Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి

– వైసీపీ అరాచక పాలనపై తిరగబడదాం
– 2024లో టీడీపీ… జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుంది
– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

రాజమహేంద్రవరం : కేవలం ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం – జనసేన కూటమి నేతృత్వంలో స్థానిక 44వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు శంకర్, జవ్వాది మురళి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇంచార్జి అత్తి సత్యనారాయణ (అనుశ్రీ సత్యనారాయణ), టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన జిల్లా కార్యదర్శి జమ్మి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను స్థానిక డివిజన్ కమిటీ వారితో కలిసి డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అరాచకపాలనపై తిరగబడేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రజలు, మహిళలకు రక్షణ కరువైందన్నారు. బస్సు, కరెంట్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, మధ్యం రేట్లు పెంచి రాష్ట్ర ఖజానా నింపుకుంటున్నారన్నారు. జాబ్‌క్యాలెండర్‌, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

గనులు, మద్యం, ఇసుక అన్ని రంగాల్లో దోచుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ సీఎంగా చంద్రబాబునాయుడు రావాలన్నారు. నవ్యాంధ్ర భవిష్యత్తుకు భరోసా చంద్రబాబు మాత్రమేనని, రాష్ట్ర భవిష్యత్తును కాలరాసిన జగన్‌రెడ్డిని ఓడించి తిరిగి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

టీడీపీ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు, పార్లమెంట్‌ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE