ఎక్కడుంది గురజాడ అడుగుజాడ..?

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్..
ఎప్పుడు చెప్పాడో
ఆ పెద్దమనిషి..
ఇప్పటికీ
అర్థం కావడం లేదెవరికీ..
జయంతి..వర్ధంతి..
ఈ రెండు రోజులూ
ఆయన వెల్లేవేసిన మాటలు
బట్టీపెట్టి ప్రసంగాలు..
కుళ్లిపోయిన మర్మాంగాలు..
నమ్మిన జనాలను ముంచెయ్యడమే వ్యాసంగాలు
ఈ దగాకోరు సంఘాలు!

ఎంత రాసాడు పెద్దాయన..
సమాజంపై కసితో కాదు..
గుండె నిండిన ఆవేదనతో..
మారండన్న నివేదనతో
అప్పటికే పట్టిపీడిస్తున్న కన్యాశుల్కం మాత్రమేనా
ఎప్పటికీ వెంటాడి వేధించే
ఎన్నో అంశాలు..
గురజాడ కథాంశాలు..
ఆయన గుండెల్ని
పిండి చేసిన
వ్యధాంశాలు..!!

ఎన్నో సాంఘిక దురాచారాలు
ఇంకెన్నో భావజాడ్యాలు..
వీటిపై గురిపెట్టిన
అప్పారావు కలం..
దానికి నప్పనే నప్పదు కులం
ఆ కులం పేరిట విబేధాలు వద్దని ఆయనంటే
అవే ముద్దని మనమంటూ..
ఆయన పేరిట జరిగే ఫంక్షన్లకు ఆదర్శం
ముసుగేసుకుని హాజరు..
రూపుమాపేద్దామంటూ
మహాజరు!
ఇన్ని దొంగ మాటలు
చెప్పే వీరు
మూలస్తంభాలా..
వయోముఖ విషకుంభాలా!!

అంతెందుకు..
గురజాడ అడుగుజాడని
దేశమెల్ల ఘనముగా చెప్పుకొనగా ఆ జాడలున్న
విద్యలనగరంలోనే
ఆయన కీర్తి శిఖరాలను కూల్చి మేడలు కట్టే
నేతలు పుట్టి ఉన్నారే..
రచనలతో ప్రపంచాన్నే జయించగలిగిన అప్పారావయ్యా..
ఇంట గెలవాలనే పరీక్ష తప్పావయ్యా..
నీ గిరీశాన్నే గిరగిరా తిప్పేసి
బిరబిరా లాక్కెళ్లి పెద్దచెరువులో
కలిపేసే స్వాహాస్వాములు..
పొరుగువాడికి సాయపడక సొంత లాభం
పూర్తిగా చూసుకునే
బడాబాబుల ఏలుబడి..
నీ ఆదర్శం వెనక
ఏముంది రాబడి..!?

నువ్వు సాహితీ మేరువే..
మహారచనల సెలయేరువే..
నీ రచనలు..వచనలు..
ఆలోచనలు..ఎప్పటికీ కొత్తవే
కాని..వాటికి బూజు పట్టించే
మోసకారి మహారాజులు..
అవినీతి సామ్రాట్టులు..
ఏడాదిలో రెండంటే రెండుసార్లు
నీ ఫోటో ముందు
గంటలో ఆరిపోయే దీపం
సాయంత్రానికి
వాడిపోయే దండ..
ఓ దొంగ దండం..
నీ హితోక్తులకు మాత్రం
దినదిన గండం..
ఆర్పేస్తూ నీ సంస్కరణల అగ్నిగుండం..!
నీ ఇంటికొచ్చి ఇచ్చే నివాళి
ఆ రోజున వారికో
చిన్న వ్యాహ్యాళి..
అదే రోజున
కాసేపట్లో మొదలయ్యే
కులమతాల..దురాచారాల
రాక్షసకేళి..!!

గురజాడకు క్షమాపణలతో

– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply