Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ అంటే గూండాల పార్టీ

* కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కొత్త వెలుగులు చిందిస్తుంది
* జనసేన పోరాటమే ప్రజల్లో ధైర్యం నింపింది
* కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
* జాతీయ స్థాయిలో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
* పిఠాపురం బహిరంగ సభలో జనసేన పార్టీ అభ్యర్థులు పవన్ కళ్యాణ్

‘వైసీపీ అంటే గూండాల పార్టీ. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కరిని కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. వాళ్ల అరాచకాలు, దాష్టీకాలు చూసి ఎవరికైనా వీధుల్లోకి రావాలంటే భయం.. రోడ్ల మీద తిరగాలంటే భయం. హక్కులు హరించారు అని చెప్పడానికి భయం. ఇంతలా ప్రజలను భయపెట్టిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీ పుట్టించిన ఆ భయాన్ని పోగొట్టింది జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళల పోరాటమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకంగా నామినేషన్లు వేసి జగన్ అహాన్ని అణిచి వేశారని చెప్పారు. ఈ రోజు జగన్ భయపడుతున్నాడంటే ఒక్క జనసేన పార్టీకేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా..? అన్న చందంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని వైసీపీ ప్రజలను భయపెట్టింది. కడుపు మండిన భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు, అఘాయిత్యానికి గురైన సుగాలి ప్రీతి తల్లి బయటకు వస్తే ప్రాణాలను పణంగా పెట్టి బయటకు వచ్చాను. జనసేన పార్టీని ఒక్క ఎన్నికల కోసం స్థాపించలేదు. మన బిడ్డల భవిష్యత్తు కోసం స్థాపించాను. ఒక తరం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను.

రాజకీయాలు అంటే తెలియని నా భార్యను కూడా ఇష్టానుసారం మాటలు అన్నారు. ఇవన్నీ చూసి ఆమె చాలా బాధపడింది. నా నుంచి నువ్వు ఇన్ని మాటలు పడ్డావు నన్ను క్షమించమని మాత్రమే ఆమెను అడిగాను. నేను ఇంతలా ప్రజలకు ఎందుకు నిలబడ్డానో తెలియాలంటే ఈ నెల 13వ తేదీ పిఠాపురం వచ్చి చూడు అని చెప్పాను. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు సైతం మన కండువా కప్పుకున్నారు అంటే మన నిజాయతీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం… మనిషి నుంచి మనిషికి రెండు గుండెల దూరం.. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటారు. ఈ రోజు పచ్చగా, కళకళలాడాల్సిన పల్లెలు వైసీపీ పాలన అరాచకాలతో వెలవెలబోతున్నాయి. రైతులకు సాగునీరు లేదు. ప్రజలకు తాగు నీరు దొరకడం లేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది.

ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. ఇలా వైసీపీ పాలనపై కడుపు మండినోడు రోడ్లు మీదకు వస్తే… గ్రామం నుంచి సంగ్రామానికి ఎక్కువ సమయం పట్టదు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసమో… ప్రాంతం కోసమో గొంతెత్తలేదు. కష్టాల్లో ఉన్న ప్రతి మనిషి కోసం గొంతెత్తాను. కులాల వెనకబాటుతనాన్ని గుర్తించే వాడినే తప్ప… కులలతో రాజకీయం చేసేవాడిని కాదు. అరాచకం, రౌడీయిజం రాజ్యమేలుతుంటే 5 కోట్ల మంది ప్రజలు నెగ్గాలని మాకు మేము తగ్గాము.

పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి అంటే పిఠాపురం… పిఠాపురం అంటే అభివృద్ధి అనే స్థాయిలో పిఠాపురం రూపురేఖలు మారుస్తాం అని అన్నారు. పిఠాపురం నుంచి నేను, కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాం. మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలి” అని కోరారు. ఈ సభలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, పిఠాపురం బీజేపీ ఇంఛార్జి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE