-కేసీఆర్… దమ్ముంటే నువ్వు పాదయాత్ర చేయ్
-తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన ఘన కార్యాలేమిటో వివరించు….
-మేం చేసిన తప్పేంది? ప్రజా సమస్యలపై పోరాడటమే నేరమా?
-పేదల ప్రభుత్వం రావాలంటే… గడీల పాలన పోవాల్సిందే
-ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…
‘‘కేసీఆర్…. మేం చేసిన పాపమేంది? ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడటమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా? మేం బస చేసే శిబిరాలను ధ్వంసం చేస్తారా? ’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలంటే… గడీల పాలన పోవాలని అన్నారు.
మరో ఆరు నెలల్లో కేసీఆర్ ఖేల్ ఖతం… దుకాణం బంద్ కాబోతోందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో 60 వేల కోట్ల బకాయిలు పెట్టిన కేసీఆర్ డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఆ బకాయిలన్నీ చెల్లించేది కూడా బీజేపీయేనని అన్నారు. కేసీఆర్ గడీల పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేస్తామని అన్నారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ షాబాద్ గ్రామానికి వచ్చారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా, స్థానిక నేతలు డీకే స్నిగ్దారెడ్డి, యాదగిరిరెడ్డి తదితరులతో కలిసి బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు… అందులోని ముఖ్యాంశాలు…
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం ఏర్పడబోతుంది. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఎన్నో సమస్యలు తెలుసుకున్నా. ఎంతో మంది విద్యార్థులు చదువుకునే స్తోమత లేక ఉపాధి హామీ పనిచేసిన సన్నివేశాలు చూశాను… మీ చెల్లి, అక్క మట్టి పని చేస్తే నువ్వు ఊరుకుంటావా? అన్న అడిగితే… నాకు చాలా బాధేసింది. ఓ తమ్మడు వచ్చి… నాకు కాలు విరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే చికిత్స చేయలేదు. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.8 లక్షలు ఖర్చయితదన్నరు. భరించే స్తోమత లేదన్నారు. ఇవన్నీ చూశాకా… అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చాను.
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఐదు రోజులుగా తిరుగుతున్నా.. ఓట్ల కోసం, సీట్ల కోసం రాలేదు. ప్రజల బాధలు విందామని వస్తే ‘టీఆర్ఎస్ నేతలు మాపై దాడులు చేస్తున్నరు. రాళ్ల దాడులు చేసిండ్రు. రాత్రి బస చేసే గుడారాలను చింపి వేశారు. మేం చేసిన పాపమేంది? పేదల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కొట్లాడటమే మేం చేసిన పాపమా?
రైతుల సమస్యలపై పోరాడితే మా పార్టీ కార్యకర్తలను జైలుకు పంపారు. 317 జీవోపై ఆందోళన చేస్తే సాక్షాత్తు నన్నే జైలుకు పంపిండు. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని, పోడు భూముల సమస్యలపై గుర్రంపోడు వెళితే మా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి నెల రోజులు జైలుకు పంపిండ్రు.
మేం ఏం తప్పు చేసినం… సీఎం కేసీఆర్.. పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడమే తప్పా? ఈ ప్రాంతంలో కాలేజీ, ఆసుపత్రి కూడా కట్టించాలని కోరడమే తప్పా? ఈ ప్రాంతంలో వైద్యం కోసం చికిత్స చేసుకోవాలంటే పక్క రాష్ట్రానికి పోయి చికిత్స చేసుకోవాల్సిన దుస్థితి. ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే మీ రాష్ట్రంలో వైద్యం అందించే దమ్ము లేదా? అని పక్క రాష్ట్రం వాళ్లు అడుగుతుంటే సిగ్గుతో తల దించుకోవాల్సిన దుస్థితి.
నీళ్ల సమస్యపై నేను మాట్లాడుతుంటే… పచ్చగున్న పాలమూరులో నేను చిచ్చు పెడుతున్నానని కేసీఆర్ అంటుండు.. పాలమూరు పచ్చగా ఉందా? ఇక్కడ కరువును చూసి నేను తట్టుకోలేకపోతున్నా. నా గుండె తరుక్కుపోతోంది. గతంలో కరువుతో పాలమూరు ప్రజలు వలసలు పోతున్న విషయాన్ని కళ్లారా చూశాను.
పాలమూరులో కరువు పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే… తెలంగాణలో గడీల రాజ్యం పోవాలి… పేదోళ్ల రాజ్యం రావాలి. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టాల్సిందే.తెలంగాణకు 1.4 లక్షల వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం ఒక్క ఇల్లు కట్టివ్వలేదు. ఆ ఇళ్లన్నీ కట్టిస్తే ప్రధానితో మాట్లాడి నేను అదనంగా 2 లక్షల ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పినా కేసీఆర్ ఫట్టించుకోలేదు.
రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమే. కిలో బియ్యానికి రూ.30లు భరించేది కేంద్రమే. కేసీఆర్ భరించేది రూపాయి మాత్రమే. కోవిడ్ సమయంలో ఉచితంగా రేషన్ బియ్యం అందించిన ఘనత కేంద్రానిదే.. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి కరోనా నుండి కాపాడిన ఘనత కేంద్రానిదే. కేసీఆర్… నువ్వు పాదయాత్ర చేస్తానంటే మేం వద్దన్లేదు. పాదయాత్ర చేసి ప్రజలకు చేసిన ఘన కార్యాలేమిటో చెప్పుకో… నేను తిరుగుతున్నా… కేంద్రం తెలంగాణకు ఏమేం చేసిందో చెప్పడానికి బరాబర్ తిరుగుతా… ఏం చేసినం మేం. మీకోసం కొట్లాడుతున్నం. మీ కోసం దాడులు భరిస్తున్నాం. పేదల ప్రభుత్వం రావాలని కొట్లాడుతున్నం.
కేసీఆర్ ప్రభుత్వంలో యువకులకు ఉద్యోగాలేవి… కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ పదవులొచ్చాయి. మరి నిరుద్యోగుల సంగతేంది? గడీల పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిండ్రు. న్యాయం చేయాలని ధర్నా చేసిండ్రు. ఆదుకోవాలని శాస్త్రవేత్తలు నివేదిక ఇస్తే… ఇప్పటి వరకువాళ్లకు న్యాయం చేయని నాయకుడు కేసీఆర్. పైగా రసాయనాలు ఎక్కువ వాడటంవల్ల రైతులు నష్టపోయారని అన్నాడు.
మేం నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్లను జైలుకు పంపుతాం.కేసీఆర్ పాలనలో ఒక్కసారి పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని దుర్మార్గుడు కేసీఆర్. తెలంగాణ రాక ముందు యువకులు ఆత్మహత్య చేసుకుంటే… తెలంగాణ వచ్చాక యువకులతోపాటు ఆర్టీసీ కార్మికులు, రైతులు, చివరకు విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకునే దుస్థితి.