Suryaa.co.in

Telangana

ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చే ఉద్దేశ్యం ఉందా?

– తెలంగాణ రైతులకు భరోసానే లేదు
– రైతు భరోసా పథకం కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదు?
– పెద్దపీటలు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప, రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదు
-ఎండిపోయిన పంటలను చూడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పోవడం లేదు?
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, రైతుల పక్షపాతి అని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని రైతులకు భరోసానే లేదు. రైతులను అధోగతి పాలు చేసి, రైతుల జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేశారు..

గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పంటలకు నీళ్లు లేక, పొట్టదశకు వచ్చిన పంటల గింజలు తాలు అయ్యే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోతున్నాయి. పశువులు మేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సగం పంటలకు నీటి సరఫరా లేదు.

రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100రోజులు గడుస్తున్నా కూడా రైతు భరోసా పథకం కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదు.? రైతు కూలీలలకు రూ.12వేలు లేవు, కవులు రైతులకు రూ.15వేలు జాడ లేదు, పత్తా లేదు. ఇప్పటివరకు కూడా రైతు కూలీలను గుర్తించలేదు. వాళ్లను గుర్తించడానికి కమిటీ కూడా వేయలేదు.

రైతు భరోసా పథకం ఎన్నెకరాల రైతులకు ఇస్తరో కూడా ఎలాంటి ప్రణాళిక లేదు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి కమిటీ లేదు. రెండు, మూడు రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కొత్త జీవోలను విడుదల చేయడానికి వీలు లేదు.

క్వింటాల్ ధాన్యానికి రూ.500బోనస్ ఇస్తామని రైతు భరోసా గ్యారెంటీ కింద చెప్పారు. కనీసం ఇప్పటివరకు కూడా జీవో విడుదల చేయలేదు. నిజంగా రైతులకు బోనస్ ఇవ్వాలని ఉంటే వెంటనే జీవో విడుదల చేయాలి. జీవో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వ్యవసాయ శాఖ అధికారులకు సమయం దొరుకుతలేదా?

కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపీటలు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప, రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదు. వారం రోజులుగా పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోస పడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పటివరకు కూడా వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చే ఉద్దేశ్యం ఉందా అని భారతీయ జనతా పార్టీ తరుఫున అడుతగుతున్నాం.

50లక్షల వరి పంటలకు నీళ్లు ఎట్లా ఇద్దామనే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా.? నీళ్లు ఏ ప్రాజెక్టులో ఎంత శాతం ఉన్నయ్, ఏ ప్రాజెక్టు నుండి ఎంత నీళ్లు వస్తయ్, రాబోయే నెల రోజుల్లో యాసంగి పంట పూర్తయ్యే దాకా నీళ్లిచ్చే పరిస్థితి ఉందా, లేదా? ఎండిపోయిన పంటలకు పరిహారం ఇచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.? పంట నష్ట పోతే నష్ట పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫసల్ బీమా యోజన పథకం’ ప్రవేశ పెట్టింది.

ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే బీజేపీకి, నరేంద్రమోదీ కి పేరు వస్తదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా అడ్డంపడ్డది. చిత్తశుధ్ధి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఫసల్ బీయా యోజనా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులు నష్ట పోకుండా ఉండేవారు. ఎండిపోయిన పంటలకు పరిహారం అందేది. గతంలో నీళ్లు లేని ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ క్రాప్ హాలీడే ప్రకటించేది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విత్తనాల మాఫియా, ఎరువుల మాఫియా జరిగింది. కల్తీ విత్తనాలతో చాలా చోట్ల రైతులు నష్ట పోయారు. కల్తీ విత్తనాలు, ఎరువులను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి ద్వారా ఏడాదికి రూ.6వేలు, ఎకరాకు రూ.18వేల ఎరువుల సబ్సీడీ అందిస్తుంది. పసుపు బోర్డును ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని రైతులకు మద్దతు ధర లభిస్తుంది.

రైతులు ఎక్కడ పోతే మాకేంది, కుర్చీల పంచాయతే తప్ప, వేరే పంచాయతీ లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదు. రైతులకు నీళ్లిచ్చే విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు కార్యాచరణ చేయడం లేదు.?

కాళేశ్వరం టూర్లు పోయినట్టు..వ్యవసాయ శాఖ అధికారులతో ఎండిపోయిన పంటలను చూడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పోవడం లేదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని సామెత ఉంది. రైతులను ఏడిపిస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిది కాదు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఇచ్చి, నీళ్లు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి. పంటలకు నీరందించని క్రమంలో రైతుల కోసం భారతీయ జనతా పార్టీ తరుఫున ఉద్యమం చేస్తాం

LEAVE A RESPONSE