Suryaa.co.in

Andhra Pradesh

సెంట్రల్ లో ఘనంగా వైఎస్సార్ ఆసరా ముగింపు వేడుకలు

– క్షీరాభిషేకాలతో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన అక్కచెల్లెమ్మలు
– మహిళాభ్యున్నతితో నవశకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి
– రెండున్నరేళ్లల్లో ఐదు పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు
– చంద్రబాబు అబద్ధాలను ఎంత వడ్డించి వార్చినా ప్రజలు నమ్మరు
– ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ ను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు వేడుకలు సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాధా నగర్లో 63, 64 డివిజన్ లకు సంబంధించి జ‌రిగిన సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు , డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. తొలుత దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్రపటానికి పూల‌మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆసరాతో అక్కచెల్లెమ్మలకు బాసటగా నిలిచిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
తదనంతరం మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను పెద్దఎత్తున విజయవంతం చేసిన మహిళలందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. 2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలను నిలువునా మోసగించారన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆసరా రెండో విడత నగదుకు ఎవరి రికమండేషన్‌ లేకుండానే.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. డ్వాక్రా సంఘాలు కట్టే అప్పులు, వడ్డీలతోనే బ్యాంకులు నడుస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. అటువంటి మహిళలను వ్యాపారవేత్తలుగా చూడాలన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పాన్ని.. పరిపూర్ణం చేస్తున్న తనయుడిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. పేదల జీవన ప్రమాణాలు, స్థితి గతులలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సంక్షేమం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తుంటే.. దానిపై కూడా విమర్శలు గుప్పిస్తూ సోమరిపోతులను చేస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడం బాధాకరమన్నారు.

సెంట్రల్ లో రూ. 175 కోట్ల సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్ ది

ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు జనానికి చీకటి రుచి చూపిస్తే.. రెండున్నరేళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వెలుగులు చూపారని మల్లాది విష్ణు అవ్వా తాతల పెన్షన్‌ పెంపుపై తొలి సంతకం మొదలుకొని రెండో విడత వైఎస్సార్ చేయూత వరకు ఎక్కడా సంక్షేమంలో మడమ తిప్పని ముఖ్యమంత్రిగా కీర్తి గడించారన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 32,510 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రెండు విడతలు కలుపుకుని రూ. 60 కోట్ల వరకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. ఇవే కాకుండా నియోజకవర్గంలో 32,143 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, 38,427 మంది తల్లులకు అమ్మ ఒడి, దాదాపు 25 వేల మందికి పింఛన్ ను అందించడం జరుగుతోందన్నారు.
6,785 మంది విద్యార్థులకు విద్యా దీవెన, 5,992 మంది విద్యార్థులకు వసతి దీవెన, 6వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున ఆర్థికంగా చేయూతనందించడం జరిగిందన్నారు. మొత్తంగా గడిచిన రెండున్నరేళ్లల్లో దాదాపు రూ. 175 కోట్ల సంక్షేమాన్ని నియోజకవర్గ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించినట్లు వివరించారు. సంక్షేమంతో పాటుగా ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు సత్వర పరిష్కారం చూపుతుండటంతో.. అతి తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని మల్లాది విష్ణు అన్నారు.

విద్య, వైద్య రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శం

గడిచిన రెండున్నరేళ్లలో విద్యా, వైద్య రంగాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని మల్లాది విష్ణు తెలిపారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తపన అని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అందక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడంతో పాటు.. నాడు-నేడు కార్యక్రమంతో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పేరంట్స్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.
కరోనా సమయంలో ప్రజల అవసరాలను, ఇబ్బందులను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, అయోధ్యనగర్, గుణదల ప్రాంతాలలో 4 ఆరోగ్య కేంద్రాలను ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలకు ఉచితంగా ప్రాథమిక వైద్యం అందుతుందనే భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఆస్పత్రిలో రూ. వెయ్యి బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. ఆస్పత్రులకు బకాయిలను సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆస్పత్రుల వివరాలు ఫోన్ నెంబర్లతో సహా వార్డు సచివాలయాలలో ప్రదర్శింపజేయాలని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆదేశించడం జరిగిందన్నారు.

విద్యుత్ కోతలపై ప్రతిపక్షాల వదంతులు నమ్మవద్దు

దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాయడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్‌కోను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సీఎం సూచనల ప్రకారం తగిన చర్యలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి విద్యుత్‌ కోతలను ఎదుర్కోవడం లేదని, రాబోయే రోజుల్లో కూడా కోతలు ఉండవన్నారు. అన్ని వర్గాల వినియోగదారులకు రోజంతా నాణ్యమైన విద్యుత్‌ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కానీ భారీగా విద్యుత్‌ కోతలుంటాయని, రాత్రి వేళ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గంటల తరబడి చీకట్లు తప్పవంటూ సోషల్‌ మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే తప్ప రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పొద్దు గడవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఇటువంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దేశంలో ఎక్కడ ఏమూలన ఏం జరిగినా దానిని ఈ ప్రభుత్వానికి ఆపాదించడం తెలుగుదేశం నాయకులకు అలవాటైందన్నారు. బోడి గుండుకి మోకాలుకి ముడిపెట్టే చందాన రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు వ్యవహార శైలి ఉందన్నారు. ఇకనైనా అబద్ధాలను వండివార్చడం మానుకోవాలని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా రెండో విడతకు సంబంధించి 64వ డివిజన్ లో 281 గ్రూపులకు గాను రూ. 2 కోట్ల 66 లక్షల 42 వేల 688 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరొక కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర మహిళలకు దసరా పండుగ వైభవాన్ని ఆసరా రూపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వారి హృదయాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో పేదలకు నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు యర్రగొర్ర తిరుపతమ్మ, మోదుగుల తిరుపతమ్మ, అలంపూరు విజయలక్ష్మి, ఎండి. షాహినా సుల్తానా, ఇసరపు దేవి, పెనుమత్స శిరీష, కొండాయిగుంట మల్లీశ్వరి, బంకా శకుంతలాదేవి, ఉద్దంటి సునీత, జానారెడ్డి, బాలి గోవింద్, శర్వాణి మూర్తి, కొంగితల లక్ష్మీపతి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, అధికారులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE