర్ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి మేనిఫెస్టో రూప కల్పన చేయాలని నిర్ణయించారు.

బండి సంజయ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక రూపకల్పనకు సిద్ధమైంది. అందులో భాగంగా గత నాలుగేళ్లుగా బండి సంజయ్ నాయకత్వంలో ఏయే అంశాలపై పార్టీ చేసిన పోరాటాలు, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలేమిటనే అంశాలను సేకరిస్తోంది. అట్లాగే రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల పై దృష్టి సారించింది.

విధ అంశాల విషయంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ బండి సంజయ్ సహా పార్టీ నేతలు జైలుకు వెళ్లడమే కాకుండా టీచర్ ఎమ్మెల్సీసహా పలు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తూ అధికార పార్టీ కి ప్రత్యామ్నాయం గా ఎదిగిన క్రమంలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన హామీల అమలు చేయడం పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యేలా అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

ప్రధానంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ 57 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి తెలంగాణ నలు మూల ల అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా గట్టేందుకు తీవ్రస్థాయిలో క్రుషి చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ లో గెలుపే లక్ష్యంగా దాదాపు 18 భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీనడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యారు.

ఆ సందర్భంగా బీజేపీ అధికారం లోకి వస్తె ఉచిత విద్య. ఉచిత వైద్యం అందిస్తామని, నిలువ నీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఏటా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తామని ప్రకటించారు. వీటితోపాటు స్థానిక సమస్యల పరిష్కారంపైనా పలు హామీలిచ్చారు.

టాస్క్ ఫోర్స్ కమిటీ ఆయా హామీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సాధికారత వంటి అంశాల పై అయా రంగాలలో నిష్ణాతులైన మేధావులతో చర్చించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి పూర్తి స్థాయి నివేదిక ను పార్టీ కి ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కమిటీ కి ఆదేశించారు.

అందులో భాగంగా రేపు సాయంత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బీసీ సబ్ ప్లాన్, బీసీ డిక్లరేషన్ పత్రం పై అధ్యయనం చేసేందుకు విఠల్ తోపాటు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్, రిటైర్డ్ ఐపీఎస్ క్రిష్ణప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి బీసీ మేధావులు, విద్యావేత్తలతోపాటు పలువురు నిష్ణాతులను ఆహ్వానించారు. బండి సంజయ్ సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు.