-బాధ్యులపై తక్షణమే హత్యానేరం కేసులు నమోదు చేయాలి
-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంవల్ల బాణాసంచా పేలి నిప్పు రవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు పలువురికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు బీఆర్ఎస్ నేతలకు ఎవరిచ్చారు? మృతుల కుటుంబాలను తక్షణమే అన్ని విధాలా ఆదుకోవాలి. క్షత గాత్రులకు మెరుగైన రీతిలో కార్పొరేట్ వైద్యం అందించాలి. ఆయా కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలి.
బాధ్యులపై తక్షణమే హత్యానేరం కేసులు నమోదు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, లిక్కర్ కేసులతో కేసీఆర్ ప్రభుత్వంపట్ల ప్రజలు విసిగిపోయారు. ప్రజల ద్రుష్టిని దారి మళ్లించేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాలకు తెరదీసినట్లు కన్పిస్తోంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యనున్న అంతర్గత గొడవలను ప్రజలపై రుద్దడం మానుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చర్యలకు వెంటనే స్వస్తి పలకండి. కేసీఆర్ కుటుంబ అవినీతి పుట్టలు బద్దలవుతున్నాయి. వాటినుండి ప్రజల్లో దృష్టి మళ్లించేందుకు తీసుకునే చర్యలేవీ ఫలించవనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. అధికార మదంతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ అమాయక ప్రజలను బలిపశులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరిస్తున్నాం.