సాయిబాబా – హైందవానికి విపత్తు – 6
గురువు అనే మాటకు కొన్ని ఇతర అర్థాలతో పాటు తండ్రి, కులజ్యేష్టుడు, కులం పెద్ద, తాత, తండ్రి తోబుట్టువు, అన్న, మేనమామ, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, మంత్రోపదేశం చేసినవాడు, మీమాంసకుడు, బృహస్పతి, దేవగురువు వంటివి సరైన అర్థాలు. వీటిల్లో ఏది సాయిబాబాకు పొసుగుతుంది? ఏదీ పొసగదు. వీటిల్లో అన్నిటికీ సాయిబాబా అనర్హుడు. అయినా సాయిబాబా కొందరు హిందువులకు గురువు ఎలా అయ్యాడు? మానసిక రోగం వల్ల, అమాయకత్వం వల్ల, మూఢనమ్మకం వల్ల సాయిబాబా కొందరు హిందువులకు గురువు అయిపోయాడు అన్నది సరైన అవగాహన.
వ్యాసుడు, అదిశంకరాచార్య వంటి వాళ్లలా ‘చదువు’, జ్ఞానం, నిష్ఠ, సంప్రదాయం, వైదికత్వం ఉన్న మీమాంసకుడా సాయిబాబా? ఆదిశంకరాచార్య వలే క్రియాశీలకత్వంతో, పనితనంతో, క్రమశిక్షణతో, ప్రతిభతో ఉద్యమించి జాతికి, సనాతనానికి అవసరమైన మేలు చేసిన వ్యక్తా సాయిబాబా? సాయిబాబా గురువు, సద్గురువు అవడం ఏమిటి? అసలు సాయిబాబా హిందువు కూడా కాదు కదా? ఇతర గరువు లక్షణాలు ఎలాగూ లేవు కనీసం ఒక సగటు సనాతనుడిగా అయినా సాయిబాబా బతకలేదు కదా?
సాయిబాబాకు హైందవంలో గురు స్థానం లేదు, రాదు.
సాయిబాబా మూలం ఏమిటి?సాయిబాబా ఏ హైందవ సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి? సాయిబాబాకు మన హైందవానికి లేదా వైదికానికి సంబంధం ఏమిటి? అసలు సాయిబాబా ఎవరు? హైందవ గురువు ఎలా అవుతాడు సాయిబాబా?
ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, రాఘవేంద్రులు, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, మహావతార్ బాబా ఇలాంటి మహనీయుల కాలిదుమ్ముకైనా సాటి కాగలడా సాయిబాబా? ఆ మహనీయులను మనసులోనూ, మస్తిష్కంలోనూ పెట్టుకుని ఒక్కసారి సాయిబాబా గురించి ఆలోచన చేద్దాం. ఆ మహనీయుల సమర్పణలు, జీవన శైలులు, సంప్రదాయాలు, ఘన సాధనలు, సనాతనత్వం సాయిబాబాకు ఉన్నాయా?
ఆ మహనీయుల ముందు సాయిబాబా స్థానం ఏపాటిది? సనాతన ధర్మం పరంగా ఆదిశంకరులలా సాయిబాబా చేసినదేమిటి? అసలు హైందవంలో సాయిబాబా భాగస్వామ్యం ఏమిటి? సాయిబాబా గురువు ఎవరు? సాయిబాబా ఏ సంప్రదాయానికి చెందిన గరువు? సాయిబాబా చరిత్ర ఏమిటి? సాయిబాబా జీవన స్థాయి, బోధనల స్థాయి ఆధ్యాత్మికత స్థాయి ఏమిటి?
సరైన చదువుతో, ఆలోచనతో ఒక్కసారి ఆదిశంకరుల జీవితాన్ని, పరిశ్రమను, మేధను, ఉద్యమశీలత్వాన్ని, చదువును, ప్రజ్ఞను సాయిబాబాతో, సాయిబాబా జీవితం, జీవనంతో పోల్చి చూడండి… ఆలోచించండి సాయిబాబా భక్తులారా! ఇది మీ మనోభావాల్ని కించపరచడం కాదు; సాయిబాబాపై అంధ భక్తితో మన హైందవ సంస్కృతిని ఎందుకు దెబ్బకొడుతున్నారు మీరు అని ఆవేదనతో అడగడమే ఇది. ‘సాయిబాబా భక్తులు తమ వికృతత్వంతో హైందవ భావాల్ని దెబ్బకొడుతున్నారు’; నిజమైన హిందువుల్ని హింసిస్తున్నారు.
