Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందా?

– పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకు పోయింది.. కేంద్ర ప్రభుత్వం ఇజ్జత్ పోలేదా ?
– రేవంత్ రిమోట్ ఎత్తితే ఎగిరే తోలు బొమ్మ బండి సంజయ్
– రేవంత్ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడవా ?
– రేవంత్ పై ఉన్న కేసుల గురించి బండి సంజయ్ ఎందుకు నోరు మెదపరు ?
– రేవంత్ కేసులపై సంజయ్ సిబిఐ విచారణ ఎందుకు కోరరు ?
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే గంగుల కమలాకర్,మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. కరీంనగర్ ఎంపీ గా ఉండి కేంద్ర మంత్రి అయిన సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం వస్తుంది. కేసీఆర్ ఇంకా సీఎం గా ఉన్నారనుకుని, బండి ప్రతిరోజూ బీ ఆర్ ఎస్ పై విమర్శలు చేస్తున్నారా ? అని మాజీ మంత్రి, ఎమ్మేల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

ఇక్కడ కూడా మోడీ ని పిలిచి యోగాసనాలు చేపిస్తే అయిపోయేది కదా? బండి సంజయ్ తమ్మిడి హట్టి దగ్గర 165 టీఎంసీ ల నీళ్లున్నాయని సీడబ్ల్యూసీ నివేదిక ను చదివి వినిపించారు. ఆ నివేదిక లో కొద్ధి భాగం మాత్రమే బండి చదివి వినిపించారు. బండి చూపిన పత్రం లోనే 63 టీఎంసీ లు ఇతర రాష్ట్రాలకు కేటాయించాము. తెలంగాణ కు ఉండేది 44 టీఎంసీ లనే చెప్పారు.

ఇవన్నీ ఆలోచించే కేసీఆర్ కాళేశ్వరం లిఫ్టింగ్ పాయింట్ ను మేడిగడ్డకు మార్చారు. 38 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష 24 కోట్ల రూపాయలకు పెంచారని సంజయ్ నిరాధార ఆరోపణ చేశారు. కాళేశ్వరం తో ఆయకట్టు పెరిగింది. రిజర్వాయర్లు పెరిగాయి. రోజూ లిఫ్ట్ చేసే సామర్థ్యం 3 టీఎంసీ లకు పెరిగింది.

దేశంలో ఎన్నో పెద్ద ప్రాజెక్టుల కన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కు తక్కువ ఖర్చు అయింది. లక్ష కోట్ల కన్నా తక్కువ ఖర్చు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటారా ? ఇది రేవంత్ రెడ్డి భాష కాదా బండి సంజయ్? రేవంత్ రెడ్డి ఎంపీ గా కాళేశ్వరం లోఅవినీతి జరిగిందా అని పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే లేదు అని సమాధానం ఇచ్చారు.

మోడీ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం అవినీతి జరగలేదంటే నువ్వు అవినీతి జరిగింది అని ఎలా అంటావ్ బండి? కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇస్తే పరువు పోయేది అని బండి అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చారు. అక్కడ డయాఫ్రామ్ వాల్ కొట్టుకు పోయింది. కేంద్ర ప్రభుత్వం ఇజ్జత్ పోలేదా ?

ndsa రిపోర్ట్ మేడిగడ్డ దగ్గర పిల్లర్ల ను రిపేర్ చేయొచ్చని చెప్పింది. రేవంత్ హయం లో ఎస్ ఎల్ బీసీ కుప్ప కూలింది .సుంకి శాల దెబ్బతిన్నది. వట్టెం మునిగిపోయింది. పెద్ద వాగు పెట్టుకుపోయింది .బీజేపీ ఎందుకు విచారణ కోరదు ? బీజేపీ కాంగ్రెస్ మైత్రి బంధం బలపడ్డది. అందుకే రేవంత్ ప్రభుత్వ తప్పిదాలని బీజేపీ ప్రశ్నించడం లేదు.

