Home » ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతా

ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతా

– 45 ఏళ్ల రాజకీయాల్లో చాలా మంది సీఎంలను చూశా
– రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు
– అవమానాలు పడ్డా…జైలులో చంపాలని చూశారు
– విభజన కంటే జగన్‌ పాలనలో ఎక్కువ నష్టం
– తిరిగి జగన్‌ గెలిచే ప్రసక్తే లేదు
– మోదీ సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం…
– ప్రజలు మెచ్చుకునేలా పనిచేస్తాం…రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం
– జగన్‌ను తక్కువ అంచనా వేశాం…అది వైఫల్యమే
– ఏబీఎన్‌ బిగ్‌ డిబేట్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

అమరావతి: మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో దేశంలో ఎవరికీ జరగని అవమానాలు జరిగాయని, జైలులో చంపాలని కూడా చూశారని వ్యాఖ్యానించారు. జగన్‌ సైకో కంటే ఎక్కువని, చాలా పార్టీలు.. చాలా మంది సీఎంలను చూశా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.

జగన్‌ ను అంచనా వేయలేదు..జనం కోసమే పొత్తు…
జగన్‌ ను తక్కువ అంచనా వేశాం. అబద్ధాలు చెబుతూ జనాన్ని నమ్మించారు. దేశంలో ఏ పార్టీ కూడా మీడియా సంస్థలు పెట్టలేదు. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడానికే పేపర్‌ పెట్టారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేశారు. జీవితంలో కొందరు ఊహకు అందరు. ఇలాంటి వ్యక్తి పుడతాడని ఎవరూ ఊహించలేదు. జగన్‌ను తండ్రి ఎందుకు బెంగళూరుకు పంపించాడు? జగన్‌ను మేం తక్కువ అంచనా వేశాం. జగన్‌ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే. జనం కోసం మూడు పార్టీలు కలిశాయి. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం మాకుంది.

విభజన కంటే జగన్‌ పాలనలో ఎక్కువ నష్టం…
రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగింది. దాదాగిరి పెరిగింది.. రాష్ట్రం నష్టపోయింది. పోలవరం, అమరావతి, పరిశ్రమలను సర్వనాశనం చేశారు. పూర్తిగా సహకరిస్తామని మోదీ, అమిత్‌షా హామీ ఇచ్చారు. గతంలో వాజ్‌పేయి కూడా నాకు సహకరించారు. పాలసీల్లో మోదీ కచ్చితంగా సహ కరిస్తారు. గతంలో ఒక ఇష్యూపై మోదీతో విభేదించా. ప్రత్యేక హోదా రాలేదని అందోళన కలిగింది. విభజన కంటే జగన్‌ పాలనలో ఎక్కువ నష్టం కలిగింది. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే మా లక్ష్యం. అందుకే మూడు పార్టీలు కలిశాం. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. మోదీపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ప్రపంచంలోనే లీడర్‌ షీప్‌ లోటు ఉంది. అదే సమయంలో మోదీ లీడర్‌గా ఎదిగారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్‌ చేశారు. అదే సమయంలో మోదీ లీడర్‌గా ఎదిగారు. 2014లోనూ నేనెప్పు డూ పదవులు అడగలేదు. జగన్‌ కాళ్లు మొక్కి కేసులు మాఫీ చేయించుకుంటాడు.

జగన్‌ గెలిచే ప్రసక్తే లేదు…
జగన్‌ మాటల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. గతంలో తనను ఎవరూ టచ్‌ చేయలేరన్నారు. ఇప్పుడేమో తనను ఓడిస్తారంటున్నాడు. జగన్‌ మళ్లీ గెలిచే ప్రసక్తే లేదు. జగన్‌ మళ్లీ వస్తాడని నాకు నమ్మకం లేదు. ఉద్యోగులకు గతంలో ముఖ్యమంత్రులు భయపడ్డారు కానీ, జగన్‌ పాలనలో ఉద్యోగులే భయపడుతున్నా రు. జగన్‌ మళ్లీ వస్తే రివర్స్‌ పీఆర్‌సీ అంటాడు. నేను గతంలోనూ సంక్షేమ పథకాలు ఇచ్చా. జగన్‌ అభి వృద్ధిని ఆపేసి సంక్షేమం చేసుకుంటూ వెళుతున్నాడు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వెళ్లాలి. పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మారాలి. కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి 50 ఏళ్ల వయసులోనూ అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి వారికి పెన్షన్‌ కచ్చితంగా ఇవ్వాలి. సామాజిక, ఆర్థిక కారణాల తో కొంతమంది జీవితాంతం వెనుకబడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని కొంతమంది వెనుకబడ్డారు. అందుకోసమే పీ4 పాలసీ అంటున్నాం.వారి ఆదాయం కూడా పెరిగేలా చేస్తాం.

