– నా పశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా?
– మంత్రి ఉత్తం ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలి
– మంత్రి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
– గణాంకాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్‌రావు
హైదరాబాద్: మీ అబద్దాల ప్రవాహాన్ని ఇకనైనా ఆపరా ఉత్తం కుమార్ రెడ్డి గారు..కాళేశ్వరంపై మీరు చేస్తున్నది దుష్ప్రచారం అని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసినా కూడా, మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారు.
మీలాగా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదు ఉత్తం గారు, పూర్తి ఆధారాలతో సహా ఈరోజు ప్రజెంటేషన్ లో అన్ని వాస్తవాలు వెల్లడించాను.
ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే అని చెబుతున్న మీరు కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు లిఫ్ట్ చేసింది ఎందుకు చెప్పరు?
లక్ష్మి పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజ్, పార్వతి పంప్ హౌజ్, నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోసిన నీళ్ల గురించి ఎందుకు దాస్తారు?
కాళేశ్వరం కట్టిన మూడు ఏళ్లలోనే అంటే, 2022-23 వరకే మేడిగడ్డ నుంచి 162.41 టిఎంసీలు, అన్నారం నుంచి 172.86 టిఎంసీ, సుందిళ్ల నుంచి 172.12 టిఎంసీ, నంది మేడారం పంప్ హౌజ్ నుంచి 181.70 టిఎంసీలు, గాయత్రి పంప్ హౌజ్ నుంచి 179.41 టిఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తి పోసినం. ఇది వాస్తవం. మీకు తెలియకుంటే మీ ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకోండి ఉత్తం గారూ..? ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ ఎందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు?
ఏ ప్రాజెక్టు నిర్మించినా మొదటి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదు అనే విషయం విషయం అందరికి తెలిసిందే.
కాల్వలు తవ్వుతున్నా కొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుంది.
9లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 1963లో ప్రారంభించిన ఎస్సారెస్పీ పనులు 1975 నాటికి పూర్తి కాగా, 11ఏళ్ల తర్వాత మొదటగా వచ్చిన ఆయకట్టు 25వేల ఎకరాలు మాత్రమే.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955 శంకుస్థాపన చేస్తే 1966లో పూర్తి చేసారు. 12 సంవత్సరాల తర్వాత ఎడమ కాల్వ ద్వారా 5లక్షల ఎకరాల లక్షానికి గాను మొదట్లో వచ్చిన ఆయకట్టు 98,842 ఎకరాలు మాత్రమే.
కాంగ్రెస్, తెలుగుదేశంలు కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు 1984లో ప్రారంభమై 2014 నాటికి మీరు ఇచ్చిన ఆయకట్టు 3లక్షల 30వేల ఎకరాలకు గాను మొదట్లో ఇచ్చింది 13వేల ఎకరాలు మాత్రమే.
2001లో మొదలు పెట్టిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా 2014 నాటికి ఆరు లక్షల ఎకరాలకు గాను మీరు ఇచ్చింది 45వేల ఎకరాలు మాత్రమే.
ఏ ప్రాజెక్టు చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది ఉత్తం గారు.
ఏ ప్రాజెక్టులో అయినా హెడ్ వర్క్స్ మొదలు పూర్తి చేసి టెయిల్ వర్క్స్ తర్వాత పూర్తి చేస్తుంటారు.
కానీ మీరు మాత్రం కమిషన్ల కోసం తోక పనులు మొదలు పెట్టి, హెడ్ వర్క్స్ వదిలి పెట్టారు. ఆ ఘనత మీ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది.
ఇకకైనా తలా తోక లేని మాటలు మాట్లాడం మానేయాలని, అబద్దాలు ప్రచారం చేయడం విరమించుకోవాలని సూచిస్తున్నాం.