అక్టోబర్1న రాజమండ్రిలో ‘మహిళా సాధికారత ఉత్సవం’

– సీఎంకు వివరించిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– మహిళా మంత్రుల చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ

ఆకాశంలో సగం – అన్నింటా సగం..
ఇది ఏపీ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం..అనే నినాదంతో అక్టోబర్ ఒకటో తేదీన రాజమండ్రిలో ‘దసరా మహిళా సాధికారత ఉత్సవం’ జరుపుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా మహిళా సాధికారత ఉత్సవంపై ఆయనకు వివరించారు. కార్యక్రమాల పోస్టర్ నమూనాను సీఎం అసాంతం చదివి.. మహిళా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ్నే ఉన్న మహిళా మంత్రులను పిలిచి ఈ మహిళా ఉత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

అనంతరం సచివాలయ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర మహిళా మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజినీ, ఉషశ్రీ చరణ్ లతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మహిళా సాధికారత ఉత్సవం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ ఒకటిన రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సాయయ4 గంటలకు ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెండువేల మందితో మహిళల బైక్ ర్యాలీ, నారీశక్తిని చాటే కళాజాత ప్రదర్శనలు, సాధికారత నృత్యరూపకాలు, వేషధారణలు, వీధినాటికలు, స్టేజీ షోలు.. మహిళల కబడ్డీ, కర్రసాము, కరాటే, కోలాటం ప్రదర్శనలు, స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉంటుందన్నారు.

అదేవిధంగా “సబల” రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనతో పాటు, విజేతలకు రూ.5లక్షల బహుమతులు ప్రదానం, స్ఫూర్తిదాయక మహిళలకు సన్మానం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని వాసిరెడ్డి పద్మ ఆహ్వానించారు.

Leave a Reply