ముందు రెండు సామెతలు చెప్పుకుంటే నేను రాసింది పూర్తిగా అర్థం అవుతుంది
సామెత 1
దారికిపోయే కంపని ముడ్డికి తగిలించుకున్నాడట
సామెత 2
పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడట
ఇవి రెండూ వినగానే నేనేదో వంశీ సానుభూతి పరుణ్ణి …”పాపం అరెస్ట్ అయ్యాడు “అని కన్నీళ్లు కురిపించే బ్యాచ్ అని మాత్రం అనుకోకండి. విషయాన్ని విశ్లేషిస్తున్న అంతే
మొదట తెలుసుకోవలసింది ఏంటంటే.. వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం టీడీపీ ఆఫీస్ ను తగలబెట్టించినందుకు కాదు. అసలు ఆ కేసులో అరెస్టుకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసులో వంశీ కి ముందస్తు బెయిల్ ఉంది.
మరి ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు చేశారంటే ? పైన చెప్పగా రెండు సామెతలు అచ్చం అలాగే చేశాడు.
ఎంతటి గోల్డెన్ ఛాన్స్ దొరికిందో వంశీకి!
టీడీపీ అధికారంలోకి రావటం సంగతి పక్కన పెట్టండి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యిందో లేదో.. ఇద్దరు సహోదరులు వంశీ- నాని లెక్కింపు కేంద్రం నుండి జంప్.
అదే రోజు బహుశా మొదటి తిరుగుబాటు వంశీ చవిచూశారు ఒక కార్యకర్త రూపంలో.
దాదాపు కొట్టినంత పనిచేశాడు.
ఇక అక్కడి నుండి గాయబ్ వంశీ ..కంటికి కనిపించలేదు.
ఆంధ్రలో లేడన్నారు , అమెరికా పోయాడన్నారు ..పోవటం కాదు అక్కడే సెటిల్ అయ్యాడని పుకార్లు లేపారు. ఫోన్ స్విచ్ ఆఫ్ , నంబర్ పనిచేయదు.
మీకు గుర్తుండే ఉంటుంది జర్నలిస్ట్ జాఫర్.. వంశీ ఎక్కడ , ఉన్నాడా పోయాడా పారిపోయాడా అంటూ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాడు. మరో పక్క ఈ కేసు కాస్త సీఐడీ కి బదిలీ అయ్యింది.
అజ్ఞాతంలో ఉండి టీడీపీ అధినాయకత్వం తో కాళ్ళ బేరానికి ప్రయత్నాలు అని కూడా అనేక స్టోరీలు ప్రచారంలోకి వచ్చాయి. ఎప్పుడైతే సీఐడీ కి కేసు బదిలీ జరిగిందో అప్పుడే ఒకసారి ఆయన అరెస్ట్ అని ,మరోసారి ఆయన అనుచరులు అరెస్టు అని హడావిడి కూడా నడిచింది.
ఇన్ని ప్రతికూలతలు ఉన్నా వంశీ తెలివిగా న్యాయస్థానం తలుపు తట్టాడు. నేను వీరుణ్ణి , సూరుణ్ణి అనకుండా తెలివిగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చెయ్యటం మొదలు పెట్టాడు. ఫైనల్ గా సుప్రీమ్ నుండి ముందస్తు బెయిల్ కూడా పొందాడు.
అది కూడా ఏమీ సింపుల్ గా దొరకలేదు. కింద కోర్టుల్లో తిరస్కారాలు ఎదురయ్యాకా,
ఎప్పటికో సాధించాడు. అప్పుడు గానీ వంశీ బహ్యాప్రపంచంలోకి రాలేదు. కార్యకర్తలకు మొహం చూపించలేదు. అసలు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు.
ఇక్కడ గమనించాల్సి ప్రభుత్వం ఎన్ని అవకాశాలు దొరికినా ఎందుకు అరెస్టు చేయలేదు అనేది!
ఖచ్చితంగా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
బహుశా కక్షసాధింపు అనే ముద్ర పడుతుంది అని భయం కావచ్చు, లేదా చట్టప్రకారం గట్టిగా లాక్ చేద్దాం అని కావచ్చు, అల్లాటప్పాగా కాకుండా గట్టిగా కొట్టాలి దెబ్బ అని కావచ్చు.
చెప్పుకుంటూ పోతే ఇలాంటి కావచ్చు.. కావచ్చు అనే కారణాలు బోలెడు రావొచ్చు.
అయితే కథ ఇలా నడిస్తే ,సాఫీగా సాగితే కిక్కేముంది అని అనుకున్నాడో …టైం బ్యాడ్ అయ్యింది బుద్ధి వక్రించిందో తెలియదు కానీ..
ఒక దిక్కుమాలిన ఐడియా వేసాడు.
అసలు కేసే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది?
దానికోసం ఎంతకైనా తెలిగిస్తే ఎలా ఉంటుంది?
అందుకోసం ఎలాంటి క్రిమినల్ ఐడియా అయినా సరే వేస్తే ఎలా ఉంటుంది?
అవసరం అయితే కొద్దో గొప్పో పాపం చేస్తే ఎలా ఉంటుంది?
