Home » ఆ రోజు మాటిచ్చాను

ఆ రోజు మాటిచ్చాను

– వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ ఆసరా
– ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌
– అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంభన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారి చేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
– రెండవ విడతగా సుమారు రూ.6,440 కోట్ల ఆర్ధిక సాయాన్ని జమచేసే కార్యక్రమాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌
ఒంగోలు: ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:
ఎంతో ఆప్యాయతను చూపిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు,చెల్లెమ్మకు, అవ్వాతాతలకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి…. ఈ రోజు నుంచి ఆసరా ఉత్సవాలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలందరికీ కూడా పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే నవరాత్రుల ప్రారంభం రోజునే..
ఈ రోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. స్త్రీని శక్తి స్వరూపిణిగా, అమ్మవారిగా భావించి, కొలిచే నవరాత్రులు ప్రారంభమవుతున్న ఈ రోజు నా అక్కచెల్లెమ్మల మధ్య ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాను.
ఆ రోజు మాటిచ్చాను
మీ అన్నగా, తమ్ముడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలను, ఇబ్బందులను చూసి మీకు ఒక మాటిచ్చాను. ఆ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటూ అందులో ఒకటైన పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్ధానాన్ని వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్‌ ఆసరా ద్వారా, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రెండో విడతగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాను.వైఎస్సార్‌ ఆసరా రెండో విడత డబ్బును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై ఈనెల 18వ తేదీ వరకు జరుగుతుంది.
2 రోజులు మినహా ఈ నెల 7–18 వరకు ఆసరా..
మండలం ఒక యూనిట్‌గా ఈ కార్యక్రమం ఇవాల్టి నుంచి 18 వరకు జరుగుతుంది. ప్రజా ప్రతినిధులంతా కూడా ఈ ఉత్సవంలో దగ్గరుండి పాలుపంచుకుంటారని తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా 7వ తేదీన (ఇవాళ) ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఒక్క 13, 15 తేదీలలో పండగ సందర్భంగా రెండు రోజులు అధికారులకు వెసులుబాటు కల్పించేందుకు మినహాయించాం. మిగిలిన రోజుల్లో ఈకార్యక్రమం 7 నుంచి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా 18 వ తేదీ లోపున ఈ కార్యక్రమం పూర్తవుతుంది.
వైయస్సార్‌ జిల్లాలో నవంబరులో ఆసరా…
ఒక్క వైయస్సార్‌ కడప జిల్లాలో మాత్రం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్నికల కోడ్‌ ఉంది కాబట్టి కోడ్‌ ముగిసిన తర్వాత నవంబరు 6 నుంచి 15 తారీఖు వరకు కడప జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో లేని విధంగా…
రాష్ట్రంలోని 7.97 లక్షల పొదుపుసంఘాల్లో ఉన్న 78 లక్షల 76 వేల అక్కచెల్లెమ్మలకు వాళ్లు 2019 ఏప్రిల్‌ మాసం వరకు అంటే ఎన్నికల జరిగే సమయం వరకు వాళ్లు బాకీ పడిన మొత్తం రూ. 25,512 కోట్లను నాలుగు విడతల్లో వారి చేతికే అందిస్తామన్న మాటకు కట్టుబడి వరుసగా రెండో సంవత్సం రూ.6,440 కోట్లు ఈరోజు నుంచి 18 వరకు పొదుపు సంఘాలకు జమ చేయనున్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఇలా అక్కచెల్లెమ్మలకు నేరుగా అందించే ఈ కార్యక్రమం దేవుడి దయతో ఒక్క మన ప్రభుత్వం తప్ప దేశచరిత్రలో కూడా బహుశా ఎక్కడా జరిగి ఉండదేమో అని ఈ సందర్భంగా సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా, చెల్లెమ్మకు అన్నగా తెలియజేస్తున్నాను.
