– చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం
– పరిశోధనలతో.. యువత పారిశ్రామికవేత్తలుగా మారాలి
– సీఎం చంద్రబాబు సంస్కరణలతోనే ఐటీ రంగం అభివృద్ధి
– రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీదే కీలక పాత్ర
– సిద్ధార్థ సేవలు మరింత విస్తరించాలి.
– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: ప్రపంచపు ఆధునిక పోకడలను అందిపుచ్చుకుని అభివ్రుద్ధి సాధించాలంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి దార్శనికత ఉన్న నేత అవసరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రీసెర్చ్ కాంక్లేవ్ -2025లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విజనరీ లీడర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఐటీ అభివృద్ధి విధానాల వలనే… వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందిన ఎంతో మంది.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఐటీ రంగంలో.. నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. లక్షలాది మంది తెలుగువారికి గౌరవం తీసుకొచ్చింది ఐటీ రంగ ఉద్యోగాలే అన్నారు.
వ్యవసాయ రంగంలో అప్పుడప్పుడూ వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు గ్రామీణ యువత కూడా ఐటీ రంగంలో… కుటుంబానికో ఉద్యోగం సాధించాలని రెండు దశాబ్ధాలకు ముందే పిలుపునిచ్చిన నేత చంద్రబాబు అన్నారు. ముందు చూపుతో ఆయన చెప్పిన మాటలను కొందరు… వ్యవసాయం దండగ అంటూ వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారన్నారు.
గతంలో ఏ విధంగా ఐటీ ప్రాధాన్యతను గుర్తించి అభివ్రుద్ధి చేశారో… ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించి అదే విధంగా అభివ్రుద్ధి చేస్తున్నారని వివరించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెరిగితే… ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగడంతో పాటు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతే కాకుండా కాలుష్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచి ఉత్తమ పరిశోధనలతో అవకాశాలను అందిపుచ్చుకుని ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా యువత మారాలని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
పర్యావరణానికి చేటు చేయకుండా…
రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రతి ఏటా 6 నుంచి 7 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని దానికి తగిన విధంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. థర్మల్ పవర్ వల్ల కాలుష్యం పెరగడంతో పాటు స్థానికులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని… అందుకే సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తు కార్యచరణకు సంబంధించి ప్రధాని పాల్గొన్న ఒక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తాను కూడా పాల్గొన్నానని చెప్పిన గొట్టిపాటి.., 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే పునురుత్పాదక విద్యుత్ పై ప్రజెంటేషన్ ఇచ్చారని., రెండు, మూడు దశాబ్ధాలు ముందు ఆలోచించే ఆయన దార్శినికతకు అదే నిదర్శనమని కొనియాడారు. సమాజానికి ఉపయోగ పడేలా విద్యార్థులు తమ పరిశోధనలు సాగించి మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి గొట్టిపాటి అభిలషించారు.
అదే విధంగా సిద్ధార్థ విద్యా సంస్థల సేవలు కేవలం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలని కోరారు. సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ కళాశాలల నిర్మాణం కోసం అవసరం అయితే ప్రకాశం జిల్లాలో భూమి కేటాయించమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. విద్యా రంగ అభివృద్ధికి సిద్ధార్థ అకాడమీ, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.
అనంతపురం, కర్నూలు కేంద్రంగా క్లీన్ ఎనర్జీ…
శాఖపరంగా ఏవైనా అవసరాలు ఉంటే తాను అందుబాటులో ఉంటానని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో 24 గంటలూ నాణ్యమైన క్లీన్ ఎనర్జీని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు వేలాది మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి వెల్లడించారు. కుసుమ్ పథకంతో రైతులకు, సూర్యఘర్ తో సామాన్య ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
వ్యవసాయానికి పనికిరాని కొన్ని ప్రాంతాల్లోని భూముల్లో సోలార్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని.. దీని వలన ఆయా ప్రాంతాలు అభివృధ్ధి చెందడంతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పస్టం చేశారు. అదే విధంగా రాబోయే దశాబ్ధకాలంలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు
ట్రాన్స్ ఫార్మర్ దొంగల్ని పట్టించేలా…
రాబోయే ఐదేళ్లలో పునురుత్పాదక విద్యుత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపిన మంత్రి గొట్టిపాటి.., ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ డిపార్ట్ మెంట్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన రోబో, ఎలక్ట్రిక్ సైకిల్, రోగులకు ఉపయోగపడే బెడ్ వంటి వివిధ ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి పని తీరుతో పాటు పలు అంశాలపై విద్యార్థులతో మంత్రి ఇష్టాగోష్టి ముచ్చటించారు. అదే విధంగా రైతుల వ్యవసాయ మోటార్లను కొందరు దొంగలు ఎత్తుకు పోతున్నారని దీనివలన అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థులకు వెల్లడించారు. విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ పరంగా దొంగతనాల నివారణకు తాము కొన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అయినా విద్యుత్ మోటార్లలో ఉండే కాపర్, అల్యూమినియం కోసం అక్కడక్కడా పొలాల్లో వ్యవసాయ మోటార్ల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వాటిని ఆపేందుకు… ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాలు జరగకుండా.. రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఉన్న అవకాశాలపై పరిశోధనలు చేయాలని విద్యార్థులను మంత్రి ప్రోత్సహించారు. ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనానికి ప్రయత్నించినప్పుడు అలారం మోగడమో లేక… సమాచారం రైతులకు తెలిసే విధంగా… ఏవైనా కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు ప్రయత్నించాలన్నారు.
కార్యక్రమం అనంతరం సిద్దార్థ అకాడమి నిర్వహకులు మంత్రి గొట్టిపాటిని దుశ్సాలువాతో సత్కరించి గౌతమ బుద్ధని బొమ్మను బహూకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్ అహ్మద్, సిద్దార్థ అకాడమి అధ్యక్షులు మలినేని రాజయ్య, సిద్దార్థ అకాడమి ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్స్ లర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ ఛాన్స్ లర్ ఏవీ.రత్నప్రసాద్, కాంక్లేవ్ ఆర్గనైజర్ డా.ఎం.సునీతతో పాటు వివిధ విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.