Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు?

– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 

హైదరాబాద్: రేవంత్ రెడ్డి తెలంగాణను కల్లోలంలోకి నెడుతున్నారని, తనను డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్రలు జరుగుతున్నాయంటూ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనను ట్రాప్ చేయాలని కుట్ర పన్నారని, డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు డీఎస్పీలు, సీఐలు, కానిస్టేబుల్స్ వచ్చి తన కారులో డ్రగ్స్ పెట్టి కేసు నమోదు చేయాలని ప్రయత్నించారని చెప్పారు.

“రాజ్ పాకాల ఇంట్లో కూడా ఇదే తరహా కుట్ర జరిగింది. కేటీఆర్ అక్కడికి రాగానే డ్రగ్స్ పెట్టి ఆయనను ఇరికించాలన్న ప్రణాళిక రూపొందించారు,” అని కౌశిక్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ ప్యాకెట్లు తన కారులో పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, ఇంటిలిజెన్స్ టీం తన ఇంటి చుట్టూ నిఘా వేసిందని అన్నారు. “బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారు; కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని సవాల్ చేస్తున్నాము,” అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో రేవ్ పార్టీలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తూ, షబ్బీర్ అలీ చేసే రేవ్ పార్టీలు అందరికీ తెలిసిన విషయమని తెలిపారు. “రేవంత్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే, బ్లీహిల్స్, దుబాయిలో ఆయన చేసిన పనులు బయటపెడతా,” అని హెచ్చరించారు.

పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ మార్ఫింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. “మీరు డ్రగ్స్ టెస్ట్‌కు రాకపోతే, డ్రగ్స్ తీసుకుంటున్నట్లు భావిస్తాము,” అని స్పష్టం చేశారు.

కౌశిక్ రెడ్డి తెలంగాణలో దళితబంధు నిలిపివేతను ప్రశ్నించారు. పోలీసు అధికారుల దురుసు ప్రవర్తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ” అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు.. కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించు. రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల నిజమైన ప్రేమ లేదని, ఆయన పరిపాలన ప్రజలకి నష్టం కలిగించేలా ఉందని” పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE