Suryaa.co.in

Political News

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో వైసీపికి ?

ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు మరో 3-4 నెలల సమయం ఉంది. అప్పుడే మీడియా, సర్వే సంస్థలు లోక్సభ ఎన్నికలపై తమ అంచనాలు చెప్పడం మొదలుపెట్టాయి. ముందుగా ‘టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఓపినీయన్ పోల్’ మొదలుపెట్టింది. ఈసారి కూడా లోక్ సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిపింది. మొత్తం 543 లోక్సభ స్థానాలలో ఎన్డీఏ కూటమి 323 స్థానాలు గెలుచుకొని తిరుగులేని మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. కాంగ్రెస్తో కలిపి ఇండియా కూటమికి 163 సీట్లు, ప్రాంతీయ పార్టీలకు 57 సీట్లు లభిస్తాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 24-25 అధికార వైసీపియే గెలుచుకొంటుందని, ఒక్క సీట్లు టిడిపి గెలిస్తే గెలవచ్చని పేర్కొంది. జనసేన, బీజేపీ, ఇతరులకు ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చని తెలిపింది. కాంగ్రెస్తో సహా ఏర్పడిన ఇండియా కూటమి 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.

ఈ కారణంగా ఇండియా కూటమిలో అప్పుడే విభేధాలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇండియా సత్తా చూపలేకపోవడం, బలహీనపడటం రెండూ బీజేపీకి కలిసివచ్చేవే. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో మూడు కీలకమైన రాష్ట్రాలను కోల్పోయినందున, అక్కడ లోక్సభ ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే ఉత్తరాదిన పలు రాష్ట్రాలలో బీజేపీయే అధికారంలో ఉంది. అవన్నీ చాలా ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్న రాష్ట్రాలే. కనుక ‘టైమ్స్ నౌ’ ఊహించిన్నట్లే లోక్సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి మళ్ళీ విజయం సాధించవచ్చనే ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఆంధ్రాలో అది వాస్తవ పరిస్థితులు, రాజకీయ, కుల సమీకరణాలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్, తెలంగాణ ఎన్నికల ప్రభావం, యువగళం పాదయాత్ర పాదయాత్ర, టిడిపి హామీలు వంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా ఢిల్లీలో కూర్చొని సర్వే నివేదిక వండి వడ్డించినట్లుంది. ఇంతకాలం సంక్షేమ పధకాలే తమని మళ్ళీ గెలిపిస్తాయని చెప్పుకొన్న ఏపీ సిఎం జగన్ అప్పుడే తన ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలను మార్చేస్తున్నారు.

అంటే తమ ఎమ్మెల్యేలు, సంక్షేమ పధకాలు వైసీపిని గెలిపించలేవని గ్రహించిన్నట్లే ఉన్నారు కదా? టిడిపి, జనసేనల పొత్తులు, వివిద సామాజిక వర్గాల ప్రజలపై వాటి ప్రభావాన్ని కూడా సర్వే పట్టించుకొన్నట్లు లేదు. ప్రభుత్వం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మద్యతరగతి ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతని సర్వే పట్టించుకొన్నట్లు లేదు.

అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, రైల్వే జోన్ ఏర్పాటు, ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, విశాఖ రాజధాని వంటి అంశాలలో వైసీపి అలసత్వం, వైఫల్యాలను కూడా సర్వే పట్టించుకోలేదు. మరి ఏ లెక్కన ఏపీలో 24-25 లోక్సభ సీట్లు వైసీపి గెలుచుకొంటుందని జోస్యం చెప్పిందో వాటికే తెలియాలి. ఈ సర్వేలను సొంత మీడియాలో వేసుకొని ఆ సంతోషంతో అదే భ్రమలో ఉండిపోతే, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో వైసీపికి కూడా పట్టవచ్చు.

– ఆర్

LEAVE A RESPONSE