సాయిబాబా వైదిక లేదా సనాతన సాంప్రదాయిక గురువు కాదు; భారతీయ ధార్మిక గురువు కాదు. సాయిబాబాను వైదికంగా సద్గురువు అంటూ వక్ర ప్రచారం చేస్తు సనాతన, వైదిక ప్రజల మనోభావాలను, భారతీయ ధార్మికతను దెబ్బకొట్టద్దని మనవి.
“సమర్థ సద్గురు సాయినాథ్కీ జై” అంటూ లేకీతనాన్ని, వెకిలితనాన్ని, వక్రతను, ‘మామూలు హిందువులకు’ ఆవేదన కలిగించే అజ్ఞానాన్ని వెళ్లగక్కుంటూ సాయిబాబా భక్తులైన హిందువులు సనాతనానికి ఎందుకు తలవంపులు తీసుకురావాలి?
“కృష్ణం వందే జగద్గురుం” అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. సాయిబాబా కృష్ణుడి సంప్రదాయం వ్యక్తా?
“సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం;
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం” అని సనాతన గురుపరంపర సాగుతుంది కదా? సాయిబాబాకు ఈ కోవలో చోటు ఉందా? ఉండాలంటే సాయిబాబాకు ఒక సనాతన పరంపర ఉండాలి కదా? సాయిబాబా పరంపర ఏమిటి? సాయిబాబా పరంపర తెలిసిన వారెవరు?
అద్వైత గురు పరంపర నారాయణుడి నుంచి మొదలై బ్రహ్మ, వసిష్ఠ, శక్తి, పరాశరుడు, వేద వ్యాసుడు, శుకుడు, గౌడపాదులు, గోవిందులు, ఆదిశంకరులు, ఆదిశంకరుల నలుగురు శిష్యులైన పద్మపాద, హస్తామలక, తోటక, సురేశ్వరాచార్య వీళ్లతో సాగుతుంది. సాయిబాబా వీళ్ల శ్రేణిలోని వ్యక్తా? సాయిబాబా ద్వైత, విశిష్టాద్వైత, మధ్వ గరువుల శ్రేణిలోని వ్యక్తా? కాదు… కాదు…కాదు… ఏదీ ‘కానివ్యక్తి’ సాయిబాబా సనాతనంలో గురువు కాదు…కాదు…కాదు.
గురు పూర్ణిమ అన్నది వైదిక సంప్రదాయం. అలాంటప్పుడు పవిత్రమైన గురుపూర్ణిమ నాడు అవైదికవ్యక్తి అయిన సాయిబాబాకు సనాతన లేదా వైదికపరంగా ఆరాధన చెయ్యడం వైదిక ద్రోహం. భారతీయతకు ద్రోహం. ప్రపంచంలోని వైదికుల మనోభావాల్ని, వైదిక భావాల్ని నొప్పించడం; ధార్మికమైన తప్పిదం; అమానవీయం.
‘చారిత్రికంగా సాయిబాబా ఏ దశలోనూ హిందువుగా జీవించింది లేదు. కనుక సాయిబాబా ఒక గురువుగా అనర్హుడు. గురుపూర్ణిమ సంప్రదాయానికి అనర్హుడు’ అన్న తిరుగులేని సత్యాన్ని మనం ఆలోచనలోకి, ఆచరణలోకి తెచ్చుకోవాలి. సాయిబాబా భక్తి అన్నది మన వైదిక, సనాతన సంప్రదాయాలకు ఇకపైనైనా గొడ్డలి పెట్టుకాకూడదు.
“సాయిబాబా గురువు, సద్గురువు అన్న మాట, భావన వద్దు;
సాయిబాబాను గురువు అంటూ సనాతనాన్ని నాశనం చెయ్యవద్దు”
(సాయిబాబా పై అవగాహన వ్యాసాలలో తదుపరి వ్యాసం రేపటి సంచికలో).)
– రోచిష్మాన్
9444012279