Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి అసలు అధ్యక్షుడే లేడు

* జగన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడుగా పేరు రాసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం రిజెక్ట్ చేసింది
* అలాంటి పార్టీ కూడా జనసేన గురించి మాట్లాడుతుంది
* జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్

‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? పార్టీని స్థాపించిన వారు ఎవరు? ఇప్పుడున్న అధ్యక్షుడు నిజమైన అధ్యక్షుడేనా? జగన్ నిజమైన అధ్యక్షుడు అయితే వైసీపీని స్థాపించిన శివ కుమార్ అనే వ్యక్తి ఎవరు? ఆయన్ను బెదిరించి పార్టీని లాక్కున్నది నిజం కాదా? వైసీపీకి శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రకటించి ఎన్నికల సంఘానికి పంపిస్తే దానిని వాళ్లు ఎందుకు తిరస్కరించారు? వీటన్నింటికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని, అందుకే ఆ పార్టీ నాయకులు మీడియా ముందు అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. రాజకీయ పార్టీలో రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ అని రెండు రకాల పార్టీలు ఉంటాయని, ఏ పార్టీ అయినా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని చెప్పారు. ఇది కూడా తెలియని వైసీపీ నాయకులు జనసేన పార్టీని ఎందుకు పిలిచారని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

బుధవారం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ “వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటి నుంచి వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. తాజాగా జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు చూసి ఓటమి భయం పట్టుకుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని ప్రయత్నిస్తుంది. వైసీపీ మాత్రం ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు నమోదు చేయడం ద్వారా గెలవాలని చూస్తోంది. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమ”న్నారు.

LEAVE A RESPONSE