గెలుపు బలుపు కాకూడదు

ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. రాజ్యాంగబద్ధంగా వారిని పాలించడానికి, పాలకులను ప్రశ్నించడానికి కూడా ప్రతినిధులను వారే ఎన్నుకుంటారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, ధృఢ సంకల్పంతో పౌరులు తమకు అప్పగించిన అధికారాన్ని వినయంగా స్వీకరించి ప్రజాసేవ చేయాలి తప్ప, గెలుపు ఇచ్చిన అహంకారంతో ప్రజా కంటకంగా వ్యవహరిస్తే ఏవిధంగా కర్రుకాల్చి వాత పెడతారు అనేదానికి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలే ఉదాహరణ.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ పాలనను మొదటి విడతలో ప్రజలు ఉపేక్షించినా, రెండవసారి విజయం సాధించిన తరువాత నెలరోజుల పాటు మంత్రివర్గాన్ని చేయకుండా అహంభావాన్ని ప్రదర్శించిన అప్రజాస్వామిక ధోరణిపై ప్రజలు తమ అసంతృప్తిని అవకాశం వచ్చినపుడల్లా కనపరిచారు. తరువాత వచ్చిన జిహెచ్ఎంసి ఎన్నికలు, ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థి అనుకున్న పార్టీలను గెలిపిస్తు వచ్చారు.

ధన బలం, అధికార బలంతో మాత్రమే గెలుపు సాధ్యమని అనేక మందిలో ఉన్న అపోహను ప్రస్తుత తెలంగాణ ఎన్నికలు పటాపంచలు చేశాయి. భారాస గణనీయంగా డబ్బులు పంచిన గ్రామీణ తెలంగాణాలో ఘోర ఓటమిని చవి చూస్తే, పెద్దగా డబ్బు పంచని జిహెచ్ఎంసి పరిధిలో విజయం సాధించింది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎటువంటి ప్రలోభాలకు ఓటరు లొంగడని మరోసారి రుజువయ్యింది.

సయామీ కవలలు
పాలనా విధానంలో, ప్రవర్తనలో, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంలో, అహంకార ధోరణిలో కెసిఆర్, జగన్ సయామీ కవలలు. నిర్భయంగా అబద్ధాలు చెప్పడంలో, ప్రభుత్వ ఉద్యోగులను అవహేళన చేయడంలో, విచక్షణా రహితంగా ప్రత్యర్ధులపై విరుచుకు పడటంలో, అవినీతిలో, ఉద్యమాలను అణచివేసే విధానంలో ఇద్దరి ‘మోడస్ ఆపరెండి‘ దాదాపు ఒకటే. ఒకరిది దొరల పాలనైతే మరొకరిది పాలెగాని తరహా పాలన. కాకపోతే కెసిఆర్ అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపడనీయలేదు, జగన్ విషయంలో అభివృద్ధి ఊసే ఉండదు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలచే మీడియాను కర్కశంగా నియంత్రించడంలో ఇద్దరి విధానాలు ఒక్కటే. తెలంగాణాలో ధరణి, ఏపిలో జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకాలలో అంతులేని అవినీతి జరుగుతోందని, వేల కోట్ల విలువైన భూముల యాజమాన్యపు హక్కులు మారిపోయాయని, లక్షలాది ఎకరాలు అసైన్డ్ భూములు అధికారపక్ష నాయకుల కబ్జాలోకి క్రమబద్ధీకరణ పేరుతో వెళ్లిపోయాయని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.

జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని రెవెన్యూ బాధితుల వ్యతిరేకత తెలంగాణలో కెసిఆర్ ఓటమికి ఒక ప్రధాన కారణం అయ్యుండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో కూడా ఇరువురి వ్యవహార శైలి ఒక్కటే.

బలం అనుకున్న పథకాలే దెబ్బ తీశాయా?
ఆసరా పింఛన్లు, రైతు బంధు, గొర్రెల యూనిట్లు, దళిత బంధు, బిసి బంధు పథకాల ద్వారా రాష్ట్రం లోని ప్రతి ఇంటికి తాను చేకూర్చిన ప్రయోజనాలే తమకు ఓట్లు కురిపిస్తాయని కెసిఆర్ ఆశిస్తే, తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని జగన్ ఆశ పడుతున్నారు. ఇద్దరూ తమకు ముందు ప్రభుత్వాలు అసలు సంక్షేమ కార్యక్రమాలే అమలు చేయనట్లు, సంక్షేమానికి తామే ఆద్యులమన్నట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలకు నమ్మబలుకుతారు.