కాళేశ్వరానికి అనుమతులు లేవని బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నాయి. ప్రభుత్వం లో ఉన్న బండి సంజయ్ వివరాలు తెప్పించుకోవచ్చు. కాళేశ్వరం తో పంటలు పండలేదు అని సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కింద ఉన్న ప్రాజెక్టుల ద్వారా పారిన నీళ్ళతోనే భూమికి భారమయ్యే పంట పండింది.

మేడిగడ్డ దగ్గర రిపేర్ చేయమని కోరితే తెలంగాణ ప్రజలు సంతోషించే వాళ్ళు. మేడిగడ్డ ను రిపేర్ చేయకుండా గోదావరి నీళ్లు కిందకు పంపించడమే బండి సంజయ్ ఉద్దేశమా ? మంత్రిగా మాట్లాడితే అర్థం ఉంటుంది .సంజయ్ ఓ బీజేపీ కార్యకర్తగా మాట్లాడితే ఇలాంటి అబద్దాలే వస్తాయి.

తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టించి చూపండి. : మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్

బండి సంజయ్ ది అవగాహనా రాహిత్యం. కేసీఆర్ ను తిట్టేందుకే పుట్టినట్టుగా బండి సంజయ్ మాట్లాడుతుంటారు. ద్వేషాన్ని నింపుకుని సంజయ్ వాస్తవాలు దాచి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకముందే అంచనావ్యయం 40 వేల కోట్ల రూపాయలు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది.

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్రం లో సంజయ్ ,కిషన్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల దగ్గర రేవంత్ తో కలిసి బండి సంజయ్ అనుమతి తీసుకురండి. రెండు నెలలు సమయం ఇస్తున్నాం.

తమ్మిడి హట్టి నుంచి ఎల్లం పల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తేవొచ్చు అంటున్నారు కదా? బండి సంజయ్ ఆ పని కూడా చేయి .ఈ రెండు పనులు చేస్తే బండి సంజయ్ కు సత్కారం చేస్తాం. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు సాధించడమే కాదు .రేవంత్ రెడ్డి దగ్గర చీరినా డబ్బులు లేవంటున్నారు కదా? ఆ డబ్బులు కేంద్రం నుంచే ఇప్పించి జాతీయ హోదా కూడా తెండి. ఎవరు వద్దన్నారు?

కేసీఆర్ అన్నీ ఆలోచించి నీటి లభ్యత ఉందనే మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం లిఫ్టింగ్ పాయింట్ నిర్ణయించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెప్పించి చూపించారు. అభివృద్ధి చేసి చూపించారు .ఇపుడు మీరు తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టించి చూపండి.

మిడ్ మానేరు కొట్టుకుపోతే కేసీఆర్ ఎవర్ని నిందించక మరమ్మత్తులు చేసి నీరందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే పరువు పోయేదని ఎలా అంటావ్ బండి సంజయ్? కేంద్ర నిధులతో కట్టిన పోలవరం ప్రాజెక్టు లో డామేజ్ జరిగితే పరువుపోయిందని ఎందుకు మాట్లాడవు బండి సంజయ్?

సంజయ్ రేవంత్ రెడ్డి రామచిలుక : ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్

బండి సంజయ్ రేవంత్ రెడ్డి రామచిలుకలా మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ తో అధ్యక్ష పదవి పై ఉన్న పేచీ తోనే బండి సంజయ్ కాళేశ్వరం పై విషం గక్కారు. బీజేపీ నేతలందరూ ఒక చోట సంకల్ప సభ పెట్టుకుంటే, బండి సంజయ్ ఆ మీటింగ్ కు పోకుండా తన ఎజెండా ను తెరపైకి తెచ్చారు. రేవంత్ రిమోట్ ఎత్తితే ఎగిరే తోలు బొమ్మ బండి సంజయ్.

గోదావరి నీళ్లు తాగిన బండి సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఫై సీబీఐ విచారణ కు బీ ఆర్ ఎస్ వ్యతిరేకం కాదు. సీబీఐ విచారణ జరిగితే ఈటెల రాజేందర్ ను కూడా పిలవాల్సి ఉంటుంది .పిలిస్తే రాజేందర్ కు బీజేపీ అధ్యక్ష పదవి రాదని బండి సంజయ్ కుట్ర. భావదారిద్ర్యం తోనే బండి సంజయ్ కాళేశ్వరం ఫై దాడి చేస్తున్నాడు.

కాళేశ్వరం పై చంద్రబాబు కన్నా హీనంగా మాట్లాడిన బండి సంజయ్ ను తెలంగాణ క్షమిస్తుందా ? గోదావరి కి హారతులు ఇస్తారు .తెలంగాణ నుంచి కిందకు తరలించడానికేనా ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు కూలి పోయాయి. రిపేర్ చేసి మళ్ళీ వాడలేదా? అయోధ్య రామాలయం లో కూడా కట్టిన తర్వాత నీళ్లు లీక్ అయ్యాయి. రిపేర్ చేయలేదా ?మేము సిబిఐ విచారణ కోరామా?

గుజరాత్ లో బ్రిడ్జి కూలి 180 మంది చనిపోయారు .సీబీఐ విచారణ కోరామా ?మేడి గడ్డ దగ్గర కుంగింది రెండు పిల్లర్లు మాత్రమే. బండి సంజయ్ అంత పెద్ద లీడర్ ఎట్లా అయ్యిండో అర్థం కాదు. మోడీ కాళేశ్వరం ఏ టీ ఎం అన్నాడు .అదే మోడి ఆర్ ఆర్ టాక్స్ గురించి కూడా మాట్లాడాడు .దాని గురించి సంజయ్ ఎందుకు మాట్లాడడు ? రేవంత్ పై ఉన్న కేసుల గురించి బండి సంజయ్ ఎందుకు నోరు మెదపరు ? రేవంత్ కేసులపై సంజయ్ సీబీఐ విచారణ ఎందుకు కోరరు ?

బండి సంజయ్ ,ఈటెల తమ మధ్య వివాదాలు ఉంటె గల్లాలు పట్టుకుని కొట్లాడుకోండి. మీ వివాదం లో తెలంగాణ కు మేలు చేసే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వాడుకుంటున్నారు? బండి సంజయ్ కాళేశ్వరం పై పరిజ్ఞానం పెంచుకోవడానికి హరీష్ రావు విడుదల చేసిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చదువుకోవాలి. రేవంత్ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడవా ? ఈడీ కేసు పై మాట్లాడవా ? అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన కేసు రేవంత్ పై ఉంది. దాని గురించి ఎందుకు మాట్లాడవ్ బండి సంజయ్ ?

సంజయ్ గెలవడమే ఓ శాపం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

బండి సంజయ్ కాళేశ్వరం మీద మాట్లాడటం ఆశ్చ్యర్యం వేస్తుంది. కరీంనగర్ ఎంపీ గా సంజయ్ గెలవడమే ఓ శాపం. ఓ బ్రిడ్జి కట్టడం చేత కానీ బండి సంజయ్ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు గురించి మాట్లాడతాడా ? రెండు సార్లు ఎంపీ గా అవకాశం వచ్చింది. హోం మంత్రిగా ఉన్నావ్ . తెలంగాణ కు మేలు చేయడానికి ఈ పదవులు చాలవా ? కాళేశ్వరం తో ఆయకట్టు పెరిగిందా లేదా అనే అంశం పై చర్చకు వస్తావా బండి సంజయ్?
కరీంనగర్ చౌరస్తా లో చర్చకురా ..ఆయకట్టు పెరిగిందని నిరూపిస్తాం. బండి సంజయ్ బీజేపీ యా కాంగ్రెస్ యా అర్ధం కావడం లేదు. రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను బండి సంజయ్ చదువుతున్నారు

సంజయ్ ,అరవింద్ చిల్లర రాజకీయాలు : ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్

బండి సంజయ్ ,ధర్మపురి అరవింద్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఓట్లేసిన తమ సొంత ప్రజలకు బీజేపీ ఎంపీ లు ద్రోహం చేస్తున్నారు. cwc రిపోర్ట్ ను వక్రీకరించిన బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగే హక్కు ఉందా ? చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తరలించే కుట్రలకు సహకరించకండి.

LEAVE A RESPONSE