– కర్నాటక ఫలితాలతో తెలంగాణలో ‘కమల వికాసం’.. కష్టమేనా?
– బీఆర్‌ఎస్-బీజేపీ దోస్తీ ప్రచారమే కమలం కొంప ముంచుతోందా?
– కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో తెలంగాణలో బీజేపీ డీలా
– జనతాదళ్‌కు కేసీఆర్ ప్రోత్సాహం వెనుక బీజేపీ వ్యూహం ఉందన్న అనుమానాలు
– అమిత్‌షా ఆదేశించినా చతికిలపడ్డ చేరికలు
– బీజేపీపై నమ్మకం లేకనే చేరికలు నిలిచిపోయాయా?
– ప్రముఖులకు బ్రేకులు వేస్తున్న బీజేపీ-బీఆర్‌ఎస్ తెరచాటు బంధం?
– బీఆర్‌ఎస్-బీజేపీ ఒక్కటేనన్న ప్రచారానికి తెరదించని బీజేపీ
– కవితను అరెస్టు చేయకపోవడమే ఆ అనుమానాలకు అసలు కారణమా?
– అసలు సంగతి బయట పెట్టిన కొండా విశ్వేశ్వరరెడ్డి
– కొత్తవారిని పట్టించుకోకపోవడమూ మరో కారణమా?
– కుల సమీకరణలలో కమలం చేతులెత్తేసిందా?
– సెటిలర్లను ఆకర్షించడంలో బీజేపీ ఫెయిలయిందా?
– ఆ ప్రణాళిక ప్రారంభిస్తున్నామన్న కిషన్‌రెడ్డి
– సెటిలర్లు తాము వ్యతిరేకించిన కారులో ఎందుకు ఎక్కుతున్నారు?
-బండి సంజయ్ స్పీడుతో బీజేపీకి భరోసా
– కానీ సంజయ్ టీమ్ లీడర్‌గా సక్సెస్ కాలేకపోతున్నారా?
– సంజయ్‌కు సీనియర్ల సహకారం లేదా?
– బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌తో నియోజకవర్గాల్లో పోటీ పడే మొనగాళ్లేరీ?
– కొండా చెప్పిన కథ ‘కమల సత్యమే’నా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో గద్దెనెక్కేందుకు పెద్ద సమయం లేదంటూ హడావిడి చేస్తున్న కమలదళాల మాటలు నమ్మశక్యమేనా? కొత్తవారిని చేర్చుకునే ప్రక్రియను వాయువేగంతో చేయమని అమిత్‌షా ఆదేశించినా, చేరికలు ఎందుకు చతికిలపడుతున్నాయి? ఇతర పార్టీ నేతలు బీజేపీలో ఎందుకు చేరడ ం లేదు? పైకి యుద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. బీజేపీ-బీఆర్‌ఎస్ ‘తమలపాకు యుద్ధం’ చేసుకుంటున్నాయన్న అనుమానమే, చేరికల బ్రేకుకు అసలు కారణమా?
నిజంగా యుద్ధం చేసుకుంటే.. కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదన్న సందేహాలే, కొత్త వారు ‘కమలవనం’లో చేరకపోవడానికి ప్రధాన కారణమా? ఇప్పటికే పార్టీలో చేరిన వారికి కనీస గౌరవం దక్కడం లేదన్న బాధితుల ఆవేదనే.. ఔత్సాహికులు ఆగిపోవడానికి అసలు కారణమా? ఈ విషయంలో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బద్దలు కొట్టిన కుండ ప్రభావం ఎంత? దీన్నిబట్టి.. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలవుతాయా? అదే ఆయన వ్యాఖ్యల అసలు ఆంతర్యం- సంకేతమా?
అధికారంలోకి వచ్చేస్తామంటున్న బీజేపీలో.. అసలు బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ను నియోజకవర్గ స్థాయిలో ఎదుర్కొనే మొనగాళ్ల సంఖ్య ఎంత న్నది మరో ప్రశ్న. అసలు కులసమీకరణ లో కమలదళాలకు అనుభవం లేదా? తాము వ్యతిరేకించిన బీఆర్‌ఎస్‌కు సెటిలర్లు జైకొడుతున్నారంటే, కమలం లెక్కలు తప్పిన ట్లేనా? ఇలాగైతే కమల వికాసం బదులు కమల విలాపమే కదా? అసలు తప్పెక్కడ జరుగుతోంది? అన్నది కమలదళాల ఆందోళన. ఇదీ ఇప్పుడు బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్.
‘బీజేపీ-బీఆర్‌ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ. గల్లీలో కుస్తీలు పడుతున్నాయన్న భావన ఉంది. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆమెను అరెస్టు చేయకపోవడంతో, రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోయాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికలు అందుకే నిలిచిపోయాయి’’
-ఇది ఏ మీడియాలోనో, లేదా ఏ కాలమిస్టో రాసిన కథనమనుకుంటే, ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఇవి అచ్చంగా బీజేపీ నేత, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. నిజానికి కొండా వ్యాఖ్యలు అక్షర సత్యాలేనన్నది కమలదళాల ఉవాచ.