తమ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు కూడా తామే చేసినట్లు నిర్భీతిగా చెప్పుకుంటారు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పదకాలను జగన్మోహన రెడ్డి బొమ్మ ముద్రించి తమ స్వంత పథకాలుగా ప్రచారం చేయడంపై ఆగ్రహించి ఏపికి ఈ ఏడాది ఇవ్వవలసిన రూ.4,047 కోట్ల నిధుల మంజూరును కేంద్ర రద్దు చేసింది. విపరీత ప్రచారం చేసిన దళిత బంధు నిజమైన లబ్ది దారులకు చేరలేదని, కేవలం అధికార పక్షానికి సన్నిహితమైన వారికి మాత్రమే లబ్ది చేకూరిందన్న అపవాదు నుండి కెసిఆర్ తప్పించుకోలేక పోయారు.

ఏపి లో కూడా దళితులకు, బిసిలకు, మైనారిటీలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 67 పథకాలను నిర్వీర్యం చేయడమే కాక, వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. భారాస అమలు చేసిన మరో ముఖ్య పథకమైన రెండు పడకల ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులకు కేటాయించిన ఇళ్లకు పొంతన లేకపోగా, దక్కిన కొద్ది ఇళ్ళల్లో కూడా నాయకుల జోక్యం, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. డబల్ బెడ్ రూం ఇళ్ళంటు కెసిఆర్, ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని ఆశ చూపిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తమను మోసం చేశారనే తీవ్ర అసంతృప్తి పేద వర్గాలలో ఉంది.

తెలంగాణలో రైతుబంధుతో ఎక్కువ మందికి లబ్ది చేకూరినప్పటికి, గ్రామాల్లో వ్యవసాయం చేయని భూస్వాములకు అధిక మొత్తం అందుతుండటం సన్న చిన్నకారు రైతులకు రుచించలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిగా అమలు కాక పోవడం కూడా వారిలో అసంతృప్తి రేకెత్తించింది. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లుగా ‘ ఎక్కువ ఎకరాలకు ఉన్నోల్లకు ఎక్కువ పైసలిస్తే, బక్క రైతుకు ఎందుకంత కడుపు మంట‘ అని హేళనగా మాట్లాడిన కెటీఆర్ అహంకారానికి బక్క రైతులిచ్చిన సమాధానమే గ్రామీణ తెలంగాణాలో భారాస ఘోర ఓటమి.

అదే విధంగా అహంకారంతో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కెటిఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల కూడా బిఆర్ఎస్ నష్టపోయింది. ఒక విధంగా చాలావరకు సక్రమంగా అమలు జరిగిందని అనుకుంటున్న రైతు బంధు పథకం పైనే అసంతృప్తి ఉంటే, ఒక్కో రైతుకు ఏడాదికి కేవలం ఏడువేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తూ, 16 లక్షల మంది కౌలు రైతులలో పది శాతానికి మాత్రమే దక్కుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా పథకం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఊహ కందని విషయం కాదు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే గెలుపోటములను నిర్దేశించ లేవని ఇటీవల జరిగిన మినీ సార్వర్తిక ఎన్నికలు నిరూపించాయి.

నీరు .. నిధులు .. నియామకాలు
‘నీరు,నిధులు, నియామకాలు‘ నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ బిడ్డలకు అవి ఎండమావులుగా మారాయి. రాష్ట్ర విభజన సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపిణీ జరగడం వలన జల వివాదాలు తగ్గాయి. ఒక పక్క నిరుద్యోగం, సజావుగా ఆపన్నులకు చేరని ప్రభుత్వ పథకాలు, మరో పక్క లక్ష కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్కు ప్రాణాధారమైన మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బ్యారేజిలో సమస్యలు కెసిఆర్ పాలనలోని అవినీతిని బట్టబయలు చేశాయి.

మరోపక్క ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు తరలుతున్న యువత, ఉపాధికోసం వెతుక్కుంటూ వలస వెళుతున్న కార్మికులు, 50 శాతం కూడా నెరవేరని ఎన్నికల హామీలు, రాష్ట్రాభివృద్ధికి చోదకాలైన పోలవరం, అమరావతి నిర్వీర్యం కావడం, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోవడం వంటివి జగన్మోహన రెడ్డి పాలనా వైఫల్యాలకు, అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సేవలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించాల్సిన ఉద్యోగులు నెలనెలా సవ్యంగా జీతం పడితే చాలనేంతగా విసిగిపోయారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇరు రాష్ట్రాలలో తీవ్ర నిర్బంధాలు, అవమానాలు అనుభవించారు. హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ రద్దు చేయక పోవడం, ప్రమోషన్లు ఇవ్వక పోవడం, రిటైర్మెంట్ వయసు పెంపు, పారదర్శకంగా బదిలీలు చేపట్టక పోవడం, పీఆర్సీ జాప్యం చేయడం, డిఏలు విడుదల చేయకపోవడం, వైద్య బిల్లులు, పీఎఫ్ చెల్లింపుల్లో జాప్యం జరగడం వల్ల ఏపి లోని 12 లక్షల మంది, తెలంగాణ లోని 9 లక్షల మంది ప్రభుత్యోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో పాలకుల పట్ల తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది. ఇక నిధుల సంగతేమో కానీ జగన్ షుమారు ఎనిమిది లక్షల కోట్లు, కెసిఆర్ షుమారు ఐదు లక్షల కోట్లు అప్పు భారం ప్రజల నెత్తిన వేశారు.

అయితే ఆ మేరకు అభివృద్ధి జరిగిందా అంటే సమాధానం శూన్యం. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్,ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపడతామని ఊదరకొట్టిన అపూర్వ మిత్రులు యధావిధిగా మాట తప్పి మడం తిప్పారు. ఉద్యోగ నియామకాల్లో జాప్యం, గ్రూప్I, గ్రూప్II నియామకాలు లేకపోవడం, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగుల్లో, యువతలో అసంతృప్తి పెల్లుబికింది. మన నీళ్లోస్తాయ్, మన నిధు లోస్తయ్, మన ఉద్యోగాలోస్తాయి అనే ఆశయంతో అమరుల బలిదానాల మీద ఏర్పడ్డ బంగారు తెలంగాణ అనేకమంది నిరుద్యోగుల ఆత్మహత్యలు, అప్పులతో దగాపడ్డ తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మారిందన్న విపక్షాల, ప్రజా సంఘాల విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ తమ పాలనా సమయంలో నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించేవారు. కాని కెసిఆర్ ఇనుప కంచెలు అడ్డుపెట్టుకుని ప్రగతి భవన్ కు, పరదాల చాటున జగన్ తాడేపల్లి ఇంటికి పరిమితం కావడం దురదృష్టకరం. ముఖ్యమంత్రిగా జగన్మోహన రెడ్డి ప్రజావేదికను కూలగొట్టి ప్రజలకు దూరమైతే, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెను కూల్చి రేవంత్ రెడ్డి ప్రజలకు ఆపన్న హస్తం అందించి సుపరిపాలనకు బీజం వేశారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.

కాలం కలసి రానప్పుడు, ప్రజలలో విశ్వసనీయత కోల్పోయినప్పుడు అంతకు మునుపు బలం అనుకున్న పథకాలు, విధానాలు చేటుగా మారతాయి. పాలనా పరంగా అభివృద్ధిని కొనసాగించినా అంతులేని అహంకారం, పెచ్చుమీరిన అవినీతి, మితిమీరిన కుటుంబ పాలన వల్ల చేసిన అభివృద్ధి మరుగుపడి తెలంగాణ రాష్ట్ర సాధకునిగా ప్రజల మన్ననలు పొందిన కెసిఆర్ పదవి కోల్పోగా, అదే విధానాలు పాటిస్తూ అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని జగన్మోహన రెడ్డి భవిష్యత్తు రాజకీయ యవనికపై స్పష్టంగా కనపడుతోంది.

– లింగమనేని శివరామ ప్రసాద్
7981320543

Leave a Reply