-మీ మౌనం ఓఆర్‌ఆర్ టెండర్‌లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి
-ఓఆర్‌ఆర్ టెండర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి?
– టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటు
– ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటి?
• ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి
• మీకు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలి
– ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్,
29.05.2023
గౌరవనీయులైన శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి,
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం,
హైదరాబాద్.
నమస్కారం..
విషయం: ఓఆర్‌ఆర్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టడంతోపాటు వాస్తవాలను బహిర్గతం చేయాలని కోరుతూ..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఆరోపణలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీదే.
ఇప్పటికే ఓఆర్‌ఆర్ పై ఏడాదికి రూ.415/- కోట్ల ఆదాయం వస్తుంది. ఇది ప్రతీ యేడు 5% పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30,000/- కోట్ల ఆదాయం చేకూరేది. ప్రభుత్వం ఈ ఆలోచన చేయకపోవడం వెనకవున్న ఆంతర్యం ఏమిటి? రాష్ట్రానికి రావల్సిన ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్ ఇవ్వడం వెనుక జరిగిన తతంగం ఏమిటి? అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తోంది?
హైదరాబాద్ ఓఆర్‌ఆర్ టెండర్ దక్కించుకున్న ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ (ఐఆర్బీ) సంస్థనే మహారాష్ట్రలోని ముంబై – పుణె ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు, ముంబై–పుణె నేషనల్ హైవే –4 టోలింగ్తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతను కూడా నిర్వహిస్తుంది. దీని పరిధి 1014 లేన్ కిలోమీటర్లు. ఒప్పంద కాలం 10 యేండ్లు. ఆదాయం రూ.8,875/- కోట్లు. మరి తక్కువ దూరం, తక్కువ కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్ అప్పగించినప్పుడు ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్‌ఆర్ టెండర్‌లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి. ఓఆర్‌ఆర్ టెండర్‌పై ప్రభుత్వ మార్గదర్శకాల టెండర్ల నోటిఫికేషన్ దగ్గర నుంచి.. ఫైనలైజేషన్ వరకు అంతా రహస్యంగానే ఉంచింది. బేస్ ప్రైస్ ఎంత పెట్టారో కూడా చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. మరోవైపు ఓఆర్ఆర్‌పై వార్తలు రాస్తే బెదిరింపులకు దిగుతున్నది. ప్రశ్నించే పార్టీలకు లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నది. అసలు ఈ టెండర్ విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది. తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలి. అట్లాగే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
-బండి సంజయ్ కుమార్, ఎంపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు.