Home » ఇదెక్కడి న్యాయం?

ఇదెక్కడి న్యాయం?

( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రపంచం మొతాన్ని నిశ్చేష్టులను చేసిన ఒక దౌర్జన్యం.. ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కిన ఒక దారుణ దృశ్యం చూసి యావత్ దేశమే ఖంగుతింది. పరాయి రాష్ట్రాల పత్రికలు-మీడియా ఆ అరాచకంపై పుంఖానుపుంఖాలుగా ఏకిపారేశాయి. అసలు ప్రజాస్వామ్యవాదుల నోట మాట లేదు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి అనుచరులతో దౌర్జన్యంగా దూసుకువెళ్లి, ఈవీఎంను నేలకేసికొట్టిన దౌర్జన్యాన్ని దర్శించి, యావత్ ప్రపంచమే విస్తుపోయింది.

అంత గూండాయిజానికి తెగబడ్డ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, పోలీసులు గృహనిర్బంధంలో ఉంచిన తర్వాత కూడా పరారవడం, పోలీసు వ్యవస్థను- అసమర్ధతను-నిజాయితీని వెక్కిరించడమే. ‘ఇది సిగ్గుమాలిన తనమ’ని స్వయంగా సీఈసీనే వ్యాఖ్యానించిందంటే, నేర తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.

ఈవీఎం పగులకొట్టి, రాష్ట్రం దాటి పరారైన పిన్నెల్లి, ఆయన సోదరులు.. ఇప్పటికీ ముసుగులు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు.

కానీ అటు పల్నాడులో వైసీపీ శ్రేణులు, ఆయనను విచిత్రంగా ఇప్పటికీ పులిగా పొగుడుతుంటారు. అరెస్టుకు భయపడి పరాయి రాష్ట్రానికి పరారయిన వ్యక్తి, పులి ఎలా అవుతాడు స్వామీ? పిల్లి కదా? సరే.. పిన్నెల్లి పులా? పిల్లినా అన్నది కాదు చర్చ! అంత ఘనకార్యం చేసిన వ్యక్తికి, హైకోర్టు బెయిల్ ఇవ్వడంపైనే ఇప్పుడు సామాజికమాథ్యమాల్లో జరుగుతున్న ‘న్యాయ’మైనచర్చ.

అసలు ఈ దేశంలో న్యాయం ఉందా?.. ఇదెక్కడి న్యాయం?.. అంటే ఈవీఎం పగుల కొట్టిన వారిని వెంటనే అరెస్టు చేయకూడదా? మరి పోలింగ్ సమీపంలో గుమిగూడిన వారిపై పోలీసులు ఉత్తిపుణ్యానికి లాఠీ చార్జీ ఎందుకు చేస్తున్నట్లు? ఎన్నికల్లో రెండు వర్గాల ఘర్షణ సందర్భంలో, ఇరు పార్టీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేస్తున్నట్లు?

ఇదే తీర్పును పక్క రాష్ట్రంలోని ఏ అభ్యర్ధి అయినా స్ఫూర్తిగా తీసుకుని.. ఫలానా ఏపీలో ఇలా చేస్తే అక్కడ హైకోర్టు బెయిల్ ఇచ్చి కౌంటింగ్ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ వెసులుబాటు ఇచ్చింది కదా? అని ఆయన క్రిమినల్ లాయర్ ఉదహరించరని గ్యారంటీ ఏమిటి? ఒక హత్య చేసిన వాడి ఇంట్లో పెళ్లి ఉంటే, ఆ పెళ్లి అయ్యేంత వరకూ అతగాడిని అరెస్టు చేయవద్దని చెప్పడం న్యాయమేనా? ఇదీ ఇప్పుడు బుద్ధిజీవుల మధ్య ‘న్యాయం’గా జరుగుతున్న చర్చ!

కొద్దిరోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దానిపై స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌ను ప్రత్యేకంగా చూసింది. ఇది సాధారణ తీర్పులా లేదు. అసాధారణ తీర్పు అన్నది కేవలం నా ఉద్దేశం మాత్రమే కాదు. అందరూ ఇలాగే భావిస్తున్నారని’’ వ్యాఖ్యానించారు.

అయితే అమిత్‌షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఏమీ ఆగ్రహించలే దు. వచ్చి బోనెక్కమని ఆదేశించలేదు. మా తీర్పుపై వ్యాఖ్యానించే స్వేచ్ఛ వారికి ఉంది. వాటిని స్వాగతిస్తున్నాం‘‘ అని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈవీఎంను పగులకొట్టిన ఎమ్మెల్యేకి బెయిల్ ఇచ్చిన వైనంపైనా.. సరిగ్గా తెలుగునాట బుద్ధిజీవుల్లో అలాంటి చర్చ-విశ్లేషణలే జరుగుతుండటం విశేషం.

ఈవిఎంను ధ్వంసం చేసిన పారిపోయిన ఎమ్మెల్యేపై, రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది సీఈసీనే. దాని ఆదేశాల మేరకే డీజీపీ ప్రత్యేక బృందాలను హైదరాబాద్‌కు పంపించారు. ఎమ్మెల్యేను పట్టుకునే పనిలో ఉండగనే, పిన్నెల్లి హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం సాధారణ ప్రజలను విస్మయపరిచింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై అమిత్‌షా అన్నట్లుగానే.. పిన్నెల్లికి బెయిల్ ఇవ్వడం అసాధారణమని, ఒక్కరే కాదు. అందరూ అభిప్రాయపడుతున్నారు!

అసలు హైకోర్టు.. ముందు ఎమ్మల్యేను పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశిస్తుందని, న్యాయవ్యవస్థను నమ్మే విశ్వాసులంతా ఆశించారు. కానీ అందుకు భిన్నంగా జూన్ 6 వరకూ అరెస్టు చేయవద్దని, ఆదేశించడం విస్మయపరిచింది. నిజానికి పిన్నెల్లిని అరెస్టు చేయాలని సీఈసీ, ఏపీ సీఈఓను ఆదేశించారు. ఆమేరకు ఆయన డీజీపీని పురమాయించారు.

ఇటీవల ఒక కేసు సందర్భంలో.. సీఈసీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఇదే హైకోర్టు జడ్జిగారు స్పష్టం చేసిన వైనాన్ని విస్మరించలేం. మరిప్పుడు సీఈసీ ఆదేశాలకు విలువ లేదా? రేపు ఇలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ.. డీజీపీని ఏదైనా ఆదేశిస్తే, ఆయన ఎన్నికల సంఘాన్ని గౌరవిస్తారా? ఎలాగూ హైకోర్టు బెయిల్ ఇస్తుంది కాబట్టి, మనకెందుకులేనని నిమ్మకునీరెత్తినట్లు ఉంటారా? అన్నది.. ఇప్పుడు న్యాయవ్యవస్థను గౌరవించే జీవుల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ.

అదొక్కటే కాదు. పిన్నెల్లికి బెయిల్ నేపథ్యంలో ఇంకా అనేక చిత్రవిచిత్రమై సందేహాలు తెరపైకొస్తున్నాయి. రేపు కౌంటింగ్‌రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే లోపలికి వచ్చి, తనకు అనుకూలంగా లేని గ్రామాల ఈవీఎంలను నేలకేసి కొట్టి తగులబెట్టారనుకుందాం. అప్పుడు గౌరవనీయ ఎమ్మెల్యేను పోలీసు అక్కడికక్కడే అరెస్టు చేయాలా? లేక 6 వతేదీ వరకూ వేచిచూడాలా? అన్నది తీర్పు వచ్చిన తర్వాత ఎవరికైనా వచ్చే సందేహం! నిజమే కదా? ఎలాగూ ఒక ఎమ్మెల్యేకు అలాంటికేసులోనే, 6వ తేదీ వరకూ అరెస్టు చేయకుండా వెసులుబాటు ఇచ్చింది కాబట్టి.. మిగిలిన వారు ఎవరైనా ఆయనను అనుసరించినా, వారికి సైతం 6వ తేదీ వరకూ వెసులుబాటు ఉన్నట్లే లెక్క కదా? ప్రజాస్వామ్యవిలువలపై ఏమాత్రం విలువలేని అదే పిన్నెల్లి మళ్లీ కౌంటింగ్ సెంటర్‌లోకి వచ్చి విధ్వంసం సృష్టించరని ఏ వ్యవస్థ గ్యారంటీ ఇస్తుంది? అన్నది ‘దర్మరాజు’ల మధ్య ‘న్యాయై’మెనచర్చ.

అసలు అధికారులు-పోలీసుల సమక్షంలోనే ఈవీఎంను పగలకొట్టిన పిన్నెల్లి.. సాక్షులను ప్రభావితం చేయవదన్న తీర్పుపైనా చర్చ జరుగుతోంది. అంతమంది ఉన్నా ఎవరినీ లెక్కచేయని పిన్నెల్లి, బెయిల్‌పై బయట ఉంటే ఇక పరిస్థితి ఏమిటో గ్రహించడానికి మేధావి కానవసరం లేదు. ఢిల్లీ మంత్రి సిసోడియా బయటకు వస్తే, సాక్షులను ప్రభావితం చేస్తారన్న ముందుచూపుతోనే సుప్రీంకోర్టు ఇప్పటిదాకా ఆయనకు బెయిల్ ఇవ్వలేదు.

సిసోడియా-పిన్నెల్లి కేసులు వేరేయినప్పటికీ… సాక్షులను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉండటాన్ని విస్మరించకూడదు. అసలు పిన్నెల్లి బయట ఉండగనే, జనాలను బెదిరించిన వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బెయిల్‌పై వస్తే ఎవరినీ ప్రభావితం చేయవద్దంటే, వినటానికి పిన్నెల్లి ఎల్‌కేజీ విద్యార్ధి కాదు. ఈవీఎంను బండకేసికొట్టి, అడ్డొచ్చిన మహిళను బండబూతులు తిట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యే! అన్నది న్యాయవ్యవస్థను నమ్మే, పెద్దమనుషుల మధ్య జరుగుతున్న చర్చ!

ఎలాగూ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కేసుకు సంబంధించి.. మా తీర్పులపై వ్యాఖ్యలను స్వాగతిస్తాం అని అంతపెద్ద సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పారు. కాబట్టి అమిత్‌షా లెవల్లో అందరూ, పిన్నెల్లి బెయిల్ కేసును సోషల్‌మీడియాలో చర్చిస్తున్నారన్నమాట. మంచిదే

Leave a Reply