Suryaa.co.in

Andhra Pradesh

బీసీలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళతాం

-గత ఐదేళ్లు బీసీలకు పదవులు అలంకారమే..ఒరిగింది శూన్యం
-నిధులు లేవు, నమ్ముకున్నోళ్లకు చిన్న లోన్‌ ఇచ్చిన పరిస్థితి లేదు
-పల్నాడు ప్రజలు కులమతాలను చూడరు.. మంచిచేసే వారితోనే ఉంటారు
-యాదవుల ఆత్మీయ సమావేశంలో శ్రీకృష్ణదేవరాయలు, అరవింద్‌బాబు

బీసీ సామాజిక వర్గానికి గడిచిన ఐదేళ్లలో పదవులు అలంకారానికే తప్ప అధికారాలు శూన్యమని నరసరావుపేట టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు అన్నారు. సోమవారం నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బీసీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా నిధులు ఉండవని,, కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, వారిని నమ్ముకున్న వారికి కూడా చిన్న లోన్‌ కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, వారి సంక్షేమానికి కృషిచేసిందని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకొస్తామని, నిధులు కేటాయించి వారికి సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌, రక్షణ చట్టంతో వారికి కవచం లా పనిచేస్తామని భరోసా ఇచ్చారు.

పల్నాడులో బీసీలపై దాడులు జరిగాయని, చంద్రయ్యను అమానుషంగా హత్య చేసిన ఘటనలు చూశామని.. ఇలాంటి పరిస్థితులను మార్చి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తామని తెలిపారు. బీసీలకు వచ్చే ఐదేళ్లలో పార్లమెంట్‌ వ్యాప్తంగా 50 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన బీసీ సామాజికవర్గ ప్రజలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణ బాధ్యతను టీడీపీ తీసుకోబోతున్నట్లు చెప్పారు. పల్నాడు ప్రజలు కుల, మత, వర్గ భేదాలను చూడరని, ఎవరైతే మంచి చేస్తారో వారి వైపు నిలబడతారని, ఈ విషయాన్ని మేము సంపూర్ణంగా నమ్ముతున్నామని తెలిపారు.

LEAVE A RESPONSE