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బీజేపీ ప్రముఖులతో మాట-ముచ్చట కూడా అయింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో వారు భేటీ అయ్యారన్నది పార్టీ వర్గాల సమాచారం.
అయితే ఈలోగా కర్నాటక ఎన్నికల ఫలితాల్లో కమలం కమిలి, కాంగ్రెస్ వెలిగిపోయింది. కర్నాటకలో కమలం వికసిస్తే ఆ ప్రభావం తెలంగాణపైనా, తీవ్రంగా ఉంటుందన్నది వారి అంచనా. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే, ఆ ప్రభావం కూడా తెలంగాణ పై ఎక్కువగా ఉంటుందన్నది, వారితో సహా చాలామంది అంచనా. ఫలితాల్లో అదే జరిగింది.
ఈ క్రమంలో కమలతీర్థం తీసుకోవాలనుకున్న నేతల మనసు మారింది. వారిలో పునరాలోచన మొదలయింది. బీజేపీలో చేరితే వచ్చే లాభనష్టాలపై సహజంగానే బేరీజు -విశ్లేషణ ప్రారంభమయింది. ఆ కూడికలు-తీసివేతల రాజకీయాల్లో.. వలస పక్షులు, సహజంగానే రాజకీయంగా కాంగ్రెస్ వైపే మానసికంగా మొగ్గు చూపాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అదే కమలం కొంప మునగడానికి కారణమయింది.
తాము ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్ నాయకత్వ నియంతృత్వ వైఖరిపై పోరాడి, బీజేపీలో చేరితే.. రాజకీయంగా వచ్చే లాభమేమిటన్న ఆత్మపరిశీలన, బీజేపీలో చేరికలు చతికిలపడేందుకు కారణమవుతోంది. పైకి బీజేపీ-బీఆర్‌ఎస్ యుద్ధం చేసుకుంటున్నప్పటికీ.. జాతీయ స్థాయి వ్యూహ రాజకీయాల్లో భాగంగా, రెండు పార్టీలూ కలిసే ఉన్నాయన్న అనుమానం- ప్రచారం, బీజేపీ వైపు వెళ్లకుండా బ్రేకులు వేస్తున్నట్లు వారి వ్యాఖ్యల బట్టి కనిపిస్తోంది.
పైగా కవితను అరెస్టు చేయడం ఖాయమని, కేసీఆర్‌కు జైలుకు పంపిస్తామంటూ బీజేపీ అగ్రనేతలు చేస్తున్న ప్రకటనలన్నీ.. ప్రజల్లో భావోద్వేగం రెచ్చగొట్టడానికే తప్ప, అది ఆచరణ సాధ్యం కాదన్న సత్యం కూడా గ్రహించినట్లు కనిపిస్తోంది. పైగా ఇది తెలంగాణలో రాజకీయ యుద్ధాన్ని బీఆర్‌ఎస్-బీజేపీకి మాత్రమే పరిమితం చేసి, కాంగ్రెస్‌ను రాజకీయంగా భూస్థాపితం చేసే మాటల వ్యూహమన్న విషయం కూడా బీజేపీలో చేరాలనుకునే నేతలకు అర్ధమయినట్లు కనిపిస్తోంది.
కవితను అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పనిచేయకపోవడమే వారి అనుమానాలకు ప్రధాన కారణమన్నది, కొండా విశ్వేశ్వరరెడ్డి మాటల్లో కూడా స్పష్టమయింది. ఢిల్లీలో బీఆర్‌ఎస్-బీజేపీ కలసిపోయి.. గలీల్లో కొట్లాడుకుంటుంటే, తెలంగాణ ప్రజలు బీజేపీని బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎందుకు భావిస్తారని కొండా చెప్పనే చెప్పినట్లయింది.
మొత్తంగా తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు గానీ, కాంగ్రెస్ మాత్రం రాకూడదన్న వ్యూహంతోనే.. బీజేపీ అడుగులు వేస్తోందన్నది, రాజకీయాలను ఫాలో అయ్యే వారికి అర్ధమయ్యే విషయం. కొండా విశ్వేశ్వరరెడ్డి మాటల వెనుక మర్మం కూడా ఇదేనేమో?!
అధికారంలోకి వస్తామంటున్న బీజేపీకి… అసలు రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేసేంత స్థాయి నేతలున్నారా అన్నది ప్రశ్న. ఒకప్పుడు బీజేపీకి పట్టున్న హైదరాబాద్‌లోనే ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో, బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ను ఎదుర్కొని పోటీ ఇచ్చే అభ్యర్ధులు లేరు. ఇక ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరితే తప్ప, అభ్యర్ధులకు దిక్కులేని విషాద పరిస్థితి.