చంద్రబాబు మాట నమ్మి మోసపోయిన అక్కచెల్లెమ్మలు…
ఇక్కడ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కొన్ని విషయాలు చెప్పాలి. స్వయం సహాయక సంఘాల రుణమాఫీ చేస్తామని, రుణాలు కట్టొద్దని 2014 ఎన్నికల్లో.. అప్పట్లో చంద్రబాబు గారు ఇచ్చిన మాట నమ్మి ఓటు వేసి, చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కిస్తే ఆ అక్కచెల్లెమ్మలను ఆయన దగా చేసిన పరిస్ధితులను మన కళ్లారా చూశాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు అప్పట్లో చంద్రబాబు మాట నమ్మి రుణాలు కట్టని కారణంగా అసలు, వడ్డీలు, ఆపై వడ్డీల మీద వడ్డీలు కూడా కలిసి 2019 ఎన్నికల నాటికి అవి తడిసి మోపుడయ్యాయి. ఎస్‌ఎల్‌బీసీ తుది నివేదికల ప్రకారం 2014లో అక్షరాలా రూ.14,204 కోట్లు ఉన్న పొదుపు సంఘాల రుణాలు అసలు, వడ్డీలు, ఆ వడ్డీల మీద వడ్డీలు కలిసి 2019 ఎన్నికల నాటికి రూ. 25,517 కోట్లుకు చేరాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫలితంగా అవి కట్టలేని పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలు రోడ్డున పడే పరిస్థితి. ఈ పొదుపు సంఘాలలో 18.36 శాతం పొదుపు సంఘాలు బకాయిలు చెల్లించలేక మూత పడిపోయాయి. అంటే ఎన్‌పీఏలుగా మిగిలిపోయిన పరిస్థితిల్లోకి చేరుకున్నాయి. మిగిలిన చాలా సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా వాటి పరపతి కూడా దెబ్బతిని అప్పటి వరకు ఏ గ్రేడ్‌ సంఘాలుగా ఉన్న సంఘాలన్నీ కూడా సీ గ్రేడ్, డీ గ్రేడ్‌లోకి దిగజారిపోయిన పరిస్థితులు మన కళ్లెదుటనే కనిపించాయి.
చంద్రబాబు ప్రభుత్వం – సున్నా వడ్డీ పథకం రద్దు
గత ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తానని చేసిన వంచన వల్ల చివరకు రుణమాపీ కథ దేవుడెరుగు అప్పటివరకు ఉన్న సున్నావడ్డీ పథకం కూడా 2016 అక్టోబరు నుంచి గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల మధ్య పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సుమారు రూ.3036 కోట్లు బ్యాంకులకు అపరాధ వడ్డీ కింద చెల్లించాల్సిన దుస్ధితి కూడా ఏర్పడింది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో పొదుపు సంఘాలు అక్కచెల్లెమ్మలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో సహాయం అందించలేకపోతే.. గ్రామీణ వ్యవస్ధ పేద వాడికి సంబంధించిన అక్కచెల్లెమ్మల డ్వాక్రా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయే పరిస్థితుల మధ్య ఆసరా కార్యక్రమానికి బీజంపడింది.
పాదయాత్రలో నేను చెప్పిన మాటలు…
చంద్రబాబు కారణంగా రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు నష్టపోయిన పరిస్ధితి ఉంటే ఆ పరిస్థితుల్లో నా పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు నేను చెప్పిన మాటలు, మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు నేను చెప్పిన మాటలు కూడా ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
వైఎస్సార్‌ ఆసరాకు శ్రీకారం…
ఆ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఎన్నికల తేదీ ఏప్రిల్‌ 11, 2019 నాటికి స్టేట్‌లెవల్‌ బ్యాంకర్స్‌ తుది నివేదిక ప్రకారం ఉన్న 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78 లక్షల 76 వేల మంది అక్కచెల్లెమ్మలకు, వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆ మొత్తం అప్పు రూ.25,517 కోట్లు నాలుగు విడతల్లో వారికే ఇచ్చి, వారిని మళ్లీ ఆర్ధికంగా నిలదొక్కుకునేలా, అప్పుల ఊబినుంచి బయటపడేలా చేసే లక్ష్యంతో వైఎస్సార్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టాం.
