– క్వార్ట్జ్ మైనింగ్ కాసులు కొల్లగొడుతున్న మైనాసురులు
– సోమిరెడ్డిపై హిజ్రాల దాడికి ఉసిగొల్పిన వైసీపీ నేతలు
– ఖరీదైన బస్సుల్లో వచ్చి సోమిరెడ్డి శిబిరంపై దాడి
– ఇప్పటిదాకా మైనింగ్ అక్రమార్కులపై చర్య తీసుకోని అధికారులు
– ఏపీలో మారుతున్న రాజకీయాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగునాట రాజకీయాలకు అర్ధం మారిపోతోంది. ఇప్పటిదాకా ఫ్యాక్షన్ రాజకీయాలు చూశాం. హత్యా రాజకీయాలు చూశాం. రౌడీ రాజకీయాలు చూశాం. శిఖండి రాజకీయాలు చూశాం. ధృత రాష్ట్ర రాజకీయాలు చూశాం. వారసత్వ రాజకీయాలు చూశాం. కానీ హిజ్రా రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. వినలేదు. కానీ ఏపీలో ఇప్పుడు అలాంటి అచ్చమైన ‘హిజ్రా రాజకీయాలూ కాలుపెట్టాయి. ఇలాంటి చిత్ర విచిత్ర- ఏహ్య రాజకీయాలకు తెరలేపిన అధికార వైసీపీ అందరి విమర్శలకు గురవుతోంది.
అది నెల్లూరు జిల్లా వడ్లపూడి గ్రామం. రుస్తుం, భారత్ మైకా మైన్ ప్రాంతం. అక్కడ క్వార్ట్జ్ మైనింగ్ అర్ధరాత్రివేళ యధేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. దానిపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోరాటానికి శ్రీకారం చుట్టారు.
నిజానికి రోజుకు 4 కోట్ల రూపాయలు తవ్వుకున్న 21 రోజులు.. నిరాటంకంగా జరుగుతున్న అక్రమ తవ్వకాలపై కోర్టు కూడా కన్నెర్ర చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈనెల 7 కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా ఇప్పటిదాకా మైనింగ్ అధికారులు స్పందించలేదు.
అధికారుల ధృతరాష్ట్ర వైఖరిపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, మైనింగ్ ప్రాంతంలోనే నిరాహారదీక్షకు దిగారు. ఆయన దీక్షకు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అర్థరాత్రి అక్కడే అరుగుమీద పడుకుని, దీక్ష కొనసాగించారు. ఇదంతా మీడియాలో ప్రముఖంగా వెలుగుచూశాయి. పొదల మాటున దాచిపెట్టిన పొక్లైనర్లు, బుల్డోజర్లను సోమిరెడ్డి మీడియాకు చూపారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడమే వింత.
అయినా తన దీక్ష కొనసాగిస్తున్న సోమిరెడ్డికి మద్దతు వెల్లువెత్తింది. సర్కారు ఇరకాటంలో పడింది. ఈలోగా ఖరీదైన బస్సులో 80 మంది హిజ్రాలు దీక్షా శిబిరంలోకి దిగబడ్డారు. తాము మైనింగ్కు దిష్టితీద్దామని వచ్చామని సదరు హిజ్రాలు సెలవిచ్చారు. ఆ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఒకవైపు.. హిజ్రాలు ఒకవైపు మోహరించిన వైనం
సంచలనం సృష్టించింది. సినిమాలో మాదిరిగా చివరలో రంగప్రవేశం చేసిన పోలీసులు… అక్కడి నుంచి హిజ్రాల నుంచి వెళ్లగొట్టకుండా, మైనింగ్ అక్రమాలకు నిరసనగా ధర్నా చేస్తున్న సోమిరెడ్డిని అరెస్టు చేయడమే ఆశ్చర్యం. ఇప్పటిదాకా మైనింగ్ అధికారులు కొరడా ఝళిపించకపోవడం బట్టి.. మైనింగ్ అధికారులు ఎంత ‘చిత్తశుద్ధి’తో విధులు నిర్వహిస్తున్నారో సుస్పష్టం. ఒక మైనింగ్ సంస్థపై మక్కువతో హిజ్రాలు ఖరీదైన ప్రైవేటు బస్సు వేసుకునివచ్చారంటే.. వారి వెనుక ఎవరున్నారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులపై.. హిజ్రాలను ప్రయోగించిన వైసీపీ నేతల ఆలోచనే వికృతంగా కనిపిస్తోంది. హిజ్రాలను ప్రయోగించడం ద్వారా, రాజకీయ ప్రత్యర్ధిని మానసికంగా.. సమాజంలో తలెత్తుకోలేకుండా చేయాలన్న వక్రబుద్ధి ఏహ్యం కలిగించకమానదు. అసలు ఇలాంటి ఆలోచన రావడమే నేతల లేకి – అల్పబుద్ధికి నిదర్శనం.
రేపటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ నేతలంతా.. తమను విమర్శించే వారిపై హిజ్రాలను ప్రయోగిస్తే, ఇక హిజ్రాలకు డిమాండ్ పెరిగి, రోడ్లపై బిచ్చమెత్తుకునే సాధారణ హిజ్రాలకూ గిరాకీ పెరగడం ఖాయం. సంపాదన బాగుందనేవారు లింగమార్పిడి చేసుకుని, హిజ్రాల అవతారమెత్తి రాజకీయనేత చేతిలో ఆయుధాలుగా మారడం కూడా అంతే ఖాయం.
సోమిరెడ్డి దీక్షపై హిజ్రాలను ప్రయోగించిన వైసీపీ చిల్లరబుద్ధిని, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తనదైన శైలిలో
తూర్పారపట్టారు. తనదైన నెల్లూరు యాసలో.. వైసీపీ హిజ్రా రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదేం హిజ్రా రాజకీయమని నిప్పులు కురిపించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.