– కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. వైసీపీ ఎంపీల చేతకానితనంతోనే ఏపీకి మొండిచేయి మిగిలింది. కేసుల మాఫీకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టడం దుర్మార్గం. 22 మంది లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులుండి రాష్ట్రానికి సాధించిందేంటి.? స్వప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ 5 కోట్ల ప్రజల ప్రయోజనాలపై లేదు. వైసీపీ వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ఇసుక రవ్వంత కూడా లాభం లేదని మరో సారి కేంద్ర బడ్జెట్ ద్వారా స్పష్టమైంది.
రాజధానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం, పోలవరానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు లేకపోవడం, మెట్రోరైల్ ఊసే లేకుండా బడ్జెట్ రూపొందించడం బాధాకరం. పోలవరం అంచనాలను కేంద్రం ఆమోదించకపోవడం వైసీపీ చేతకానితనమే నిదర్శనం. కేంద్రానికి భయపడి అక్రమాస్తుల కేసులు, బాబాయ్ హత్య కేసులో నిందితులు బయటపడతారనే వైసీపీ ప్రశ్నించడం మానుకుంది.
రాష్ట్రానికి ఏ నిధులు, ఏయే ప్రాజెక్టులు అవసరమన్నదానిపై పార్లమెంట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి తన ఎంపీలతో సమావేశం నిర్వహించి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై దిశానిర్ధేశం చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి ఇంట్లో నిద్రపోవడం తప్ప చేసిందేమీ లేదు. కనీసం వైసీపీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు.
గృహనిర్మాణాలపై వైసీపీ వహించిన నిర్లక్ష్యం వల్ల ఏపీకి కేటాయించే ఇళ్ల సంఖ్య తగ్గింది. ఏడాదికి ఐదు లక్షల ఇళ్లు కడతామని మూడేళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టారు. ఉత్తరాధి రాష్ట్రాలు గోధుమకు మద్ధతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే రాష్ట్రంలో మాత్రం వరికి మద్ధతు ధర ఇవ్వడం చేతకాక వరి పండించవద్దని చెప్తున్నారు. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఫైబర్ నెట్ ను వైసీపీ నేతలు విమర్శించి నిర్వీర్యం చేశారు.
కానీ టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఫైబర్ నెట్ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్రం ఇంటర్ నెట్ ను 2025 నాటికల్లా ఇంటింటికీ ఇస్తామని ప్రకటించింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రూ.149లు ఉన్న ఫైబర్ ఛార్జీలను రూ.350లు చేసి పేదలను దోచుకుంటున్నారు.