-పోలీసుల ప్రేక్షకపాత్ర
-అన్నమయ్య జిల్లాలో ఇదో అరాచకం
( బహదూర్)
ఆడవారికి ఆడవారే శత్రువులంటారు. అనడం కాదు. నిజం. కావాలంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనను చూడండి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తట్టుకోలేక.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే ఆమె చేసిన మహా పాపం. అందుకు ఆ ఊరి సభ్య సమాజం ఆమెకు విధించిన శిక్ష.. చెట్టుకు కట్టి దండించమే. అంతే కాదు కోడిగుడ్లతో దాడి కొసమెరుపు. ఈ అమానుష ఘటనకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు. ఈ నవీన ఆధునిక యుగంలోనూ అటవిక విన్యాశం జనాన్ని అబ్బుర పరచింది.
అది అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారి పాలెం. ఓ మహిళ తొలి భర్తను ఇటీవలే విడిచి పెట్టి మరొకరిని పెళ్లాడింది. ఈ చర్య ఆ గ్రామ మహిళలకు నచ్చలేదు. ఊరి మధ్యన ఆ మహిళను చెట్టుకు కట్టేశారు. ఇక తమ ప్రతాపం చూపించారు. ఇష్టమొచ్చినట్టు కర్రలతో కొట్టారు. కోడిగుడ్లతో దాడి చేశారు. చిత్ర హింసలు పెట్టారు. ఒక రకంగా ఊరిజనం ఎదుట అవమానించారు.
ఈ సమాచారం పోలీసులకు అందింది. ఘటన స్థలికి ఇద్దరు పోలీసులు వెళ్లారు. కానీ ఆ మహిళలు ఏ మాత్రం తగ్గలేదు. బూతులు తిడుతూనే కర్రలతో కొడుతూనే కొట్టారు. కనీసం ఓ మహిళ పోలీసును రప్పించలేక పోయారు. సచివాలయంలో మహిళ పోలీసు ఉన్నారో? లేదో ? సభ్య సమాజానికి అర్థం కావటం లేదు. కానీ పోలీసులు మాత్రం ఈ వీధి వినోదాన్ని వీక్షించారు.
మహిళలకు రొప్పు వచ్చిన తరువాత.. వాళ్లకు వాళ్లే తగ్గిన తర్వాత బాధితురాలిని వీరబల్లి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. బాధితురాలు ఫిర్యాదును తీసుసుకోవటానికి వీరబల్లి ఎస్ఐ మనస్సు ఒప్పలేదు. ఈ ఘటనపై ఫోటోలు వీడియోలు పెడితే మీ పైనే కేసు కడతానని బెదిరించినట్టు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.
సోషల్ మీడియాలో ఈ అకృత్యం ట్రోల్ కావటంతో.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం కోసం ఆ మహిళ ఘోషిస్తే.. న్యాయం చేయకపోగా తనను భయభ్రాంతులకు గురి చేశారని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ పైన ఇంతగా భౌతిక దాడులకు పాల్పడినప్పటికీ, నిందితులను వీరబల్లి ఎస్ఐ.. కాపాడారని సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.