ఇలా ఆలోచించటం మొదలెట్టాడు.
ఈ క్రమంలో అన్ని అంచల్లో సక్సెస్ అయ్యాడు.
ఎంతటి సక్సెస్ అంటే.. టీడీపీ కి షాక్ తగిలింది.. షాక్ ఇచ్చాడు అనే పదాలు ఉపయోగించినా, ఆ భావాన్ని వర్ణించటానికి వాటి స్థాయి సరిపోదేమో అనిపిస్తుంది.
దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది టీడీపీ కి. అవమాన భారంతో తలవంచక తప్పని పరిస్థితి
ఎంతటి మాస్టర్ ప్లాన్ ఇది?
తమ పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగి.
అందునా ఆ ఘటనలో ప్రత్యక్షంగా ఉన్న బాధితుడు, ఆ కేసుకు ఫిర్యాదు దారుడు.
అసలా సంఘటనతో నాకు సంబంధం లేదు.
అసలా కేసుతోనే సంబంధం లేదని కోర్టుకు ఎక్కి అఫిడవిట్ ఇవ్వటం అంటే ఇది ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం.
ఆ కార్యకర్తలకు తీరని తలవంపు.
ఇక అధినాయకత్వానికి ఎంతటి విషమ స్థితో,
ఎంతటి అవామానమో వర్ణించటానికి మాటలు చాలవు!
మాస్టర్ స్ట్రోక్ లాంటి ఈ ఘటనతో గెలిచాం అని.. వంశీ ఫాం హౌస్ పార్టీలు కూడా చేసున్నాడట.
కసితో రగులుతున్నాం అని ఇవతలి పక్షం గమ్మున ఉండకుండా వ్యూహం రచించింది.
దారులు వెతికింది.
మరిప్పుడు ఏం జరుగుతుంది సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.
సరిగ్గా అప్పుడే అరెస్ట్ అరెస్ట్ అంటూ బ్రేకింగ్..
ఎందుకు అరెస్ట్ అంటే వచ్చిన సమాధానం వింటే నోరెళ్ళబెట్టటం మనవంతు అయ్యింది.
ముందస్తు బెయిల్ తో సంతృప్తి పడక… కేసే లేకుండా కప్పెట్టేదాం అనుకొని వంశీ తీసిన గోతిలో ఇప్పుడు తానే పడిపోయాడు.
ఫిర్యాదు చేసిన వాడే నాకు ఈ కేసుతో సంబంధం లేదని ఎదురుతిరిగితే తాను బయటపడతా అనుకున్నాడు. కానీ..
అలా ఎదురుతిప్పటం కోసం ఏకంగా కిడ్నాప్ చేస్తే , చంపేస్తా అని బెదిరిస్తే , అంతం చేస్తా అని అణిచివేస్తే ఎప్పటికైనా ప్రమాదమే తప్ప, ప్రమోదం కాదు అన్న సంగతి మరచిపోయాడు.
అవమాన భారంతో రగిలిపోతున్న టీడీపీ కి ఆలోచన వచ్చింది. ఇలా ఎలా జరిగిందో తెలుసుకోవాలన్న పంతం పెరిగింది.
అది పెద్ద కష్టం కూడా కాదు. అధికారం ఉన్నది వాళ్ళ చేతిలోనే కదా?
తీగ లాగారు డొంక కదలం కాదు దద్దరిల్లిపోయింది.
ఫిర్యాదు దారుడి కిడ్నాప్ దగ్గర నుండి
బెదిరించిన తీరు దగ్గర నుండి
ఏం చెప్పి బెదిరించారు?
ఎక్కడ దాచారు?
ఎంత ఇచ్చారు?
అప్పుడు వంశీ ఎక్కడ ఉన్నాడు?
ఈ సంతోషం లో వంశీ ఎక్కడ ఎవరితో పార్టీ చేసుకున్నాడు అన్నీ అన్నీ బయటపడ్డాయి.
ఇక క్షణం ఆలస్యం చెయ్యలేదు ప్రభుత్వం.
రగిలే కసితో రంకెలు వేస్తూ వెళ్లి వంశీని దొరకబుచ్చుకున్నారు.
హైదరాబాద్ నుండి విజయవాడ తెచ్చారు.
కొసమెరుపు ఏమిటీ అంటే.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన 31 మంది వైసీపీ నాయకులకు బెయిల్ రిజక్ట్ చేసింది కోర్టు. అది కూడా ఈరోజే వచ్చింది తీర్పు.
ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఆధారంగా చూపి, రేపు ముందస్తు బెయిల్ రద్దు దిశగా కూడా పోలీసులు ముందడుగు వెయ్యబోతున్నారట.
నేను స్టార్టింగ్ లో రెండు సామెతలు చెప్పా అవి ఎందుకో ఇప్పుడు అర్దం అయ్యిందా?
కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉండే అవకాశం కాలదన్నుకుని, ఇప్పుడు కటకటాలపాలు కాబోతున్నాడు వంశీ.
– కిషోర్ కుమార్
(జర్నలిస్ట్)