ఇందులో భాగంగానే మొదటి విడత రూ.6318 కోట్ల రూపాయలు గత సంవత్సరం వారి చేతికే అందించడం జరిగింది. ఇప్పుడు రెండో విడత మరో రూ.6439 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల చేతికే అందిస్తున్నాం. ఈ రెండు విడతలు మొత్తంగా రూ.12,759 కోట్లు ఈ రోజుతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా వారి చేతుల్లోనే పెట్టినట్లవుతుంది.
సున్నా వడ్డీ పథకం – పునరుద్ధరణ
అంతేకాకుండా 2016 అక్టోబరులో రదై్దన సున్నావడ్డీని మళ్లీ పునరుద్ధరించి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అనే పేరుపెట్టి తద్వారా సకాలంలో రుణాలు చెల్లించిన 9.41 లక్షల స్వయం సంఘాలకు 98 లక్షల అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ రెండు సంవత్సరాలలో సున్నావడ్డీ పథకం కింద అక్షరాలా రూ.2362 కోట్లు జమ చేయడం జరిగింది.
ప్రతి ఏటా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వమే నేరుగా ఈ సున్నావడ్డీ పథకం అమలు చేస్తున్నందున ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి అక్కకూ చేయూత నిస్తుండగా, చేయూత అనే కార్యక్రమంతో ప్రతి అక్కచెల్లెమ్మనూ చేయిపట్టి నడిపిస్తున్నాం.
ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న నేపధ్యంలో పొదుపుసంఘాల్లో ఇంతకుముందు నిరర్దక ఆస్తులు అంటే కట్టలేక చేతులెత్తేసిన అక్కచెల్లెమ్మలు 18.36 శాతం గ్రూపులన్నీ కూడా సి గ్రేడ్, డి గ్రేడ్‌ జాబితాలోకి దిగజారిన పరిస్థితుల మధ్య మనం చేస్తున్న ఆసరా కార్యక్రమం, చేయూత ద్వారా తోడు, సున్నావడ్డీ పథకాలన్నింటి ద్వారా ఈ రోజు రాష్ట్రంలో అక్షరాలా నిరర్ధక ఆస్తులు అక్కచెల్లెమ్మల ఎస్‌హెచ్‌జీలలో చూస్తూ కేవలం 0.73 శాతం మాత్రమే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను.
అంటే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ తన కాలుమీద తను నిలబడుతుందని సంకేతం. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో సి గ్రేడ్, డి గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలన్నీ కూడా మన ప్రభుత్వం అందించిన సహాకారంతో తిరిగి మళ్లీ ఈ రోజు ఏ గ్రేడ్‌లోకి చేరాయి.
ఇవాళ బ్యాంకులకు అక్కచెల్లెమ్మలకు కడుతున్న రికవరీ రేటు ఎంతంటే 99.5 శాతంగా నమోదవుతుందని ఈ రోజు సగర్వంగా చెబుతున్నాను.
అక్కచెల్లెమ్మలు– మన చరిత్రను తిరగరాస్తున్నారు
మన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చరిత్రను మనము తిరగరాయిస్తే… మన అక్కచెల్లెమ్మలే మన చరిత్రను, మన రాష్ట్ర చరిత్రను తిరగరాస్తున్నారని, పని చేస్తున్న ప్రభుత్వానికి నిండు మనసుతో దీవెనలిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలతో మొదలైతే మున్సిపల్‌ ఎన్నికలు, కార్పొరేషన్‌ ఎన్నికలు ఆ తర్వాత తిరుపతి ఉపఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏది చూసినా కూడా మీరు నా మీద, మనందరి ప్రభుత్వం మీద చూపిస్తున్న ఆదరణకు ఈ ఆప్యాయతలకు ఇవే ఎన్నికలే అద్దం పడతాయి.
మీ ఆప్యాయతలకు ఎంత చేసినా తక్కువే..
