-అందరం కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమన్న యువనేత
-మంగళగిరి ప్రముఖులతో కొనసాగుతున్న వరుస భేటీలు
మంగళగిరి: మంగళగిరిని యావత్ ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని, ఈ మహోన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ తనకు సహకరించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మంగళగిరి, పరిసరాల్లో ఐదుగురు ప్రముఖులను లోకేష్ వారి ఇళ్లవద్దకు వెళ్లి కలుసుకున్నారు.
తొలుత మంగళగిరి రూరల్ యర్రబాలెం వెళ్లి గరిక నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎరుకల సామాజికవర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా నాగేశ్వరరావు యువనేత దృష్టికి తెచ్చారు. టిడిపి- జనసేన ఆధ్వర్యంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్నివర్గాల అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
తర్వాత బుడగజంగాల సామాజికవర్గ ప్రముఖుడు ఊర వెంకటేశ్వరరావును కలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. తమ సామాజికవర్గయులు అధికశాతం చిలకజోస్యం, వీధులవెంట బొమ్మల విక్రయం వంటి వృత్తులపై ఆధారపడుతూ గడుపుతుంటారని తెలిపారు. సంచారజాతిగా ఉన్న తమవారికి సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు.
అనంతరం మంగళగిరి 17వ వార్డుకు చెందిన సగర సామాజికవర్గ ప్రముఖుడు ఖగ్గా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. నిర్మాణరంగంలో మెటీరియల్ సప్లయర్ గా ఉన్న వెంకటేశ్వరరావు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు.
యువనేత స్పందిస్తూ గత నాలుగున్నరేళ్లలో ఇసుక అందుబాటులో లేక 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని తెలిపారు. రాబోయే రోజుల్లో సరళమైన ఇసుకపాలసీ తెచ్చి భవననిర్మాణ రంగానికి గతవైభవం తెస్తానని చెప్పారు. అనంతరం మంగళగిరి టౌన్ 9వ వార్డు వెళ్లి సాయి ప్రవీణ్ జ్యూవెలర్స్ అధినేత తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లును కలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కండేయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు లక్ష్మీ పెరుమాళ్లు అందిస్తున్న సేవలను యువనేత కొనియాడారు. వెంటనే పేదలకు మరింత విస్తృతమైన సేవలందించేందుకు తమవంతు సహాయ,సహకారాలు అందిస్తానని చెప్పారు.
చివరగా ఆత్మకూరుకు చెందిన దేవాంగ ప్రముఖుడు భల్లా వెంకటరమణ కుటుంబాన్ని కలుసుకున్నారు. అమరావతి దేవాంగ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరమణ పలు చారిటీ కార్యక్రమాలతోపాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు. యువగళం సందర్భంగా తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సమయంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేశానని చెప్పారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని లోకేష్ పేర్కొన్నారు.