జైలులో చంపాలని చూశారు…
నేను తప్పు చేయకుండా శిక్ష అనుభవించా. నేను తప్పు చేయలేదని జనం నమ్మారు. 53 రోజులు జైల్లో ఉంటే విదేశాల్లోనూ జనం ఉద్యమించారు. ఇంతగా నమ్మిన జనం కోసమే జీవితాంతం పనిచేస్తా. నేను ఏం చేస్తానో జూన్‌ 4 తర్వాత చూస్తారు కానీ, ఒక వ్యక్తినే టార్గెట్‌ చేయను. జైల్లో మంచం, కంచం లేకుండా చేయాలని చూశారు. సీసీ కెమెరాలో చూస్తు ఆనందపడ్డారు. జైలుపై డ్రోన్లు ఎగరేశారు. నా సెల్‌లోకి దోమలు రాకుండా కంట్రోల్‌ చేయాలని పోరాడా. నాకు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వకుండా చేశారు. రిపోర్టులు కూడా తారుమారు చేశారు. నన్ను చంపాలని కూడా అనుకున్నారు. నన్ను అరెస్ట్‌ చేయాలంటూ అధికారులను బెదిరించారు..లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఓ ఆఫీసర్‌ నాకు స్వయంగా చెప్పారు.

జగన్‌ సైకో కంటే ఎక్కువ
జగన్‌ సైకో అని అంటే చాలామంది నమ్మలేదు. జగన్‌ మనస్తత్వం గురించి చాలా మంది రాశారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ సైకో అనే అంటున్నారు కానీ, జగన్‌ సైకో కంటే ఎక్కువ. ఏ ముఖ్యమంత్రి కూడా మీడియాను టచ్‌ చేయలేదు. వైఎస్‌ఆర్‌ మీడియాపై ఆంక్షలు పెడితేనే నేను వ్యతిరేకించా. జగన్‌ మీడియాను కూడా భయపెడుతున్నాడు. కేసీఆర్‌ ఇంత కక్షపూరితంగా వ్యవహరించలేదు. 40 ఏళ్లలో భువనేశ్వరి తొలిసారి రోడ్డుపైకి వచ్చారు.

నాకు జరిగిన అవమానాలు దేశంలో ఎవరికీ జరగలేదు…
ఈ మధ్య కొన్నిసార్లు ఆవేశంలో మాట తూలుతున్నా. నాకు జరిగిన అవమానాలు దేశంలో ఎవరికీ జరగలేదు. ఫ్రస్టేషన్‌లో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తోంది. అధికారంలోకి రాగానే కల్తీ మద్యాన్ని నిర్మూ లిస్తాం. తప్పులు చేసిన వారిని వదిలి పెట్టడం కరెక్ట్‌ కాదు. మళ్లీ తప్పులు చేయకుండా శిక్ష పడేలా చూస్తాం. రెండు పార్టీలనూ కలుపుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తాం. నా తెలివి, అనుభవం కలిపి రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి చేస్తాం.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం. జగన్‌ కంటే మంచిగా సంక్షేమాన్ని అమలు చేస్తాం.

ప్రజలు గుర్తు పెట్టుకునేలా పనిచేస్తా
కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. లోకేశ్‌ సహా ఎవరైనా ఎప్పుడు ఏం చేయాలో సరైన సమయంలో నిర్ణయిస్తా. నేను చెప్పివన్నీ హైదరాబాద్‌లో సాధ్యమయ్యాయి. ప్రజలు నన్ను గుర్తు పెట్టుకు నేలా పనిచేస్తా. హైదరాబాద్‌ను ఎవరూ నాశనం చేయలేదు. అందుకు చాలా మంది సీఎంలకు కృతజ్ఞత చెప్పాలి. నాకు ఎంత సాధ్యమైతే అంత చేస్తా. జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి. హైదరాబాద్‌లో నేను చేసిన అభివృద్ధి పనుల ఫలితాలు తెలంగాణ వాసులు అనుభవిస్తున్నారు. అదే విధంగా అమరావతిలో చేయాలనుకున్నా కానీ, ప్రజలు అర్థం చేసుకోలేదేమో? నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు అండగా నిలబడ్డారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి. అన్ని చోట్లా తెలుగు జాతి నెంబర్‌వన్‌గా ఉండాలి. పేదరికం లేని తెలుగుజాతే నా లక్ష్యం. 45 ఏళ్లలో ప్రలోభాలకు లొంగలేదు. సంతకం పెట్టాక కూడా మళ్లీ చెక్‌ చేసుకునే వాడిని.

Leave a Reply