ఈ ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు మీకు ఎంత చేసినా తక్కువే అని మరొక్కసారి అక్కచెల్లెమ్మలకు తెలియజేస్తున్నాను. నిండు మనస్సుతో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు సుస్ధిరమైన ఆదాయం కూడా కల్పించి వారి జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. అందులో భాగంగానే వైఎస్సార్‌ చేయూత అనే పథకాన్ని కూడా తీసుకువచ్చాం. ఏదో చేసామంటే చేసామని కాకుండా వరుసగా అదే అక్కచెల్లెమ్మలకు నాలుగేండ్లు పాటు ప్రతి సంవత్సరం చేయూతనందిస్తూ.. ఆసక్తి కనపర్చిన అక్కచెల్లెమ్మలందరికీ కూడా చేయూత సహాయమే కాక సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్, శిక్షణ ఇటువంటి అన్ని సహకారాలు ఇస్తున్నాం.
బహుళ జాతి సంస్ధల సహాకారం…
వారికి జీవనోపాధి మార్గాలను చూపిస్తూ, ఎటువంటి రిస్క్‌ కూడా లేకుండా, వీరు ఎక్కడా నష్టపోకూడదన్న తపన, తాపత్రయంతో వాళ్లు వ్యాపారాలు నిర్వహించేందుకు ఇప్పటికే పీ అండ్‌ జీ, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్‌ లీవర్, అమూల్, అల్లానా గ్రూపు, మహేంద్ర గ్రూప్, కేతీ గ్రూపు, తానాగెర్‌ వంటి వ్యాపార దిగ్గజాలు, బహుళజాతి సంస్ధలు వీరితో పాటు బ్యాంకులతో కూడా ఒప్పందాలు చేసుకుని ప్రతి అక్కచెల్లెమ్మను కూడా వ్యాపారవేత్తలగా రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఅడుగులోనూ తోడుగా ఉండి నడిపించాం.
అదనపు ఆదాయం
కార్పొరేట్‌ సంస్ధలు బ్యాంకులతో అనుసంధానం చేసి మనందరి ప్రభుత్వం అందించిన ఈ సహకారంతో ఇప్పటివరకు 3,05,754 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు, ఆవులు, గేదేలు, గొర్రెలు, మేకలు వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7వేలు నుంచి రూ.10 వేలు వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు కూడా ఈరోజు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను.
ఆంధ్ర ప్రదేశ్‌ మహిళా చరిత్రను మార్చేలా…
అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ మహిళా చరిత్రను, వారి సామాజిక, ఆర్ధిక, రాజకీయ చరిత్రను కూడా మారుస్తూ మనం అమలుచేస్తున్న పథకాలను కొన్నింటిని, వాటి వల్ల కలుగుతున్న మంచిని సవినయంగా నాలుగు మాటల్లో మీ ముందుంచుతున్నాను.
21 శతాబ్ధపు ఆధునిక మహిళ ఏపీ నుంచే..
21వ శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భించాలని నిండు మనస్సుతో, చిత్తశుద్ధితోమనందరి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 44.50 లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ప్రతిఏటా రూ.6500 కోట్లు చొప్పున ఇప్పటికే రూ.13,023 కోట్లు నేరుగా ఆ చెల్లెమ్మలకే అందజేయడం జరిగింది.
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్‌లు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అక్టోబరు 2018 వరకు అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్‌ల సంఖ్య ఎంతంటే… కేవలం 44 ల„ý లు అని చెప్పి, 90 శాతం పెన్షన్‌ అంటే 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చే పరిస్థితి. ఈ రోజు ఏకంగా 61 లక్షల మందికి ఇస్తున్నాం. అప్పట్లో వేయి రూపాయలిస్తే… ఈరోజు రూ.2250 ప్రతినెలా ఇస్తున్నాం. అప్పట్లో నెలకు ప్రభుత్వానికి రూ.450 కోట్లు కూడా ఖర్చు కాని పరిస్ధితి. ఈ రోజు ప్రభుత్వానికి నెలకు రూ.1450 కోట్లు ఖర్చవుతుందని తెలియజేస్తున్నాను. ఈ 61 లక్షల పెన్షన్‌లలో అక్షరాలా 36.70 లక్షల మంది అవ్వలు, మహిళా వికలాంగులు, వితంతువులు ఉన్నారు.
వైఎస్సార్‌ ఆసరా
వైఎస్‌ఆర్‌ ఆసరా.. ఈ పథకం ద్వారా ఇప్పటికే 7.97 లక్షల పొదుపు సంఘాల బృందాలకు అక్షరాలా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈ రెండు విడతలతో నేరుగా అందించిన లబ్ధి రూ.12,758 కోట్లవుతుంది. వైఎస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మంది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అక్కలకు, చెల్లెమ్మలకు రెండు విడతలుగా అందించిన లబ్ది రూ.8944 కోట్లు.
వైఎస్సార్‌ జగనన్న కాలనీలు…
వైఎస్సార్‌ జగనన్న కాలనీలు.. ఆ ఇంటి స్ధలాల విలువలు చేస్తూ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు గృహనిర్మాణం ద్వారా 31 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది ఎంతంటే దాదాపుగా 1 కోటి 25 లక్షల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు. వీరందరికీ ఒకేసారి ఇళ్ల స్ధలాలు చేతికందించడమే కాకుండా, ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇంటి నిర్మాణం పూరై్తన తర్వాత ఒక్కో ఇంటి విలువ కనీసం… ప్రతి అక్క చేతిలోనూ రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల రూపాయులు నేరుగా అందించినట్టవుతుంది. అక్షరాలా ఈ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్లు సంపద వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది.
జగనన్న విద్యాదీవెన– ఫీజు రీయింబర్స్‌మెంట్‌
ఇవికాక జగనన్న విద్యాదీవెన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఏ ఒక్క అక్కచెల్లెమ్మ కూడా తన పిల్లలను చదివించలేని పరిస్ధితి రాకూడదని ఈ పథకం ద్వారా 18.81 లక్షల మంది తల్లులకు రూ.5573 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. పిల్లలను చదివించలేని పరిస్థితి ఉండే తల్లిదండ్రులకు జగనన్న వసతి దీవెన ద్వారా ఆ పిల్లలకు హాస్టల్, భోజనం ఖర్చులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి… పిల్లల చదువు ఆగిపోకూడదని, వారు చదివితేనే తలరాతలు మారుతాయని ఆలోచించి జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలను పెద్ద చదువు చదివిస్తున్న 15.58 లక్షల మంది అమ్మల ఖాతాల్లోకి ఆ పిల్లల లాడ్జింగ్‌ ఇతర ఖర్చుల కోసం రూ.2270 కోట్లు నేరుగా అందించాం.
వైఎస్సార్‌ సున్నావడ్డీ
వైఎస్సార్‌ సున్నా వడ్డీ..ఇది ఇస్తేనే అక్కచెల్లెమ్మలు నిలబడగలుగుతారు అని చెప్పి రద్దయిన సున్నావడ్డీ పథకాన్ని వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకంగా అమలు చేస్తూ దాదాపుగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2354 కోట్లు నేరుగా వారికి అందించాం.
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణం
ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ తోడుగా ఉండాలి. గర్భిణీ అయిన తోడుగా ఉండాలి, బాలింత అయినా తోడుగా ఉండాలి. గర్భణీల స్ధాయి నుంచి బాలింతల వరకు పౌష్టిహారం అందించగలిగితే వాళ్లు క్షేమంగా ఉంటారు. పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణం ద్వారా గర్బిణీలు, బాలింతలకు ఆహారం అందించడమే కాకుండా, 6 యేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలన్నీ కూడా వైఎస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ ఇంగ్లిషు మీడియం స్కూళ్లుగా మారుస్తూ అడుగులు వేశాం. వైయస్సార్‌ సంపూర్ణ పోషణం పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు చేస్తూ రూ.2881 కోట్లు ఖర్చు చేశాం.
వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా 3 లక్షల 28 వేల మందికి రూ.982 కోట్లు లబ్ధి జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను.
పదవుల్లో, పనుల్లో 50 శాతం…
దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ కాంట్రాక్టులలో 50 శాతం మహిళలకే కచ్చితంగా దక్కేలా చట్టసభలో
చట్టమే చేశాం.
ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర కేబినెట్‌లో హోంమంత్రిగా తొలిసారిగా ఓ మహిళకు స్ధానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రిగా ఎస్టీ మహిళకు స్ధానం దక్కింది. ఎమ్మెల్సీలుగా మనం పంపించిన వారి జాబితా చూస్తే ఇద్దరు మైనార్టీ మహిళలను ఎమ్మెల్సీలుగా పంపించాం. ఒక బీసీ మహిళకు స్ధానం కల్పించాం. 28 నెలల కాలంలోనే ఇవన్నీ జరిగాయి.
చివరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా కూడా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను నియమించడం కూడా మన ప్రభుత్వంలోనే.
నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు, డైరెక్టర్లు వీళ్లలో మహిళల్లో అక్షరాలా 52 శాతం పదవులు దక్కాయి.
అంతే కాకుండా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయితీల ఛైర్మన్లు, మేయర్లు వీటన్నింటిలో కూడా సగ భాగానికి పైగా మన అక్కచెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది. ఏకంగా ఈ పదవుల్లో 60.47 శాతం పదవులిచ్చాం.
పరిషత్‌ ఎన్నికల్లోనూ…
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నికల పదవులు చూస్తే రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవం కనిపిస్తోంది. 13 జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్ధానాల్లో 7 మంది మహిళలే కనిపిస్తున్నారు. ఈ జిల్లా (ప్రకాశం) పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కూడా మహిళే, నాకు తల్లిలాంటిది. మేయర్‌ (ఒంగోలు) కూడా నాకు అక్కలాంటిదే. వైస్‌ ఛైర్మన్‌ పదవుల్లో 13 జిల్లా పరిషత్‌లకు గానూ ఏకంగా 26 వైస్‌ ఛైర్మన్‌ పదవులుంటే… ఏకంగా 15 మంది మహిళలే ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను.
మహిళల పట్ల జగన్మోహన్‌రెడ్డి అప్యాతకు ఇదే నిదర్శనం
ఇవి చాలదా మహిళల పట్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, జగన్మోహన్‌రెడ్డికి ఉన్న ప్రేమాభిమానాలకు, అప్యాయతలకు ఇవి నిదర్శనాలు సరిపోవా అని అడుగుతున్నాను. అంతేకాకుండా మద్యాన్ని నియంత్రించ గలిగాం, దిశ చట్టాన్ని చట్టసభలో ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. దిశ యాప్‌ ఈ రోజు అక్షరాలా 75 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో సెల్‌ఫోన్‌లలో ఉంది. ఏ ఒక్క అక్కచెల్లెమ్మ అయినా కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఆ ఫోన్‌ను ఒక ఐదు సార్లు అటూ, ఇటూ షేక్‌ చేస్తే చాలు, వెంటనే పదినిమిషాల్లో పోలీసులు మీ దగ్గరకు వచ్చి అమ్మా ఏం జరిగింది అనే పరిస్దితుల్లో దిశ యాప్‌ ఉంది. దిశ పోలీస్‌ స్టేషన్లు కనిపిస్తున్నాయి. దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కనిపిస్తున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ మన కళ్లెదుటనే మహిళా పోలీసు కూడా కనిపిస్తుంది.
చిట్టి తల్లుల కోసం స్వేచ్ఛ కార్యక్రమం..
ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ చిట్టితల్లులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతుంది. 7 వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న చిట్టి తల్లుల కోసం స్వేచ్చ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇలా అడుగడుగునా మహిళా పక్షపాతం చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ… ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.
చివరగా…
ఒంగోలు పట్టణంలో మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.400 కోట్ల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయని… మొదటి టన్నెల్‌ పనులు పూర్తి అయ్యాయని సీఎం చెప్పారు. రెండో టన్నెల్‌ పనులు కూడా వేగవంతం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌లో ఆగష్టు 2022 నాటికి నీళ్లు పారుతాయని, 3 వేల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్‌ అవుతుందని, మరో 9వేల క్యూసెక్కుల డిశ్చార్జ్‌ కెపాసిటీతో పిబ్రవరి 2023 నాటికి రెండో టన్నెల్‌ కూడా పూర్తి చేస్తామన్నారు. వెలుగొండ నాన్న కలల గన్న ప్రాజెక్టు అని .. కచ్చితంగా పూర్తవుతుందన్నారు. అనంతరం సీఎం వైయస్‌.జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

Leave a Reply