గత ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ నాయకత్వం.. నాటి టీఆర్‌ఎస్ నాయకత్వంతో ఒప్పందానికి వచ్చి, బలహీన అభ్యర్ధులను నిలిపేలా అవగాహనకు వచ్చాయన్న ప్రచారం, బీజేపీ వర్గాల్లో విస్తృత స్థాయిలో జరిగింది. అయితే బీజేపీ దురదృష్టవశాత్తూ.. ఆ ఐదు నియోజకవర్గాల్లోనూ, టీఆర్‌ఎస్ అభ్యర్ధులే విజయం సాధించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలోని ఓ ప్రముఖుడు కూడా, నాటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పార్టీలో జరిగిన విచారణ, ఏమయిందో కూడా తమకు తెలియదన్న వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించాయి. అది వేరే కథ.
రాష్ట్ర స్థాయి నేతలున్న 20-25 మంది తప్ప.. మెజారిటీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు లేరు. కాంగ్రెస్-బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి వస్తే తప్ప, సొంత పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసే స్థాయి నేతలే లేరన్నది నిష్ఠుర సత్యం. మరి ఈ పరిస్థితిలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందన్నది ప్రశ్న. ఇక పార్లమెంటు స్థానాలకు పోటీ కోసం ఎవరినయినా వెతుక్కోవలసిందే.
ఇక కులసమీకరణలో కమల నాయకత్వం విఫలమయిందన్నది ఓ విమర్శ. కులాల ప్రాధాన్యం గమనించి, వారిని ఆకర్షించే వ్యూహాలేవీ ఇప్పటిదాకా ప్రారంభించలేదన్నది ఓ విమర్శ. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని సెటిలర్లు, విభజన ముందు వరకూ టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించారు. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీకి జైకొట్టారు. ఇటీవలి గ్రేటర్ ఎన్నికలు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న అన్ని డివిజన్లలో బీఆర్‌ఎస్ గెలవడం గమనార్హం.
కానీ తర్వాత వారంతా అదే బీఆర్‌ఎస్‌ను.. ఎందుకు గెలిపిస్తున్నారన్న విశ్లేషణ-అంచనా-చర్చ, తమ పార్టీలో ఇప్పటిదాకా జరగలేదన్నది బీజేపీ నేతల వ్యాఖ్య, ఈ విషయం వాస్తవేమనని, దానిపై ఒక ప్రణాళికతో వెళతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే తమ వైఫల్యాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లే లెక్క.
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి సరైన గౌరవం, బాధ్యతలు అప్పగించరన్న నిందను.. ఇప్పటిదాకా తొలగించడంలో నాయకత్వం, విఫలమయిందన్న విమర్శలు లేకపోలేదు. చివరకు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ లాంటి ఇమేజ్ ఉన్న నాయకుడే.. తనకు ఆ పదవి వద్దని, తాను సాధారణ కార్యకర్తగానే ఉంటానని స్వయంగా అమిత్‌షా సమక్షంలోనే స్పష్టం చేశారు. దానితో అమిత్‌షా సర్దిచెప్పి, ఈటల సమక్షంలోనే చేరికలు ఉండాలని ఆదేశించాల్సి వచ్చింది. దీన్నిబట్టి బీజేపీ అంతర్గత వ్యవహారాలు, ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధమవుతోంది.
అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలు, ప్రకటనలు పార్టీలో జోష్ నింపుతున్నా.. ఆయనది ఒంటరి పోరాటమేనంటున్నారు. ఆయన కష్టం వృధాయేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనకు లభిస్తున్న ఇమేజ్, కొందరికి రుచించడం లేదన్నది ఒక టాక్. అందుకే ఆయనకు సీనియర్లు సహకరించని పరిస్థితి ఉందని, దానితో ఆయన తన పని తాను చేసుకునిపోతున్నారే తప్ప.. మిగిలిన వారిని సమన్వయం చేసుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సంజయ్ టీం లీడర్‌గా, సక్సెస్ కాలేకపోతున్నారన్నది మెజారిటీ నేతల అభిప్రాయం.
ఈ కారణాలు, పార్టీలో చేరిన వారి చేదు అనుభవాలు చూసిన తర్వాతనే.. రాజకీయ ప్రముఖులు బీజేపీ బదులు కాంగ్రెస్‌ను, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి వంటి ప్రముఖులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆ ప్రచారాన్ని వారు ఖండిస్తున్నప్పటికీ.. వివిధ కారణాలతో బీజేపీలో చేరి, నిరాదరణకు గురవుతున్న రెడ్డి సామాజికవర్గ ప్రముఖులంతా, త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమన్న సంకేతాలయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.